– మజ్లిస్ తెలంగాణకు, దేశానికి పట్టిన చీడపురుగు
– పశువులను మత్తు ఇంజక్షన్లు ఇచ్చి వాహనాల్లో ఎత్తుకెళ్లే ముఠాలు
– గోరక్షకుల పైనే కేసులు బనాయిస్తున్నారు
– పోలీసులు చేయాల్సిన రక్షణ బాధ్యత గోరక్షకులు నిర్వర్తిస్తున్నారు
– బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇల్లీగల్ కార్మికులు పనిచేస్తూ గోవుల అక్రమ రవాణాలో కీలక పాత్ర
– ఇబ్రహీం ఖురేషీ అనేక నేరాల్లో రాటుదేలిన వ్యక్తి
– ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో ఇబ్రహీం ఖురేషీ కి సన్నిహిత సంబంధాలు
– తెలంగాణలోని అనేక అటవీ ప్రాంతాల్లో అక్రమ స్లాటర్ హౌసులు
– కోడ్ అమల్లో ఉన్నప్పుడు మంత్రి పదవిని ఇవ్వడం చట్ట విరుద్ధం
– జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో మజ్లిస్ పార్టీ ఎందుకు పోటీ చేయడం లేదు?
– బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి
హైదరాబాద్: ఘట్కేసర్లో గోరక్షక్ సేవకుడు ప్రశాంత్ కుమార్ (సోనూసింగ్) పై మజ్లిస్ పార్టీ నాయకుడు ఇబ్రహీం ఖురేషీ తుపాకీతో కాల్పులు జరిపిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనను బీజేపీ తీవ్రంగా ఖండించింది. మేము స్వయంగా హాస్పిటల్లో ప్రశాంత్‌కు సకాలంలో వైద్యం అందేలా డాక్టర్లతో మాట్లాడి చర్యలు తీసుకున్నాం.
రాచకొండ కమిషనర్ ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసి, మరొకరు పరారీలో ఉన్నారని తెలిపారు. కీసర మండలం రాంపల్లికి చెందిన ప్రశాంత్ (సోనుసింగ్) అనేక సంవత్సరాలుగా గోరక్షణ కోసం పనిచేస్తున్న సేవకుడు. పోలీసులు చేయాల్సిన రక్షణ బాధ్యత గోరక్షకులు నిర్వర్తిస్తున్నారు. కానీ చట్టాన్ని ఉల్లంఘించి గోవులను అక్రమంగా తరలించే వారిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు, గోరక్షకులపైనే అక్రమ కేసులు బనాయించి బెదిరిస్తున్నారు.
ఇటువంటి ఘటనలు హైదరాబాద్ చుట్టుపక్కల విస్తారంగా పెరుగుతున్నాయి. గోవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో పోలీసులు ధైర్యంగా చర్యలు తీసుకుంటే, వెంటనే ఎంఐఎం నాయకులు ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి ఒత్తిళ్లు తెస్తున్నారు. ఘట్కేసర్ ఘటనలో మజ్లిస్ నాయకులు తుపాకులతో దాడి చేసే స్థాయికి దిగజారారు.
ఇబ్రహీం ఖురేషీపై చత్తీస్‌గఢ్‌లో కూడా అనేక కేసులు నమోదయ్యాయి. ఆయన విడుదల తర్వాత కొంతమంది ఎంఐఎం నాయకులు, హైదరాబాద్ విమానాశ్రయం వద్ద అతనిని ఊరేగింపుగా తీసుకెళ్లడం ఆందోళన కలిగించే విషయం. మెజారిటీ ప్రజలు గోవులను పూజిస్తారు. వారి భావాలను గుర్తించి గోహత్యపై నిషేధం విధించబడింది. స్లాటర్ హౌసుల నియంత్రణకు పలు చట్టాలు, నిబంధనలు తీసుకువచ్చారు. కానీ ఈ చట్టాలు, నిబంధనలు గత పది సంవత్సరాలుగా తెలంగాణలో అమలు కావడం లేదు.
చట్టాలను కఠినంగా అమలు చేయాల్సిన పోలీసులు, మాఫియా చేతుల్లో కీలుబొమ్మలుగా మారి గోరక్షకులపైనే కేసులు బనాయిస్తున్నారు. పోలీసు వ్యవస్థ పూర్తిగా వైఫల్యానికి గురైంది. గోవులను రక్షించుకోవడం ప్రతి పౌరుడికి చట్టం కల్పించిన హక్కు. కానీ అక్రమ స్లాటర్ హౌసుల్లో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇల్లీగల్ కార్మికులు పనిచేస్తూ గోవుల అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మాఫియాకు అండగా ఉన్నది మజ్లిస్ పార్టీ నాయకులే.
