– ఎవరేం కట్టుకున్నా మేం అభ్యంతరం చెప్పమనడానికి మీరెవరు?
– బనకచర్ల ప్రాజెక్టు రూపొందించబడిందే జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో
– గత ప్రభుత్వానికి-ఇప్పటి ప్రభుత్వానికి అనుసంధానమైన అగరబత్తి మేఘా ఇంజనీరింగ్ కంపెనీ
– మరి దీని గురించి ఎవరు మాట్లాడాలి?
– బనకచర్ల ప్రాజెక్టుపై నిపుణులతో చర్చించరా?
– ఈ భారం ఎవరు మోయాలి?
– గోదావరి జలాలు తీసుకువచ్చి కృష్ణాలో కలిపితే పై రాష్ట్రాలు హక్కులు కోరతాయి
– బనకచర్ల మనకు ప్రయోజనం లేని ప్రాజెక్టే
– ప్రజలు, ప్రజాసంఘాలు దీనిపై చర్చించాలి
– బనకచర్ల ప్రాజెక్టుపై ఇంజనీర్ అవతారమెత్తిన మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు
విజయవాడ: మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు ఇంజనీరు అవతారమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బనకచర్ల ప్రాజెక్టు మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డికి తప్ప, రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం ఉపయోగం కాదని కుండబద్దలు కొట్టారు. పైగా మెగా కృష్ణారెడ్డి ఆలోచన, బెజవాడను వరదనీటితో ముంచేదేనని స్పష్టం చేశారు. ఐదేళ్ల కాలపరిమితికి ఎన్నికయిన ప్రభుత్వాలకు.. సుదీర్ఘకాల ప్రాజెక్టులు చేసే నైతిక హక్కు ఎక్కడిదని గర్జించారు.
నిఖార్సయిన విపక్షనేత అవతారమెత్తిన ఏబీ బనకచర్ల ప్రాజెక్టుపై ఏం మాట్లాడారంటే..
కృష్ణానదికి ఏపీ చిట్ట చివరి రాష్ట్రం. కృష్ణాజలాలపై ఏపీకి కొన్ని హక్కులుంటాయి. అవి ట్రిబ్యునల్స్ నిర్ధారించాయి. దాని హక్కులకు బొక్క పెట్టి లాగేసుకోవాలనే ప్రయత్నాలు ఎగువ రాష్ట్రాలు చేస్తూనే ఉన్నాయి. ఉంటాయి కూడా. కాబట్టి మన హక్కులను రక్షించుకోవలసిన బాధ్యత మనది.
సీడబ్ల్యుసి అనుమతి లేకుండా ఎగువ రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోవలసి బాధ్యత ఏపీ ప్రభుత్వంపైనే ఉంది. అంతే తప్ప ఎవరేం కట్టుకున్నా మేం అభ్యంతరం చెప్పమనడానికి మీరెవరు? ఏపీ ప్రజల హక్కులు పరిరక్షించేందుకు ఏర్పడిన ప్రభుత్వం ఇది. అందుకు భిన్నంగా పై రాష్ట్రాలు ఏం క ట్టుకున్నా ఫర్వాలేదని చెప్పడం అధర్మం అవుతుంది.
ఈరోజు ప్రతిపక్షం నుంచి బనకచర్ల నుంచి ఒక్కమాట కూడా బయటకు రావడం లేదు. ఎందుకంటే ప్రాజెక్టు రూపొందించబడిందే జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో. కాబట్టి విపక్షం మాట్లాడదు. గత ప్రభుత్వానికి-ఇప్పటి ప్రభుత్వానికి అనుసంధానమైన అగరబత్తి మేఘా ఇంజనీరింగ్ కంపెనీ. మరిదీని గురించి ఎవరు మాట్లాడాలి? ఏపీ ప్రజలకు ఈ ప్రాజెక్టు నిజస్వరూపం గురించి చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? ప్రజలది, ప్రజాసంఘాలది కాబట్టి ఆ చొర వ తీసుకుని మీ ముందుకొస్తున్నాం.
