Suryaa.co.in

Andhra Pradesh

బంగారుపాళ్యంలో లోకేష్ ‘ప్రజాదర్బార్’

– ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించిన మంత్రి
– సమస్యల పరిష్కరానికి కృషిచేస్తామని హామీ

బంగారుపాళ్యం: యువగళం పాదయాత్ర హామీ డయాలసిస్ సెంటర్ ప్రారంభానికి బంగారుపాళ్యం వచ్చిన విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం ఉదయం ఎస్ ఎల్ వి కల్యాణ మండపంలో ‘ప్రజాదర్బార్’ నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నుంచి ప్రజలు పెద్దఎత్తున చేరుకున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి నారా లోకేష్ ను కలిసి విన్నవించారు. ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. అంగన్ వాడీలు 42 రోజుల సమ్మె ఒప్పందంలో అంగీకరించిన అంశాల ఆధారంగా పెండింగ్ లో ఉన్న జీవో ఇవ్వాలని, వేతనాలు పెంచాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీ అంగన్ వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

బంగారుపాళ్యం మండలం, టేకుమందకు చెందిన వడ్డి గోవిందమ్మ ఎలాంటి అండా లేని తన మనవరాలి ఆలనాపాలనకు ఆర్థికసాయం చేసి ఆదుకోవాలని కోరారు. జీవో 117 రద్దుతో పాటు సీపీఎస్ పై నిర్ణయం తీసుకోవాలని, డీఎస్సీ 2023 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం చేపట్టిన స్టాఫ్ నర్స్ నియామకాల్లో జరిగిన అక్రమాలను సరిదిద్ది న్యాయం చేయాలని రామసముద్రంకు చెందిన ఎస్.దివ్య కోరారు. విద్యాశాఖలో సీఆర్ఎమ్ టీలను రెగ్యులర్ చేయాలని ఏపీ క్లస్టర్ రీసోర్స్ పర్సన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

ఐరాల గ్రామంలో షాదీమహల్ పెండింగ్ పనులు పూర్తిచేసిన తమకు గత ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయలేదని, పరిశీలించి బిల్లులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎస్.జలీల్ బాష కోరారు. తిరుపతిలో హథీరాం బావాజీ అన్యాక్రాంత భూములను బంజారాల ఆధ్వర్యంలో ట్రస్ట్ బోర్డు ఏర్పాటుచేయడంతో పాటు ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని శ్రీ స్వామి హథీరామ్ బావాజీ పరిరక్షణ కమిటీ విజ్ఞప్తి చేసింది. ఆయా సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

LEAVE A RESPONSE