ఇబ్రహీం ఖురేషీ అనేక నేరాల్లో రాటుదేలిన వ్యక్తి. ఆయనపై శంషాబాద్, ఘట్కేసర్, గజ్వేల్, ములుగు వంటి ప్రాంతాల్లో అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇబ్రహీం ఖురేషీ ఎంఐఎం పార్టీ నాయకులతో సన్నిహితంగా పనిచేస్తున్నాడు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో కూడా అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు మజ్లిస్ మద్దతుదారులే చెబుతున్నారు.
గోవుల అక్రమ రవాణా సమయంలో పోలీసులు వాహనాలను సీజ్ చేస్తే, వాటిని విడిపించడానికి ఎంఐఎం పార్టీ ఆఫీసులో ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలో గోవుల అక్రమ రవాణా, గోహత్య, పశుమాంస ఎగుమతి పెద్ద మాఫియాగా మారింది.
ఎంఐఎం పార్టీకి చెందిన బహదూర్‌పురా ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్, రసూల్‌పురా కార్పొరేటర్ మహ్మద్ ఖాదర్ వంటి వారు రెగ్యులర్‌గా పోలీసు స్టేషన్లకు వెళ్లి అధికారులను బెదిరించి వాహనాలను విడిపించడం సాధారణంగా మారింది. తెలంగాణలోని పశువుల సంతల నుంచి ఇతర రాష్ట్రాలకు దొంగతనంగా పశువులను తరలిస్తున్నారు. రైతుల పంట పొలాల నుంచి పశువులను ఎత్తుకెళ్లి ఎగుమతి చేస్తున్నారు. దీనిపై అనేక ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
మజ్లిస్ పార్టీ పెత్తనం వల్ల, రాష్ట్ర ప్రభుత్వం ఎంఐఎం ఆదేశాలతో నడుస్తుండటంతో ఈ అక్రమాలు విస్తరించాయి. పశువులను మత్తు ఇంజక్షన్లు ఇచ్చి వాహనాల్లో ఎత్తుకెళ్లే ముఠాలు పనిచేస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రం నుంచి సరిహద్దులు దాటి తెలంగాణకు తెస్తున్నారు.
మెజారిటీ ప్రజల సెంటిమెంట్‌ను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం చట్టవ్యతిరేకం. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు కూడా అక్రమ స్లాటర్ హౌసుల్లో భాగస్వాములు. మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్,.. హజ్ కమిటీ మాజీ చైర్మన్ మహ్మద్ సలీం బీఆర్ఎస్ హయాంలో స్లాటర్ హౌస్ అక్రమాల ద్వారా వేల కోట్లు సంపాదించాడు. ఇబ్రహీం ఖురేషీతో అతనికి సత్సంబంధాలు ఉన్నాయి.
ప్రస్తుతం మహ్మద్ సలీం జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ప్రచారం చేస్తున్నారు. మజ్లిస్ పార్టీ ఏది చెబితే, కాంగ్రెస్–బీఆర్ఎస్ పార్టీలు అదే విధంగా అమలు చేస్తున్నాయి. ఈ పార్టీల కారణంగా తెలంగాణలో వేలాది గోవులు హత్యకు గురవుతున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి రాత్రికి రాత్రి అక్రమంగా పశువులను తెలంగాణకు తెస్తున్నారు. ఇందులో ఇబ్రహీం ఖురేషీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఖురేషీ ఉపయోగిస్తున్న రివాల్వర్ చత్తీస్‌గఢ్ నుంచి అక్రమంగా తెచ్చుకున్నదే.
తెలంగాణలోని అనేక అటవీ ప్రాంతాల్లో అక్రమ స్లాటర్ హౌసులు నడుస్తున్నాయి. హైదరాబాద్‌లో న్యూ బోయిగూడ, గోల్నాక ప్రాంతాల్లో కూడా స్లాటర్ హౌసులు పనిచేస్తున్నాయి. ఈ రెండు కేంద్రాలను కూడా వెంటనే నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గోరక్షణ చట్టాలను కచ్చితంగా అమలు అయ్యేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం పాటించాలి.
