Suryaa.co.in

Andhra Pradesh

కేంద్రం నుంచి దీర్ఘకాలిక సాయం

-రాష్ట్రం కష్టకాలంలో ఉంది, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు
-ఇటువంటప్పుడు రాజకీయాలు అవసరమా?
-వైసీపీ ప్రభుత్వ హయాంలో బుడమేరును పట్టించుకోలేదు
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి
– బీడీసీ గండ్లు పూడ్చివేత పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు , బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్

కొండపల్లి: ఏపీకి ప్రకృతి విపత్తు వల్ల కలిగిన నష్టం అంచనా వేసిన తర్వాత కేంద్రం నుంచి తక్షణ సాయంతో పాటు దీర్ఘకాలిక సాయం కూడా అందిస్తామని, కేంద్రానికి రాష్ట్రానికి వారధులుగా మేము పనిచేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు.

కొండపల్లి శాంతినగర్-కవులూరు గ్రామాల మధ్య బుడమేరు మళ్లింపు కాల్వకు పడిన గండ్ల పూడ్చివేత పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు , బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి , మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ , ఎన్డీఏ మహాకూటమి నేతలు శుక్రవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. విజయవాడ నగరం, మైలవరం నియోజకవర్గానికి ఇప్పుడు జరిగిన నష్టం ఇంతకు ముందెన్నడూ చూడలేదన్నారు. బుడమేరు మళ్లింపు కాలువకు మూడు చోట్ల భారీ గండ్లు పడ్డాయన్నారు. మరోవైపు కూడా గండ్లు పడ్డాయన్నారు. అందువల్ల విజయవాడ నగరం వరదనీటితో మునిగిందన్నారు. పంట నష్టం కూడా భారీగా జరిగిందన్నారు.

జక్కంపూడి లో ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ పరికరాలు, వాహనాలు, తోపుడుబండ్లు అన్ని నీటిపై తేలియాడుతున్నాయన్నారు. ప్రజలు నీటిలో నానుతూ నరకం చూస్తున్నారన్నారు. ఈ సందర్భంలో రాజకీయాలు కాదని, రాష్ట్రం తిరిగి ఎలా కోలుకోవాలా? అనే విషయంపై ఆలోచించాలని ప్రతిపక్షాలకు సూచించారు. నిన్న పర్యటనకు విచ్చేసిన కేంద్ర మంత్రి చౌహన్, జరిగిన నష్టాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ దృష్టికి తీసుకు వెళ్తారని వెల్లడించారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బుడమేరు ఆధునికీకరణ పనులను పట్టించుకోకపోవడం వల్లే ప్రస్తుతం ఇంత భారీ నష్టం జరిగిందన్నారు.

విపక్షాలకు బుద్ధి, జ్ఞానం లేదు: ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసం మునుగుతుందనే ఉద్దేశంతోనే విజయవాడ నగరాన్ని ముంచారని జగన్మోహనరెడ్డి చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ గేట్లు ఎత్తడం వల్లనే విజయవాడ నగరం మునిగిందని ప్రచారం చేస్తున్నారని, గేట్లు మూసి వున్నా ఇప్పటికీ వరదప్రవాహం ఉందన్నారు.

భారీ వర్షపాతం, కృష్ణానదికి ఎగువ నుంచి వచ్చిన వరదలు, బుడమేరుకు భారీగా గండ్లు పడిన కారణంగానే వరదనీరు బెజవాడను ముంచిందన్నారు. గండ్లు పూడ్చేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టామన్నారు. మూడు రోజుల నుంచి మంత్రి నిమ్మల రామానాయుడు గారు వర్షంలో తడుస్తూ గండ్లు పూడ్చివేత పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని ఇప్పటికే రెండు భారీ గండ్లు పూడ్చివేసినట్లు పేర్కొన్నారు. మరో అత్యంత భారీ గండిని పూడ్చుతున్నామన్నారు.

ఇవన్నీ వదిలిపెట్టి సాక్షి మీడియా విషపు రాతలు, కల్పిత కథనాలు ప్రచారం చేస్తోందనన్నారు. దేశానికి టెర్రరిజం వల్ల జరిగే నష్టం కంటే సాక్షి దినపత్రిక, సాక్షి ఛానెల్ వల్ల సమాజానికి జరిగే కీడు ఎక్కువనన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో వరద బాధితులకు భోజనాలు పెడితే కనీసం ఆ సొమ్మును ఒక రూపాయి కూడా ఇప్పటికీ చెల్లించలేదన్నారు.

ఎన్డీఏ మహాకూటమి ప్రభుత్వం వరదల్లో మృతి చెందిన వారికి 48 గంటల్లోనే లక్షల రూపాయల ఆర్థిక సాయం మంజూరు చేసిందన్నారు. వరద బాధితులకు ఆహారం, తాగునీరు, పాలప్యాకెట్లు సమస్తం ఇళ్లకు చేరవేస్తున్నామని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబునాయుడు నిబద్ధతకు, దార్శనికతకు ఇది నిదర్శనం అన్నారు.

దయచేసి బ్లూ మీడియా చెప్పే కల్పితాలను నమ్మవద్దని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ అక్కల రామ్మోహనరావు (గాంధీ) , బీజేపీ మైలవరం నియోజకవర్గ ఇన్చార్జి నూతలపాటి బాల కోటేశ్వరరావు (బాల) తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE