అడపా బాబ్జి మృతితో కుటుంబ సభ్యుడిని కోల్పోయా

– మంత్రి కొడాలి నాని భావోద్వేగం
– పెదఎరుకపాడు స్మశానవాటికలో ఘనంగా అంత్యక్రియలు
– హాజరైన పేర్ని, బాలశౌరి, కైలే, సింహాద్రి, ఉప్పాల, వంగవీటి తదితరులు
– వేలాదిగా తరలివచ్చిన ప్రజలు, వైసీపీ శ్రేణులు, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు

గుడివాడ, మార్చి 19: గుడివాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి మృతితో తాను కుటుంబ సభ్యుడిని కోల్పోయానని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఆవేదన వ్యక్తం చేశారు. అడపా బాబ్జి కుటుంబానికి వ్యక్తిగతంగా, పార్టీపరంగా అండగా ఉంటానని ఆయన చెప్పారు. గుండె పోటుతో ఆకస్మికంగా మరణించిన విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన హైదరాబాద్ నుండి బయల్దేరిన మంత్రి కొడాలి నాని శుక్రవారం రాత్రి పెదఎరుకపాడులోని అడపా బాబ్జి స్వగృహానికి చేరుకున్నారు. అడపా బాబ్జి భౌతిక కాయానికి పూలమాల వేసి ఘనంగా
19-PHOTO-1
నివాళులర్పించారు. తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని భావోద్వేగానికి గురయ్యారు. కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇదిలా ఉండగా శనివారం ఉదయం అడపా బాబ్జి భౌతిక కాయానికి రాష్ట్ర రవాణా, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యేలు కైలే అనిల్ కుమార్, సింహాద్రి రమేష్ బాబు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక తదితరులతో కలిసి మంత్రి కొడాలి నాని నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ అడపా బాబ్జి మృతి గుడివాడ రాజకీయాలకు తీరని లోటు అని అభిప్రాయపడ్డారు. ఎవరితోనూ విభేదాలు లేకుండా గుడివాడ పట్టణానికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విశేష సేవలు అందించారని కొనియాడారు.

మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ నిస్వార్ధ రాజకీయ నేత అడపా బాబ్జి అని చెప్పారు. నేటి రాజకీయాల్లో విలువలకు కట్టుబడిన నాయకులు అరుదుగా ఉంటారని, అటువంటి వారిలో అడపా బాబ్జి ఒకరని అన్నారు. అడపా బాబ్జి మరణంతో మంచి ఆత్మీయుడిని కోల్పోయానని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ అడపా బాబ్జిని గుడివాడ
19-PHOTO-2 మున్సిపల్ చైర్మన్ గా చూస్తానని అనుకున్నానన్నారు. దురదృష్టవశాత్తు ఆయన మరణించడం బాధాకరమని అన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక మాట్లాడుతూ అడపా బాబ్జి మృతితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నాయకుడిని కోల్పోయిందని అభిప్రాయపడ్డారు.

అనంతరం పెదఎరుకపాడులోని స్వగృహం నుండి అంతిమ యాత్ర ప్రారంభమైంది. వేలాది మంది ప్రజలు అంతిమయాత్రకు తరలివచ్చి అడపా బాబ్జి భౌతిక కాయానికి అశ్రునయనాలతో తుది వీడ్కోలు
19-PHOTO-4 పలికారు. గుడివాడ పట్టణ వీధుల్లో సాగిన ఈ యాత్ర పెదఎరుకపాడులోని స్మశాన వాటిక వరకు సాగింది. అక్కడ అడపా బాబ్జి భౌతికకాయానికి ఆయన కుమార్తె అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, ఎంపీ బాలశౌరి తదితరులు కూడా అంతిమయాత్రలో పాల్గొని అడపా బాబ్జి భౌతిక
19-PHOTO-5 కాయానికి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ఉండి తమకున్న ఆత్మీయత, అనుబంధాలను చాటుకున్నారు. అడపా బాబ్జి మృతికి సంతాపంగా శనివారం గుడివాడ పట్టణంలో వ్యాపార, వాణిజ్య సముదాయాలను స్వచ్ఛందంగా మూసివేశారు.