బహుజన శక్తిని రాజకీయ శక్తిగా మార్చాలి

Spread the love

– కరీంనగర్ బహుజన ధూంధాంలో గద్దర్ పిలుపు

మహాత్మ జ్యోతిరావు పూలే, అంబేడ్కర్ లాంటి మహానుబావులు అందించిన జ్ఞాన సిద్ధాంతంతో బహుజన శక్తిని రాజకీయ శక్తిగా మార్చాలని ప్రజా యుద్ధ నౌక గద్దర్ పిలుపునిచ్చారు. బహుజన రాజ్య స్థాపన పోరులో బాహుజన కళాకారులు కీలకపాత్ర పోషించాలని, స్వాతంత్ర పోరాటం నుండి దేశంలో జరిగిన అన్ని విముక్తి పోరాటాలలో కళాకారులు కీలకపాత్ర వహించారని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరులో బహుజన కళాకారుల పాత్ర మరువలేనిదని ఆయన అన్నారు.

బహుజన ధూంధాం రాష్ట్ర వ్యవస్థాపక కన్వీనర్ ప్రముఖ వాగ్గేయకారుడు మచ్చ దేవేందర్ నాయకత్వంలో ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రం రెవెన్యూ గార్డెన్ లో జరిగిన బహుజన ధూంధాం కు ప్రజా యుద్ధనౌక గద్దర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బహుజన కళామండలి వ్యవస్థాపకుడు మాస్టర్జీ, ద్రవిడ బహుజన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, బహుజన విద్యావంతుల వేదిక కోఆర్డినేటర్ డాక్టర్ జిలుకర శ్రీనివాస్, బి.సి స్టడీ ఫోరం వ్యవస్థాపక చైర్మన్, బహుజన ధూంధాం రాష్ట్ర కోఆర్డినేటర్ సాయిని నరేందర్ లు హాజరై సందేశమిచ్చారు.

సాయిని నరేందర్ ప్రారంభ ఉపన్యాసంలో మాట్లాడుతూ ఆదిమ సమాజం నుండి ఆధునిక సమాజం వరకు సమాజ మనుగడకు అహర్నిశలు కష్టపడిన బాహుజన బతుకులు నేడు అధోగతి పాలయ్యాయని అన్నారు. అగ్రవర్ణ సంపన్నుల పాలనలో బహుజనులు ఎన్నో హింసలకు గురవుతున్నారని ముఖ్యంగా సగానికన్న ఎక్కువ జనాభా కలిగిన బి.సి జనాభాను నేటి పాలకులు లెక్క చేయడం లేదని, న్యాయ వ్యవస్థలో, ఉన్నత విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడం లేదని, క్రిమిలేయర్ విధానంతో బి.సి ల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలను అగ్రవర్ణ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడం ద్వారా బహుజనుల అవకాశాలను కొల్లగొడుతున్నారని అన్నారు. బాహుజన రాజ్య స్థాపన ద్వారానే బహుజనుల ఉనికి సాధ్యమని అందుకోసం ఎస్సి, ఎస్టీ, బి.సి మైనార్టీలు ఏకమై మన ఓట్లు మనం వేసుకొని బాహుజన రాజ్యం స్థాపించాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న గద్దర్ బహుజనులారా లెండిరా ఈ బానిస బతుకులు వద్దురా అంటూ గద్దర్ పాట పాడి బహుజనులు రాజకీయ బానిస్వతాన్ని వీడినప్పుడే విముక్తి జరుగుతుందని ప్రజా యుద్ధ నౌక గద్దరన్న పిలువునిచ్చారు. బతుకు పుట్టుకతో ఎవరు బానిసలు కారని దౌర్జన్యం, అధికారం, అణచివేతతో మానవ సమాజాన్ని బానిసలను చేసారని బానిసలారా లెండిరా ఈ బాంచెన్ బతుకులు వద్దురా అడక్కు తింటే మన ఆకలి తీరదురా గుద్ది గుంజుకోవాలిరా అంటూ కొనసాగిన పాట బహుజన సమాజాన్ని కదిలించింది.

