Suryaa.co.in

Andhra Pradesh

వైద్య సిబ్బంది సైనికుల్లా ప‌నిచేయాలి

  • వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ పెద్ద య‌జ్ఙాన్నే చేప‌ట్టింది
  • 190 ఉచిత వైద్య శిబిరాల్ని ఏర్పాటు చేశాం
  • వెయ్యికి పైగా సిబ్బంది క్షేత్ర స్థాయిలో ప‌నిచేస్తున్నారు
  • ల‌క్ష‌ మందికి పైగా మెడిక‌ల్ క్యాంపుల్లో వైద్య సేవ‌ల్ని పొందారు
  • ఇంటింటికీ అత్య‌వ‌స‌ర మెడిక‌ల్ కిట్లు అంద‌జేశాం
  • వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో వైద్య సేవ‌లందించ‌డంలో వైద్య ఆరోగ్య శాఖ మందుంది
  • ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దిశానిర్దేశంతోనే తాము నిరంత‌ర‌మూ ప‌నిచేస్తున్నాం
  • వైద్య సిబ్బంది శిక్ష‌ణా కార్య‌క్ర‌మంలో వైద్య ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌
  • వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ఈనెల 11 నుండి దోమ‌ల లార్వాల నిర్మూల‌నా కార్య‌క్ర‌మం

విజ‌య‌వాడ: వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో సేవ‌లందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సైనికుల్లా ప‌నిచేయాల‌ని ఆ శాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ పిలుపునిచ్చారు. 190 ఉచిత వైద్య శిబిరాల్ని ఏర్పాటు చేశామ‌ని, ల‌క్ష మందికి పైగా బాధితులు ఈ శిబిరాల్ని సంద‌ర్శించార‌న్నారు. వెయ్యి మందికి పైగా వైద్య సిబ్బంది క్షేత్ర స్థాయిలో ప‌నిచేస్తున్నార‌న్నారు.

సోమ‌వారం నాడు తుమ్మ‌ల‌ప‌ల్లి క‌ళా క్షేత్రంలో మ‌ల్టీప‌ర్ప‌స్ హెల్త్ అసిస్టెంట్లు, సూప‌ర్‌వైజ‌ర్లు, స‌బ్ యూనిట్ ఆఫీస‌ర్ల‌కు నిర్వ‌హించిన శిక్ష‌ణా శిబిరంలో మంత్రి మాట్లాడారు. వారం రోజుల‌కు పైగా నీట మునిగిన ప్రాంతాల్లో దోమ‌ల లార్వాలు పెరిగి మ‌లేరియా వంటి వ్యాధులు ప్ర‌బ‌లే అవ‌కాశ‌మున్నందున ఆరోగ్య శాఖ శిబ్బంది లార్వాల నిర్మూల‌నా కార్య‌క్ర‌మంలో పెద్ద ఎత్తున పాల్గొనాల‌న్నారు.

గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ఎన్టీఆర్‌, కాకినాడ‌, ప‌ల్నాడు జిల్లాల నుండి వైద్య సిబ్బంది వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో దోమ‌ల లార్వాల నిర్మూల‌నా కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. వారం రోజుల పాటు అంకిత భావంతో ప‌నిచేసి ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌న్నారు. వ‌ర‌ద పీడిత ప్రాంతాల్లో నాలుగు రోజుల పాటు ఇంటింటి స‌ర్వే చేసేందుకు ఇప్ప‌టికే 150 బృందాలు రంగంలోకి దిగాయ‌న్నారు. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ పెద్ద య‌జ్ఙాన్నే చేప‌ట్టిందన్నారు.

వ‌ర‌ద‌లు ప్రారంభ‌మైనాటి నుండి వైద్య ఆరోగ్య శాఖ‌కు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు దిశానిర్దేశం చేస్తూ వ‌స్తున్నార‌ని, ఆ స్ఫూర్తితోనే మంత్రులుగా తాము కూడా నిరంత‌ర‌మూ ప‌నిచేస్తున్నామ‌న్నారు. ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌రేట్‌లో ఏర్పాటు చేసిన వార్ రూంలో సిఎం చంద్ర‌బాబు రేయింబ‌వ‌ళ్లూ అక్క‌డే ఉంటూ వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల‌పై స‌మీక్షిస్తున్నార‌న్నారు. వార్డుకో ఐఎఎస్ ఆఫీస‌ర్‌ను నియమించ‌డంతో పాటు మంత్రులు కూడా నిరంత‌ర‌మూ ప‌ర్య‌టిస్తూ బాధితులకు అండ‌గా నిలుస్తార‌న్నారు.

వ‌ర‌ద బాధితుల‌కు కూట‌మి ప్ర‌భుత్వం పూర్తి భ‌రోసా ఇచ్చేలా ప‌నిచేస్తోంద‌న్నారు . వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.టి.కృష్ణ‌బాబు మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాల్లో దాదాపు 5003 మంది జ్వ‌రాలకు చికిత్స పొందార‌న్నారు. నీటి నిల్వ‌లుండం వ‌ల్ల దోమ‌ల లార్వాలు పెరిగే అవ‌కాశ‌ముంద‌ని, లార్వాల నిర్మూల‌న‌కు స్పెష‌ల్ డ్రైవ్ ను చేప‌ట్టామ‌న్నారు.

వ‌ర‌ద బాధిత ప్రాంతాల్లో దోమ‌ల లార్వాలు వృద్ధి చెంద‌కుండా ఉండేందుకు ముంద‌స్తు చ‌ర్య‌ల్ని చేప‌ట్టమ‌న్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఎన్టీఆర్ క‌లెక్ట‌రేట్లో ఉంటూ ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నార‌ని, ఉద్యోగులుగా మ‌న‌వంతు బాధ్య‌త‌ను నిర్వ‌ర్తిస్తూ బాధితుల‌కు వైద్య సేవ‌లందించాల‌న్నారు. దోమ‌ల లార్వాల నివార‌ణా కార్య‌క్ర‌మాన్ని సీరియ‌స్ గా తీసుకుని అన్ని ప్రాంతాల్నీ క‌వ‌ర్ చేయాల‌న్నారు.

ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ క‌మీష‌న‌ర్ సి.హ‌రికిర‌ణ్, మునిసిప‌ల్ క‌మీష‌న‌ర్ ధ్యాన‌చంద్ర‌, సెకండ‌రీ హెల్త్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎ.సిరి, ప్ర‌జారోగ్య కుటుంబ సంక్షేమ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ పద్మావ‌తి, డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యేశ్వ‌రి, సెకండ‌రీ హెల్త్ జాయింట్ క‌మీష‌న‌ర్ టి.రమేష్ కిషోర్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE