– బిజెపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్.ప్రకాష్ రెడ్డి
హైదరాబాద్: ప్రభుత్వం ఎలా నడుస్తుంది.. మంత్రివర్గ నిర్ణయాలు ఎలా తీసుకుంటారు మంత్రివర్గ సంఘాలు ఎలా ఏర్పాటు చేస్తారు.. వాటి పనితీరు ఎలా ఉంటుందో కనీస అవగాహన లేని వ్యక్తి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు కావడం తెలంగాణ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం.
కాంగ్రెస్ నాయకులు మొదటి నుంచి బీఆర్ఎస్, బిజెపి కలిసిపోతున్నాయంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. ఈ కారు కూతలు బంద్ చేయకపోతే ప్రజలే మీకు సరైన సమయంలో సరైన బుద్ధి చెప్తారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించిన అవకతవకల విచారణ కోసం నియమింపబడిన జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు .. గతంలో తను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అన్ని విషయాలను ఈటల రాజేందర్ స్పష్టంగా చెప్పారు.
ఇప్పటి మంత్రులను అడగండి.. ముఖ్యమంత్రినీ అడగి తెలుసుకోండి. అప్పుడు అనుమతి ఇచ్చిన క్యాబినెట్ లో తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, జూపల్లి కృష్ణారావు కూడా మంత్రివర్గ సభ్యులే కదా…. వారిని అడిగి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన నిజాలు ఏంటో తెలుసుకోవచ్చు.
పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లాంటి వాళ్లు అవగాహనరాహిత్యంతో రాజేందర్ మాటలను వక్రీకరిస్తున్నారు. బడ్జెట్ పెంచడం లేదా ఇతర టెండర్ల ఫైనలైజేషన్లు, లేదా ప్రభుత్వ ఏజెన్సీలతో తనకు సంబందం లేదని రాజేందర్ స్పష్టంగా చెప్పారు. అవన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించినవే అని చెప్పారు.
కమిషన్ ముందు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తారా.? రాజకీయాలు మాట్లాడుతారా? ఈమాత్రం అవగాహనలేదు ఈ కాంగ్రెస్ నాయకులకు. రాజేందర్ స్పష్టం చేసినట్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి, కుంభకోణం విషయంలో దోషులను గుర్తించి శిక్షించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానిది. ఈ బాధ్యతను సరిగ్గా నిర్వహించమని మహేశ్ కుమార్ గౌడ్ లేదంటే జగ్గారెడ్డిలు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సలహా ఇస్తే మంచిది.