– ప్రతి గ్రామంలో బాబు బస్సు యాత్ర
– ఉత్తరాంధ్రలో లోకేష్ పాదయాత్ర
– రాయలసీమలో బాబు బస్సు యాత్ర
– ఎన్నికల వరకూ జనంలోనే తండ్రీకొడుకులు
– ‘మన కోసం’ పేరుతో టీడీపీ యాత్రలు
– ఇక మంత్రులు, ఎమ్మెల్యేలపై నిఘాకు ప్రైవేటు ఇంటలిజన్స్ విభాగం
– పోలీసు అధికారులపై ఇక ప్రైవేటు కేసులు
– వేధించే డీఎస్పీ-ఐపిఎస్ అధికారుల ఆస్తులపై నజర్
( మార్తి సుబ్రహ్మణ్యం)
రానున్న ఎన్నికల వరకూ జనం మధ్యలోనే ఉండేలా తెలుగుదేశం పార్టీ కార్యాచరణ రూపొందించింది. అందులో భాగంగా పాదయాత్ర, బస్సు యాత్రలు నిర్వహించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. రాయలసీమ, ఉత్తరాంధ్రలో ఈ యాత్రలు చేపట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో తన పార్టీ నేతలను వేధిస్తున్న పోలీసు అధికారులపై, ఇక విస్తృతంగా ప్రైవేటు కేసులు వేయడంతోపాటు.. స్థానికంగా వైసీపీ ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు భారీ సంఖ్యలో న్యాయవాదులను నియమించేందుకు సిద్ధమవుతోంది. అదే సమయంలో తమ పార్టీ నేతను బెదిరిస్తున్న పలువురు డీఎస్పీ-ఐపీఎస్ స్థాయి అధికారుల ఆస్తులు, ఇప్పటివరకూ వ చ్చిన ఆరోపణలు తెలుసుకునేందుకు, ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేయనున్నట్లు సమాచారం.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు బస్సుయాత్ర, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్ర చేసేందుకు నిర్ణయించారు. మేలో హైదరాబాద్‌లో మహానాడు నిర్వహించేందుకు సమాయాత్తమవుతున్న తెలుగుదేశం పార్టీ, అది ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో అగ్రనేతలిద్దరూ జనం మధ్యనే ఉండేలా కార్యాచరణ రూపొందించింది. అందులో భాగంగా.. జూన్‌లో చంద్రబాబు నాయుడు బస్సు యాత్ర, లోకేష్ పాదయాత్రకు పార్టీ సిద్ధమవుతోంది.
లోకేష్ పాదయాత్ర పూర్తి స్థాయిలో ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఉండేలా రూపొందిస్తున్నారు. లోకేష్ తన పాదయాత్రలో ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలూ ఉండేలా పార్టీ యంత్రాంగం ప్రణాళిక ఖరారు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక పార్టీ అధినేత చంద్ర బాబునాయుడు అదే సమయంలో రాయలసీమలోని చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరులో కొంత భాగంలో బస్సు యాత్ర ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. చంద్రబాబునాయుడు తన బస్సు యాత్రలో, రాయలసీమలోని ప్రతి గ్రామాన్ని సందర్శించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ప్రభుత్వ వ్యతిరేకత బాగా ఉందని పార్టీ వర్గాలు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది.
