Suryaa.co.in

Andhra Pradesh

గ్రామీణ బ్యాంకుల విలీనం . చైతన్య గోదావరి ఖాతాదారుల పాలిట శాపం’

(నిమ్మరాజు చలపతిరావు)

ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చిన చందంగా ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ బ్యాంకుల విలీనం చైతన్య గ్రామీణ బ్యాంకు కు చెందిన దాదాపు 25 లక్షల మంది ఖాతాదారుల పాలిట శాపం గా మారింది. వాస్తవానికి ఈ విలీనం వల్ల ఆ బ్యాంకు ఉద్యోగులకు వచ్చిన నష్టమేమీ లేదు.

కొద్ది రోజుల క్రితం రాష్ట్రం లోని చైతన్య గోదావరి, ఆంధ్ర ప్రగతి, ఆంధ్ర గ్రామీణ వికాస్, సప్తగిరి ఈ నాలుగు గ్రామీణ బ్యాంకులు ఏపి గ్రామీణ బ్యాంకు గా అవతరించాయి. విలీనం రోజు వరకు ఒక్క చైతన్య గోదావరి లోనే అత్యధిక వడ్డీ రేటు ఉండేది. ఇతర జాతీయ గ్రామీణ బ్యాంకుల కంటే కూడా అధికంగా సీనియర్ సిటిజన్స్ కు 8.6 శాతం సాధారణం గా 8.1 శాతం ఏడాది కాల డిపాజిట్ పై ఉండేది.

విస్తృత ప్రచారం వల్ల డిపాజిట్లు కూడా దాదాపు రూ 13 వేల కోట్లకు చేరాయి. ఇతర గ్రామీణ బ్యాంకులలో తక్కువ వడ్డీ ఉందంటూ వాటితో సమానంగా అదీ ఎలాంటి ప్రచారం లేకుండా గుట్టు చప్పుడు కాకుండా అర్ధ శాతం తగ్గించి సీనియర్ సిటిజన్స్ కు 8.1 శాతం సాధారణం గా 7.6 శాతం వడ్డీని అమలు చేయటం ప్రారంభించారు. దీని వల్ల పాత చైతన్య గోదావరి బ్యాంకుకు చెందిన డిపాజిట్ దారులు ఒక లక్ష రూపాయలకు ఏడాది కాలానికి కనీసం రూ. 500 నష్టపోతున్నారు.

బ్యాంకుల జాతీయకరణ తర్వాత జాతీయ బ్యాంకులు పల్లె వాసులకు అందుబాటులో ఉండాలన్న నాటి ప్రధాని దివంగత ఇందిరా గాంధీ లక్ష్యం తో దేశం లో గ్రామీణ బ్యాంకుల వ్యవస్థ ఏర్పడింది.

రాష్ట్రం లో తొలిగా 1983 లో తెనాలి కేంద్రంగా నాటి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి నాదెండ్ల భాస్కరరావు చైతన్య గ్రామీణ బ్యాంకు ను ప్రారంభించగా అక్కడ ఆంధ్రపత్రిక విలేఖరి గా ఉన్న తను ఆ బ్యాంకు పురోగతి కై పలు వార్తా కథనాలు రాసినట్లు సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు తెలిపారు. ఆపై ప్రధాన కార్యాలయం గుంటూరు కు మారటం…..ఉభయ గోదావరి జిల్లాలు కూడా చేరటంతో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు గా రూపాంతరం చెందింది.

LEAVE A RESPONSE