తెలంగాణలో 39 అక్రమ స్లాటర్ హౌసులపై నేను గతంలో ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీకి లేఖలు రాశాను. ఇప్పటివరకు వాటిపై ఎన్ని చర్యలు తీసుకున్నారో వెల్లడించాలి. ఒక వర్గం ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా, చట్టాలను ఉల్లంఘించేలా మజ్లిస్ పార్టీ వ్యవహరిస్తోంది. వారికి ఆ హక్కు ఎవరు ఇచ్చారు? మజ్లిస్ పార్టీ కనుసన్నల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది. ఇదే విధంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నడిచింది.
మజ్లిస్ పార్టీ తెలంగాణకు, దేశానికి పట్టిన చీడపురుగు. రజాకార్ల వారసత్వాన్ని మోస్తున్న ఈ పార్టీ ఇప్పుడు హిందువుల మనోభావాలతో చెలగాటమాడుతోంది. మజ్లిస్ పార్టీ హైదరాబాద్‌లో రాజ్యాంగేతర శక్తిగా ఎదుగుతోంది. మజ్లిస్ ఆదేశాలను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు “జీ హుజూర్” అంటూ అమలు చేస్తున్నాయి. ఒకప్పుడు పాతబస్తీకి మాత్రమే పరిమితమైన మజ్లిస్ పార్టీ, ఇప్పుడు తెలంగాణ అంతటా వ్యాపించే స్థితికి చేరింది.
బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ అనేకసార్లు మజ్లిస్ పార్టీని పొగిడారు. ఓవైసీ తో కలిసి దేశమంతా తిరిగి బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఆయన ఫార్మ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. కేసీఆర్ తర్వాత ఇప్పుడు ఆ బాధ్యతను రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో 2014లో ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తిని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీకి దింపారు. ఈ అభ్యర్థి ఎంపిక గాంధీభవన్‌లో కాదు, దారుస్సలాం ఆదేశాలతోనే జరిగింది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజే కాంగ్రెస్ ప్రభుత్వం మజ్లిస్ ఆదేశాలతో మిలటరీ భూమిని ఖబ్రస్తాన్‌కు కేటాయించింది. అలాగే ఎర్రగడ్డలో కూడా ఇల్లీగల్‌గా ఖబ్రస్తాన్‌లకు భూములు కేటాయించారు. బీఆర్ఎస్ను గద్దె దింపిన తర్వాత మజ్లిస్ కాంగ్రెస్‌తో పంచన చేరింది. ఇప్పుడు ఈ రెండు పార్టీలు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ముసుగులో మజ్లిస్ పార్టీ అభ్యర్థే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు.
గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్‌ను ఇప్పుడు హడావుడిగా మంత్రిగా చేయాలని నిర్ణయించారు. 22 నెలలుగా మంత్రివర్గంలో ఒక్క మైనారిటీ వర్గానికి చెందిన మంత్రి కూడా లేరు. నిజంగా మైనారిటీ సంక్షేమంపై శ్రద్ధ ఉంటే ముందే అవకాశం ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఎన్నికల ముందు గుర్తుకొచ్చిందా? ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు మంత్రి పదవిని ఇవ్వడం చట్ట విరుద్ధం. కాంగ్రెస్ పార్టీ ఇంతగా దిగజారింది.
కేవలం మైనారిటీ ఓటర్ల సంతుష్టీకరణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తోంది. ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఖబ్రస్తాన్ భూములు, మంత్రి పదవులు తాయిలాలుగా ఉపయోగిస్తోంది. ఓవైసీ కనపడితే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వంగి వంగి సలాం కొడుతున్నాయి. కుహనా లౌకికవాదం, బుజ్జగింపు రాజకీయాలతో కాంగ్రెస్–బీఆర్ఎస్ పార్టీలు మజ్లిస్‌కు రక్షణ కవచంలా వ్యవహరిస్తున్నాయి.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో మజ్లిస్ పార్టీ ఎందుకు పోటీ చేయడం లేదు? ఎవరి ఒత్తిళ్లతో, ఎవరి సూట్ కేసులకు తలొగ్గి తమ అభ్యర్థిని కాంగ్రెస్‌కు అద్దెకు ఇచ్చింది?
మంత్రులను బస్తీలకు పంపించి, మజ్లిస్ నాయకులు ప్రత్యర్థులపై దాడులు, బెదిరింపులు చేస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ అభ్యర్థులపై వ్యాఖ్యలు చేయడం విడ్డూరం.