ఏ ప్రభుత్వానికయినా ప్రజలిచ్చే అధికారం ఐదేళ్లే. ఆ ఐదేళ్లు మేం కట్టే పన్నులను జాగ్రత్తగా ఖర్చు పెట్టమని ఆ ట్రస్టీలకు అప్పచెబుతాం. ఆ క్రమంలో ఇచ్చే జీఓలు మీ ఇష్టం. ఎవరిని ఏపీపీఎస్సీ మెంబరుగా వేయాలో మీ ఇష్టం. మీకిచ్చిన అధికార పరిమితి దాటి.. దశాబ్దాలు, తరాల తరబడి ప్రజలపై భారం మోపబడే ప్రాజెక్టుల విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదు. గతంలో జగన్ 25 ఏళ్ల పాటు ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తీసుకురావడాన్ని ప్రజలు వ్యతిరేకించారు. షిర్డి సాయి, అదానీ రూపంలో అనేక పవర్‌ప్రాజెక్టులు 25 ఏళ్లు మన నెత్తిన ఈ టారిఫ్‌లు గుదిబండలుగా మారనున్నాయి.
ఈరోజు బనకచర్ల ప్రాజెక్టు కూడా లక్షా 50 వేల కోట్లకు తక్కువ అవదు. అది కట్టడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలియదు. అప్పులు తీర్చడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలియదు. దీనిపై నీటిపారుదల నిపుణులతో చర్చించకుండా, ప్రజల్లో చర్చకు పెట్టకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం ధర్మమేనా? ఇప్పుడు తెచ్చిన 10,11 లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు కట్టలేక మళ్లీ అప్పులు తెస్తున్న ఈరోజుల్లో.. లక్షకోట్ల ఖర్చయ్యే ఈ ప్రాజెక్టు గురించి ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత లేదా? ఈ భారం ఎవరు మోయాలి?
ఎవరైనా ఏదైనా మాట్లాడితే సీమ ప్రాజెక్టులకు అడ్డుకుంటారా అని ప్రశ్నించే వారికి మేమిచ్చే సమాధానం ఒకటే.. ఈరోజు సీమలో 111 టీఎంసీల నీటిని వాడుకునే బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది. హంద్రీ-నీవా, గాలేరు-నగరి పెండింగ్‌లో ఉంది. ఎక్కడా కెనాల్స్ తవ్వలేదు. కృష్ణానదిలో వచ్చిన వరదనీరు 150 టీఎంసీలు తీసుకువచ్చి పోసినాకానీ రిజర్వాయర్లు నింపడమే తప్ప, పొలాలు తడిసే పరిస్థితి లేదు.
మీకు నిజంగా వివిధ ఏజెన్సీల నుంచి నిధులు వస్తాయనుకుంటే.. రాయలసీమలో అసంపూర్తిగా ఉన్న ఈ ప్రాజెక్టులను పూర్తి చేయండి. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది. దాన్ని పునర్నిర్మించుకోవాలి. దానితో 20, 30 టీఎంసీలు నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది. దానిద్వారా సోమశిల ద్వారా పోలవరానికి తీసుకువెళితే అది భర్తీ అవుతుంది. వంశధారతోపాటు మరికొన్ని ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయి.
కేవలం 150 ఎకరాల వివాదం ఒడిసాతో ఉంది. రాజకీయంగా ఒడిసాలో బిజెపి అధికారంలో ఉంది. ఈ అడ్డంకులు తొలగించి, పోలవరానికి ఒడిషా అభ్యంతరాలు తొలగించుకోండి. తోటపల్లి బ్యారేజీ పనులు పూర్తి చేయండి. వాటిని చేయకుండా.. లక్షకోట్ల రూపాయలు ఏకపక్షంగా మేం ఒక మెగా ప్రాజెక్టును, మొదటి నుంచి చివరి వరకూ ఒకే కంపెనీకి అప్పచెబుదామంటే అది సబబు కాదు. మెగా కృష్ణారెడ్డి గీసిన బొమ్మ, అలైన్‌మెంట్ ప్రకారం.. పోలవరం నుంచి పట్టిసీమ పోలవరం రైట్ కెనాల్‌ను వెడల్పుచేయడం, దానికి సమాంతరంగా ఇంకొక కాల్వను తీసుకువచ్చి కృష్ణానదిలో పడేస్తామంటున్నారు.