బానిసకు ఒక బానిసగా ఎన్నాళ్లు బతుకుతావని ఆకాశంలో సగమైన మహిళ మగవాళ్ళలో సగం కాదని రాజకీయాల్లో సగం కాకుండా ఉన్నారని మాకు జన్మనిచ్చిన తల్లివి, తోడ బుట్టిన చెల్లివి ఎన్నాల్లీ కన్నీళ్లు, నువు బతుకును మార్చే శక్తివి, నువు దాస్య విముక్తి దాతవి, నువు సింగులు చెక్కుతే చాలు సింహం పరుగులు తీసును అంటూ పాడిన పాట మహిళా లోకానికి ఉత్తేజాన్నిచ్చింది. నూనూగు మీసాల నవ యువకులారా కాలంతో కలబడుదాం, కత్తుల కోలాటమాడుదాం యువతరమా, నవతరమా భవిష్య భారత భాగమా, అమరవీరుల స్వప్నమా, అమర ప్రేమికుల గీతమా నువు ఏటికి ఎదురీదితే ఆ ఏరే ఓడి పోవురా అంటూ యువతను మేలుకొల్పే పాట యువతకు స్ఫూర్తినిచ్చింది. ఈ రాజకీయం మనది, ప్రతి ఓటు మనది, ఏటికి ఎదురీద్దాం ఎక్కే సింహాన్ని మొక్కుతే అధికారం రాదురా అంటూ బహుజనులను చైతన్యం చేశారు.

భారత రాజ్యాంగం ఒక పుస్తకం కాదని, ఏడు తరాల జ్ఞాన సిద్ధాంతమని, అభాగ్యుల ఆయుధమని, జ్ఞాన యుద్ధంలో సిద్ధం కావాలని బహుజనులారా జై బీమ్, బోలోరే జై బీమ్ అంటూ సాగిన పాట బహుజనులకు కొత్త ఊపునిచ్చింది. సాహిత్యాన్ని, పాటను బహుజనీకరించాలని, మెజార్టీ ప్రజల పరం చేయాలని పాలకులను ప్రశ్నించడం కాదు పాలితులు ప్రశ్నించుకోవాలని ఓట్ల విప్లవం వర్ధిల్లాలని పిలుపునిచ్చారు. బహుజనుల దెగ్గరున్న ఓట్లు గుంజుకోలేరు, దొంగిలించలేరు, ఒత్తిడి చేయలేరని అంబేడ్కర్ బహుజనులకు కల్పించిన ఓటు హక్కును సక్రమంగా వాడుకునే ఓట్ల విప్లవం రావాలని దానికి సాంస్కృతిక విప్లవం పునాదిగా దోహదం చేస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ జిలుకర శ్రీనివాస్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేడ్కర్, కాన్షీరాం లు వారి జీవితాలు, కుటుంబాలను త్యాగం చేసి కలలు కన్నా బాహుజన రాజ్యం స్థాపన కోసం బహుజనుల ప్రజలు ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. పెట్టబడిదారులు, మనువాదులు ఏకమై దేశాన్నిimage రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆ దోపిడికి నరేంద్రమోడీ, కెసిఆర్ లు మద్ధతుగా నిలిచారని అన్నారు. బహుజనుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో నేడు అదే బహుజనులు బతకలేక బలిదానాలు చేసుకుంటున్నారని బహుజనుల బతుకులు మారాలంటే చట్టసభలోకి వెళ్లాలని, బహుజనులను చట్టసభల్లోకి పంపడమే బహుజన ధూంధాం లక్షమని అన్నారు.

మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాటను విప్లవీకరించడం కోసం జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తి గద్దరన్న కూడా మన మధ్యలో ఉన్నాడని, పాటను అంబేడ్కరించడం కోసం జీవితాన్ని అంకితం చేసిన మాస్టర్జీ లాంటి మహామహాలు ఈ ధూంధాం హాజరు కావడం చూస్తుంటే బాహుజన రాజ్య సాధన తప్పక వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ బహుజన ధూందాం యొక్క ప్రధాన ఆశయాలు బహుజన రాజ్యాధికారం, కుల నిర్మూలన, సంఘ పరివర్తనని ఈ మూడు ఆశయాల కోసం సేచ్చ, సమానత్వం, సోదర భావం, న్యాయం అనే విలువల పునాదిగా మహనీయులు బుద్ధుడు మొదలుకొని మారోజు వీరన్న వరకు ఒక నిరంతర పోరాటం జరిగిందని ఆ పోరాట కొనసాగింపే ఇప్పుడు జరుగుతున్న సాంస్కృతిక ఉద్యమమని, సాంస్కృతిక ఉద్యమం ద్వారానే బహుజన ప్రజలను చైతన్యం చేయగలుగుతామని అలాంటి ఈ సాంస్కృతిక ఉద్యమానికి బహుజన ప్రజలు, మేధావులు, ఉద్యమకారులు, నాయకులు పార్టీలకతీతంగా మద్ధతుగా నిలవడమే కాకుండా సహాయ సహకారాలు అందించి ఆధరించాలని కోరారు.

మీరా అంబేడ్కరిస్టులు, మీరా మా జాతి నేతలు అంటూ బయటకు అంబేడ్కర్ జయంతి వర్ధంతులు జరుపుకుంటూ మనుధర్మ జీవితంలో కొనసాగుతున్న నాయకులను విమర్శిస్తూ ధూంధాం కు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన బహుజన కళామండలి వ్యవస్థాపకులు ఆతవ ఉదయబాస్కర్, మోహన్ రావు, రమేష్ బాబు లు పాడిన పాటలు సభికులను ఆలోచింపజేసాయి. చాకలి వాళ్ళం మేము ఆకలి కేకల్లో మేము, విశ్వం నిర్మించడంలో విశ్వబ్రాహ్మణులు అంటూ బహుజన కులాల కష్టం, త్యాగలపై కళాకారులు పాడిన పాటలు సభికులను కదిలించాయి. సామాజిక తెలంగాణ కోసం సమరం చేయాలంటూ, బహుజన నీలి జెండా ఎత్తు, ఆత్మగౌరవ పోరుకు గొంతెత్తు అంటూ కళాకారులు పాడిన చైతన్య గీతాలు ఉర్రూతలూగించాయి.

ఈ కార్యక్రమంలో బాహుజన ధూంధాం రాష్ట్ర కో కన్వీనర్ తెలంగాణ శ్యామ్, ద్రవిడ లిబరల్ ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు మార్వాడి సుదర్శన్, ప్రముఖ రచయిత అన్నవరం దేవేందర్, కరీంనగర్ ధూంధాం కోఆర్డినేటర్లు సామనపల్లి లక్ష్మి, కవ్వంపల్లి లలిత, ఎం.డి షామీర్, పొన్నాల అశోక్ డప్పు, సుతారి లచ్చన్న, కవి ఏలేశ్వరం వెంకటేశ్వర్లు, మహాదేవ్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఉరుమల్ల విశ్వం, న్యాయవాదులు కొరివి వేణుగోపాల్, వేల్పుల అనూష, ప్రముఖ కళాకారులు పరుశురాం, అవుదుర్తి లక్షన్, అందే భాస్కర్, ఏపూరి యాకయ్య, సంపత్, పల్లె నర్సింహ, ఎర్ర సూర్యం, నాస్తిక కళా మండలి వెంకన్న, ఎం.డి రజాక్, రజిత, సౌండ్ ఇంజనీర్స్ సంపత్, సూర్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply