న్యూఢిల్లీ, డిసెంబర్ 22: ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే రోడ్ల నిర్వహణ బాధ్యత ఆయా రాష్ట్రాల బాధ్యతేనని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చెప్పారు. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ పథకం కింద నిర్మించే గ్రామీణ రోడ్ల నిర్వహణకు అవసరమైన నిధులను గ్రాంట్ల రూపంలో ఆయా రాష్ట్రాలకు అందించవలసిందిగా 15వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు.
గ్రామీణ మంత్రిత్వ శాఖ రూపొందించిన మార్గదర్శకాలను అనుసరించి ఈ పథకం కింద రోడ్ల నిర్మాణం జరుగుతుంది. రోడ్ల నిర్వహణలో ఏకరూపత తీసుకువచ్చేందుకు తమ మంత్రిత్వ శాఖ కింద పని చేసే జాతీయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఎన్‌ఆర్‌ఐడీఏ) సాంకేతిక నైపుణ్యంతో రూపొందించిన విధివిధానాలను రూపొందించినట్లు మంత్రి చెప్పారు. దేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రం రోడ్ల నిర్వహణలో ఈ విధివిధానాలకు అనుగుణంగా నిర్వహణ విధానాలను తయారు చేసుకోవలసి ఉంటుందని మంత్రి చెప్పారు.