Suryaa.co.in

Andhra Pradesh

ఆంధ్రా యూనివర్సిటీ వీసీని రీకాల్ చేయాలి

-గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ

వైసీపీ పాలనలో రాజకీయాలకు అతీతంగా పనిచెయ్యాల్సిన విశ్వవిద్యాలయాలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయాయి. నిత్యం వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ, నిబంధనలను ఉల్లంఘిస్తూ వైస్ ఛాన్సలర్ పివిజిడి ప్రసాద్ రెడ్డి ఆంధ్రా యూనివర్సిటీ ప్రతిష్టను దిగజారుస్తున్నారు.ఆయన యూనివర్సిటీని అవినీతి, అక్రమాలకు అడ్డాగా మార్చుకున్నారు. రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన వైస్ ఛాన్సలర్ ఏకంగా యూనివర్సిటీలోనే వైసిపి కార్యక్రమాలు నిర్వహిస్తూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు.

రీవాల్యూయేషన్ పద్ధతి తీసుకొచ్చి అక్రమాలకు పాల్పడటం, యూనివర్సిటీ కి ఎంతో సేవలందించిన ప్రింటింగ్ ప్రెస్ మూసివేసి, సొంత ప్రయోజనం కోసం స్టేషనరీ, పేపర్, ప్రింటింగ్ కు సంబంధించిన వ్యవహారాలలో నిబంధనలకు విరుద్ధంగా ఆర్థిక అవకతవకలకు పాల్పడటం, ఎ.పి యూనివర్సిటీస్ యాక్ట్ 1991ని ఉల్లంఘించి పదవీ విరమణ చేసిన వారిని రీ ఎంప్లాయిమెంట్ పేరిట విధుల్లోకి తీసుకుని రిజిస్ట్రార్ గా నియమించడం, ఎంతో మందికి జీవితాన్నిచ్చిన 18 ముఖ్యమైన కోర్సులను తీసివేయడం, రేషనలైజేషన్ పేరిట గతంలో శాంక్షన్ అయిన పోస్టులను కూడా కుట్రపూరితంగా తొలగించి ఎంతో మంది ఉపాధి ఉద్యోగ అవకాశాలకు గండి కొట్టడం, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రూసా పథకం క్రింద ఆంధ్ర యూనివర్సిటీ కి కేటాయించిన 100 కోట్ల రూపాయల నిధులకు సంబంధించి, 400 డాక్టోరల్ ఫెలోషిప్స్ మరియు 100 పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్స్ పరిశోధకులకు అందజేయకుండా నిధుల దుర్వినియోగం లాంటి ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు.

కట్టమంచి రామలింగా రెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి గొప్ప వ్యక్తులు వైస్ ఛాన్సలర్లు గా పనిచేసి ఆంధ్రా యూనివర్సిటీకి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. వైసిపి పాలనలో యూనివర్సిటీలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.

పదవీ విరమణ చేసిన 30 మంది ఆచార్యులను తిరిగి గౌరవ ఆచార్యులుగా నియమించడం, నోటిఫికేషన్ ఇవ్వకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు విశ్వవిద్యాలయాలలో పని చేసిన వారికి రూ.75,000 జీతం ఇచ్చి అక్రమ నియామకాలు చేపట్టడం,ఎన్నో సంవత్సరాలుగా విశ్వవిద్యాలయాన్ని నమ్ముకొని 200 మంది గెస్ట్ ఫ్యాకల్టీ లుగా విధులు నిర్వర్తిస్తున్న వారిని తొలగించడం లాంటి ఎన్నో అవకతవకలు యూనివర్సిటీలో చోటుచేసుకుంటున్నాయి.

దళిత ఆచార్యుడికి అండగా నిలిచారని ఒక పరిశోధకుడి పీహెచ్డీ అడ్మిషన్ ను రద్దుచేయడం , సంస్కృత విభాగంలో అంబేద్కర్ గారి చిత్రపటం తీయనందుకు గెస్ట్ ఫ్యాకల్టీని తొలగించడం, ఆంధ్ర యూనివర్సిటీలో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం చుట్టూ కంచె ఏర్పాటు చేసి అంబేద్కర్ గారి విగ్రహం వద్దకు ప్రవేశాన్ని నిషేధించడం లాంటి ఎన్నో అరాచక చర్యలకి వైస్ ఛాన్సలర్ పాల్పడుతూ విద్యార్థులు భయాందోళనకు గురయ్యే విధంగా ప్రవర్తిస్తున్నారు.
యూనివర్సిటీ ప్రతిష్ఠ మసకబారే విధంగా అనేక అక్రమాలు, దుశ్చర్యలకి పాల్పడుతున్న వైస్ ఛాన్సలర్ పివిజిడి ప్రసాద్ రెడ్డిని వెంటనే రీకాల్ చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరుకుంటున్నాను.

LEAVE A RESPONSE