కడపలో కొన్ని కీలక నియోజకవర్గాల్లో కూడా వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు, పార్టీ నిర్వహించిన సర్వేలో వెల్లడయినట్లు సమాచారం. ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా వినియోగించుకోవాలంటే, అక్కడ చంద్రబాబు పర్యటించడమే మంచిదన్న సూచన పార్టీ వర్గాల నుంచి వ్యక్తం కావడంతో, చంద్రబాబు సీమలో బస్సు యాత్ర నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇక గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీడీపీ విజయం ఖాయమని, జనసేనతో పొత్తు పెట్టుకుంటే ఇక విజయం గురించి ఆలోచించాల్సిన పనిలేదని, పార్టీ నిర్వహించిన సర్వేలో వెల్లడయినట్లు తెలుస్తోంది. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితి ఉన్నందున, పార్టీ నిస్తేజంగా ఉన్న రాయలసీమ-ఉత్తరాంధ్రపై పూర్తి స్థాయి దృష్టి పెట్టడమే మంచిదన్న కోణంలోనే, చంద్రబాబు రాయలసీమ-లోకేష్ ఉత్తరాంధ్రలో యాత్రలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎన్నికల వరకూ వీరిద్దరూ జనం మధ్యలోనే ఉండేలా షెడ్యూల్ రూపొంచినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కాగా ఈ పాదయాత్ర-బస్సుయాత్రలకు మనకోసం పేరు ఖరారు చేసినట్లు చెబుతున్నారు. రాష్ట్ర విభజనకు ముందు చంద్రబాబు ‘మీకోసం’ పేరుతో యాత్ర నిర్వహించ గా, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి మేరకు మనకోసం పేరునే ఖరారుచేయవచ్చంటున్నారు. మహానాడు తర్వాత జూన్ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రల్లో బాబు-లోకేష్ వెంట ఉంటే బృందాలపై కసరత్తు కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా… పార్టీ అగ్రనేతలు, నియోజకవర్గ స్థాయి నేతలపై ప్రభుత్వం సీఐడీ, స్థానిక పోలీసులను ప్రయోగించి భయభ్రాంతులకు గురిచేస్తున్న నేపథ్యంలో.. పార్టీపరంగా లీగల్ సెల్‌ను బలోపేతం చేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. అందులో భాగంగా 230 మంది న్యాయవాదులను ఫుల్‌టైమర్లుగా నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం. నియోజకవర్గ-జిల్లా-రాష్ట్ర స్థాయి కేసుల బట్టి, న్యాయవాదులు స్పందించనున్నారు. ఆ మేరకు పార్టీ ప్రధాన కార్యాలయంలో లీగల్ సెల్‌ను ఏర్పాటుచేసి, కేసులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నట్లు సమాచారం. ప్రధానంగా.. ఎన్నికల సమయం సమీపించేకొద్దీ, కీలకమైన సోషల్‌మీడియా కార్యకర్తలపై వైసీపీ సర్కారు మరిన్ని కేసులు పెట్టే ప్రమాదం ఉన్నందున, వాటిని ఇప్పటినుంచే ఎదుర్కొని కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు నాయకత్వం సిద్ధమవుతోంది. అందులో భాగంగానే.. లీగల్ సెల్‌ను మరింత పటిష్టం చేయాలని నిర్ణయించింది.
ప్రధానంగా ఎన్నికలు సమీపించే కొద్దీ పార్టీ నేతలు, ముఖ్య కార్యకర్తలపై పోలీసు వేధింపులు పెరిగే అవకాశం ఉన్నందున.. పార్టీపరంగా సొంత ఇంటలిజన్స్ విభాగం ఏర్పాటుచేయాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ విభాగం పోలీసుస్టేషన్ల వారీగా ఉన్న అధికారుల పనితీరును సమీక్షిస్తుంది. వైసీపీ ఎమ్మెల్యేల ఒత్తిళ్లకు లొంగి పనిచేసే అధికారులను గుర్తించి, వారి గత రికార్డులను తెలుసుకుంటుంది.
ఆ మేరకు వారిపై ఎప్పటికప్పుడు ప్రైవేటు కేసులు వేయడం ద్వారా, క్యాడర్‌ను కాపాడుకోవాలన్నది నాయకత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. గతంలో పోలీసువిభాగంలో పనిచేసిన రిటైరయిన అధికారుల సేవలు ఇందుకు వాడుకోనుంది. ఇప్పటికే వివిధ స్థాయిలోని మాజీ పోలీసు అధికారులు, ఆమేరకు తమ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
టీడీపీ ఇంటలిజన్స్ విభాగం వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసంతృప్తిగా ఉన్న అధికారులు, ఉద్యోగులను కూడా గుర్తించనుంది. వారి ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు తెలుసుకునే యంత్రాంగాన్ని, ఏర్పాటుచేసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రధానంగా సెక్రటేరియేట్‌తోపాటు.. రెవిన్యూ, ఎక్సైజ్, మైనింగ్, సివిల్ సప్లయిస్, పోలీసు శాఖపై దృష్టి సారించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
టీడీపీపై ఎదురుదాడి చేస్తున్న కొడాలి నాని, పేర్ని నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, అవంతి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాస్, కన్నబాబు, ధర్మాన కృష్ణదాస్ వంటి మంత్రులతోపాటు… ఆళ్ల రామకృష్ణారెడ్డి, అంబటిరాంబాబు, రోజా, శ్రీకాంత్‌రెడ్డి, గుర్నాధరెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వల్లభనేని వంశీ, పార్ధసారధి, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, వసంత కృష్ణప్రసాద్, జోగి రమేష్ , ఉదయభాను వంటి ఎమ్మెల్యేల వ్యక్తిగత-వ్యాపార కార్యకలాపాలపై నిఘా వేసేందుకు.. ఆయా నియోజకవర్గాల్లో 17 మందిని నియమించనున్నట్లు తెలుస్తోంది. వీరికింద మరో 17 మందిని నియమించారని చెబుతున్నారు.