పాపారావు చెప్పినట్లు.. ఇది శాశ్వతంగా విజయవాడను వరదముంపునకు గురిచేస్తుంది. ఇది బహు ప్రమాదం. దాన్ని తప్పించుకోవాలంటే కాల్వ అలైన్‌మెంట్ మార్చాలి. పశ్చిమగోదావరి-కృష్ణాజిల్లాల ఆప్‌ల్యాండ్స్ త డవటం కోసం ఏనాడూ నీళ్లు రాని.. సాగర్ ఎడమ కాల్వ ప్రాంతం తడవటం కోసం, అప్‌ల్యాండ్ మీదుగా కాల్వ తీసుకువచ్చి వైకుంఠాపురం బ్యారేజీపైన కృష్ణానది ద్వారా పారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కృష్ణానదిలో పడటానికి ఎప్పుడు చూసినా ఒకటి వరద ముంపు. రెండోది.. ఒకసారి కృష్ణానదిలో గోదావరి నదీ జలాలు కలిపిన, తర్వాత కృష్ణాజలాలపై పై రాష్ట్రాలకు హక్కులొస్తాయి.
దానికి మీకో ఉదాహరణ చెబుతా. ఈరోజు పట్టిసీమ ద్వారా 80 టీఎంసీల నీటిని గోదావరి నుంచి తీసుకుని, కృష్ణా డెల్టా ద్వారా వాడుకుంటున్నామని చెప్పి, అందులో 35 టీఎంసీలు పై రాష్ట్రాలయిన కర్నాటక, మహారాష్ట్రకు పంచేశాం. రేపు గోదావరి జలాలు తీసుకువచ్చి కృష్ణాలో కలిపితే, ఆ మేరకు పై రాష్ట్రాలు హక్కులు కోరతాయి. కృష్ణాపై మనం హక్కులు కోల్పోతాం. కాబట్టి ఆక్విడెంట్ ద్వారా కృష్ణాను దాటిస్తే ఆ హక్కులు కోల్పోం.
అక్కడి నుంచి బొల్లాపల్లికి తీసుకువెళ్లి.. సాగర్ రైట్ కెనాల్ కింద ఉన్న ఆయకట్టును స్థిరీకరించడం, దానిని 5 లక్షల ఎకరాలు విస్తరించేందుకు రెడీగా ప్లాన్లు ఉన్నాయి. వాటిని విస్తరిస్తూ సోమశిల వరకూ గ్రావిటీతో నీళ్లు పంపించుకునే ఏర్పాట్లున్నాయి. నిజంగా మీ దగ్గర డబ్బులుంటే.. ఈ ప్రాధాన్యతాక్రమంలో ముందు సీమ ప్రాజెక్టులు, తర్వాత ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు, ఆ తర్వాత డబ్బులుంటే ఎగువ కృష్ణా-పశ్చిమ గోదావరి ఎగువ నుంచి కాల్వ తీసుకువచ్చి కృష్ణాను దాటించి బొల్లాపల్లిలో రిజర్వాయర్ కట్టి.. సోమశిలకు గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకువెళ్లి, కోస్తా జిల్లాలన్నింటికీ చేయవలసిన నీటి సదుపాయం కల్పించవచ్చు.
కాబట్టి వ్యవసాయం వరకూ ఢోకా లేకుండా ఈ 9 జిల్లాలు మిగులు జలాలను, వరద జలాలను అన్నింటినీ రాయలసీమకు తీసుకువెళ్లి.. సీమకు సాగునీరు భౌగోళికంగా అందించేందుకు, ఆఖరి ఎకరానికి నీళ్లు అందించేందుకు ఈ డబ్బు ఖర్చు పెట్టాలి. కాబట్టి దీనిపై ప్రజాక్షేత్రంలో విస్తృతంగా చర్చించి, నిపుణులతోనూ చర్చించి నిర్ణయం తీసుకోండి.