Suryaa.co.in

Features

‘మన సినిమా ఫస్ట్ రీల్’ కు పాఠకులు బుద్ధి చెప్పారు

తెలుగు సినిమాపై ఒక విఘాతంగా ఇటీవల వచ్చిన ‘మన సినిమా ఫస్ట్ రీల్’ పుస్తకం పూర్తిగా విఫలం అయిపోయింది. ఈ పుస్తకాన్ని తెలుగు పాఠకులు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఈ పుస్తకం ‘అమ్మకాలు బాగా లేవు’ అని తెలియవస్తోంది. విషయం, రచన తీరు ఈ రెండిటి పరంగానూ నాసిరకమైంది కాబట్టే తెలుగు పాఠకులు ఈ పుస్తకాన్ని స్వీకరించ లేదని మనం అర్థం చేసుకోవచ్చు.

తెలుగు పాఠకులకు కృతజ్ఞత

అజ్ఞానం, అతి తెలివి, దురాలోచన, చాతకానితనం, సరైన చదువు లేకపోవడం వీటితో తెలుగు సినిమా చరిత్రను దెబ్బకొట్టే ఒక ధూర్త ప్రయత్నానికి ‘విజ్ఞులైన తెలుగు పాఠకులు’ తగిన రీతిలో బుద్ధి చెప్పారు. అందుకు తెలుగు పాఠకులకు కృతజ్ఞత; కృతజ్ఞత; కృతజ్ఞత. ఇలాంటి పుస్తకాన్ని తెలుగు పాఠకులే కాదు ఏ భాష పాఠకులూ చదవరు. తమిళ్ష్ వంటి ఇతర భాషల్లో ఇలాంటి పుస్తకం వచ్చుంటే పెద్ద ఎత్తున నిరసనలు వచ్చి ఉండేవి, బహిరంగంగా రచయిత(కు) దుమ్ము దులిపేసేవారు.

చెంపదెబ్బ

ఈ పుస్తకంలోని ‘విపరీత దోషాల్ని’, విదూషకత్వాన్ని, చరిత్ర వక్రీకరణను సోదాహరణంగా, సాధికారంగా నేను సోషల్ మీడిఆలో కొన్ని వ్యాసాల ద్వారా తెలియజేశాను. ‘ఏం రాస్తే ఏమిటిలే, ఎవరికి తెలుస్తుందిలే, ఎవరు నిలదీస్తారులే, ఏం రాసినా జనాలు నమ్మేస్తారులే, నిజాలు ఎవరికి తెలుస్తాయిలే’ అన్న ధోరణిలో తెలుగువాళ్లను తక్కువగా అంచనా వేసి చెయ్యబడిన ఒక ప్రయత్నానికి తెలుగువాళ్లు కొట్టిన ‘చెంప దెబ్బ’ మన సినిమా ఫస్ట్ రీల్ పుస్తకం వైఫల్యం.

పైడిపాల, మరి కొందరు రచయితలు సినిమా విషయంగా రాసిన పరిశీలనాత్మక, పరిశోధనాత్మక, వివరణాత్మక పుస్తకాలు తెలుగులో విజయవంతం అయ్యాయి; పాఠకుల మెప్పును పొందాయి. కానీ రెంటాల జయదేవ రాసిన మన సినిమా ఫస్ట్ రీల్ ఘోరంగా విఫలం అయింది. దీన్నిబట్టి ఈ పుస్తకంలోని విషయం ఏ మేరకు చెత్తో మనం తెలుసుకోవచ్చు. ఇంతవరకూ తెలుగులో వచ్చిన ఈ తరహా పుస్తకాల్లో ఇంతలా విఫలమైంది మరొకటి లేదేమో?

పాఠం

తెలుగు పాఠకుల్ని, తెలుగు సినిమా పెద్దల్ని, ప్రముఖుల్ని, అభిమానుల్ని అసత్యాలతో, తప్పులతో, చవకబారుతనంతో మోసం చేసే ఈ గర్హనీయమైన పుస్తకం తెలుగు పాఠక క్షేత్రంలో విఫలం అవడం ఒక సరైన పరిణామం; ఒక హర్షనీయమైన పరిణామం. ఇదిగో ఈ పరిణామంవల్ల భవిష్యత్తులో ఇలాంటి ప్రయత్నాలు జరగకుండా ఉంటాయి. ఈ పుస్తకాన్ని తిరస్కరించి తెలుగు పాఠకులు అసత్యాలను వ్యాపింపజేసే చవకబారు రచయితలకు సరైన పాఠం నేర్పారు.

పొంచి ఉన్న అపాయం

రానున్న రోజుల్లో ఏ పైరవీలవల్లో, ఏ వికృత ప్రయత్నాలవల్లో ఈ పుస్తకానికి ప్రభుత్వ లేదా ఏ ఇతర పురస్కారాలో వచ్చే ప్రమాదం పొంచి ఉంది. ఈ పుస్తకానికి ఏ పురస్కారం వచ్చినా అది తెలుగు ప్రజల్ని, చరిత్రను, సినిమాను అవమానించడమే అవుతుంది. ఈ పుస్తకానికి ఏదైనా పురస్కారం అంటూ ఇస్తే అది ఏ సంస్థకైనా అవమానమే; అది పురస్కార నిర్ణేతలను ప్రజా క్షేత్రంలో దోషులుగా నిలబెడుతుంది.

ఎమెస్కో వారికి వినతి

ప్రజా క్షేత్రంలో విఫలమై పెద్దగా అమ్మకాలు లేని మన సినిమా ఫస్ట్ రీల్ పుస్తకాన్ని గ్రంథాలయాలకు అంటగట్టే ప్రయత్నం చెయ్యవద్దని ప్రచురణ కర్తలైన ఎమెస్కో వారికి బహిరంగ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ పుస్తకం గ్రంథాలయాలకు వెళితే అందులోని అసత్యాలు, వక్రీకరణ, దోషాలు, చవకబారుతనం భవిష్యత్తులో ఏ కొందరినైనా ప్రభావితం చేసే అవకాశం లేదా అపాయం ఉంది. కనుక ఎమెస్కో వారు ఈ పుస్తకం విషయంలో బాధ్యతా యుతంగానూ, విజ్ఞతతోనూ వ్యవహరించాలి. ఒక నాణ్యమైన ప్రచురణ సంస్థ ఎమెస్కో తన స్థాయికి తగ్గట్టు ఈ పుస్తకాన్ని తక్షణమే అన్ని రకాలుగానూ ఉపసంహరించుకోవాలి. అందువల్ల హితమూ జరుగుతుంది, వారికున్న మంచి పేరూ నిలబడుతుంది.

అప్రమత్తంగా ఉండాలి

ఈ పుస్తక రచయిత రెంటాల జయదేవ తాను చేసిన తప్పులకు, (తెలుగు సినిమా రంగంలోని అందరిదీ అజ్ఞానం, తప్పుడుతనం అని అనడంతో సహా)
తన తీరుకు నొచ్చుకుని స్వచ్ఛందంగా తెలుగు పాఠకలోకానికి, తెలుగు సినిమా రంగానికి ఇప్పుడైనా క్షమాపణలు చెప్పి తన తప్పుల్ని దిద్దుకోవాలి. అలా చెయ్యని పక్షంలో అతడికి భవిష్యత్తు ఉండదు. ఈ పుస్తకంలోని తప్పుల, వక్రీకరణల, అసత్యాల విషయంగా ఇంతవరకూ ఎంత మాత్రమూ ‘కదలక పోవడం’ రచయితగా రెంటాల జయదేవ బాధ్యతా రాహిత్యమే; నిర్లక్ష్యమే; ఇంకోటేదైనా కూడా కావచ్చు. కనుక ఆయన విషయంలో తెలుగు పాఠకులమైన మనం ఇకపై అప్రమత్తంగా ఉండాలి.

మరోసారి విజ్ఞప్తి

ఈ పుస్తకంలోని విషయం ‘సరైంది కాదు’ కాబట్టి తెలుగు సినిమా ప్రముఖులు, పెద్దలు, రచయితలు, జర్నలిస్టులు ఈ పుస్తకాన్ని ఏ విషయంగానూ, ఎంత మాత్రమూ పరిగణనలోకి తీసుకోకపోవడం చారిత్రికంగా అత్యవసరం. ‘ఈ పుస్తకం ఎంత మాత్రమూ పరిగణననీయం కాదు’ అన్న సత్యాన్ని గుర్తించ వలసిందిగా తెలుగు సినిమా పరిశ్రమకు, తెలుగు ఫిలిమ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌కు నేను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ పుస్తకంవల్ల తెలుగు సినిమా చరిత్రకు ఏ హాని జరగకూడదు; ఇతర భాషల ముందు తెలుగు సినిమా పరువు, మర్యాదలు దెబ్బతినకూడదు.

– రోచిష్మాన్
9444012279

LEAVE A RESPONSE