వీరంతా ఆయా వైసీపీ ఎమ్మెల్యేల బలహీనతలు, అక్రమాలు, వీరికి వ్యతిరేకంగా ఉన్న సొంత పార్టీ నేతల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని, ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తుంటారు. ఎన్నికల నాటికి ఆ వివరాలు తెలుసుకుని, ఎన్నికల సమయంలో వాటినే స్థానిక ప్రచారాంశాలుగా సంధించనున్నారు. ఈ విధంగా 27 మంది వైసీపీ ఎమ్మెల్యేలను గుర్తించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో విధిలేక పార్టీ మారిన మాజీ టీడీపీ నేతల్లో, తిరిగి ఎంతమంది వెనక్కి వ చ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నది కూడా ఈ ఇంటలిజన్స్ విభాగం తెలుసుకుని, పార్టీ నాయకత్వానికి నివేదిక ఇస్తుంది.
ఇక పార్టీ నేతలను కేసుల పేరుతో వేధిస్తున్న డీఎస్పీ నుంచి ఐపిఎస్ స్థాయి అధికారులపై ప్రత్యేక దృష్టి సారించాలని, పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. తమను వేధించే సదరు అధికారి గతంలో ఎక్కడ పనిచేశారు? ఎవరి సిఫార్సుతో అక్కడ పోస్టింగు తెచ్చుకున్నారు? వారి కుటుంబ నేపథ్యం ఏమిటి? సదరు అధికారి హయంలో ఆ విభాగంలో జరిగిన అవినీతి, వచ్చిన ఫిర్యాదులు, వారి కుటుంబ నేపథ్యం, ప్రస్తుతం వారి కుటుంబసభ్యుల ఆస్తుల వంటి వివరాలు సేకరించాలని రంగం సిద్ధమయినట్లు తెలుస్తోంది. వేరే రాష్ట్రాలకు చెందిన అధికారులు అక్కడ కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు తెసుకునేందుకు 12 మందితో ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటుచేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం వివిధ శాఖల్లో ఉన్న ఐఏఎస్-ఐపిఎస్ అధికారులు, రానున్న ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎక్కడ నుంచి పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారన్న కూపీ కూడా లాగనున్నారు. ఆ క్రమంలో ప్రస్తుతం రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన ఓ పోలీసు ఉన్నతాధికారి.. రానున్న ఎన్నికల్లో అమలాపురం ైవె సీపీ ఎంపీ అభ్యర్థిగా, అదేవిధంగా సీమలో ప్రముఖ పుణ్యక్షేత్రం ఉన్న జిల్లాకు ఎస్పీగా పనిచేసిన ఒక అధికారి, ప్రకాశం జిల్లా నుంచి గత ఎన్నికల్లోనే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న సమాచారం, ఇప్పటికే పార్టీ నాయకత్వం వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. డెప్యుటేషన్‌పై వచ్చిన సదరు ఎస్పీ స్థాయి అధికారి గత ఎన్నికల్లో.. కడప జిల్లాకు చెందిన తన మామ సాయంతో.. ప్రకాశం జిల్లా నుంచి పోటీచేసేందుకు సిద్ధపడినట్లు టీడీపీ నాయకత్వ పరిశీలనలో తేలినట్లు సమాచారం.
పెరగనున్న వేగుల సంఖ్య
ఇదిలాఉండగా, ఇప్పటివరకూ తమకు సమాచారం ఇస్తున్న, ప్రభుత్వంలో వివిధ స్థాయిలో పనిచేసే ఉద్యోగులు-అధికారుల సంఖ్యను కూడా పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం. తమ ప్రభుత్వంలో మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్ల వద్ద పనిచేస్తున్న వారే, ఇప్పుడు మళ్లీ ఇదే ప్రభుత్వంలో పనిచేస్తున నేపధ్యంలో.. అలాంటి వారి సేవలతోపాటు, సెక్రటేరియేట్ నుంచి కమిషనరేట్ వరకూ వివిధ స్థాయి అధికారులతో సమన్వయం చేసుకునేందుకు ఇప్పటికే 28 మంది ఉండగా, ఆ సంఖ్యను 50కి పెంచాలని టీడీపీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీని ద్వారా పార్టీ సమాచార వ్యస్థను బలోపేతం చేసి, ఎన్నికల ముందు వైసీపీ గుట్టును రట్టు చేయాలన్నది టీడీపీ నాయకత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.