Suryaa.co.in

మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ ఇంట్లో అర్ధరాత్రి సీఐడీ హల్‌చల్
Andhra Pradesh Telangana

మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ ఇంట్లో అర్ధరాత్రి సీఐడీ హల్‌చల్

-కుప్పకూలిన లక్ష్మీనారాయణ, ఆసుపత్రికి తరలింపు
– ఇంటి వద్ద టీడీపీ నేతల నిరసన
(మార్తి సుబ్రహ్మణ్యం, హైదరాబాద్)
టీడీపీ నేత పట్టాభిరాం తర్వాత ఏపీసీఐడీ రెండో దూకుడు. మాజీ సీఎం చంద్రబాబు వద్ద ఓఎస్డీగా పనిచేసిన మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణకు నోటీసులిచ్చిన సీఐడీ ఆయనను ప్రశ్నించింది. గురువారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి గురువారం అర్ధరాత్రి 2గంటలకు వచ్చిన సీఐడీ అధికారులు హల్‌చల్ చేశారు. అయితే భయంతో లక్ష్మీనారాయణ కుటుంబసభ్యులు తలుపు తీయకపోవడంతో, అధికారులు తలుపులు పగులకొట్టి భయానక వాతావరణం సృష్టించారని లక్ష్మీనారాయణ కుటుంబసభ్యులు మీడియాకు చెప్పారు. తమ వెంట తీసుకువచ్చిన పత్రాలు ఇక్కడే దొరకినట్లు సంతకం చేయమని లక్ష్మీనారాయణను బెదిరించారని, అందుకు ఆయన నిరాకరించారని వివరించారు. అర్ధరాత్రి రావలసిన అవసరం ఏమిటని వాగ్వాదానికి దిగారు. ఈ విషయం తెలియడంతో హైదరాబాద్ నగర టీడీపీ అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబ, మాజీ

ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, సికింద్రాబాద్ పార్లమెంటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల కిశోర్, ప్రధానకార్యదర్శి బాలరాజ్‌గౌడ్, రాజాచౌదరి, టీఎన్‌టీయుసి రాష్ట్ర అధ్యక్షుడు బోస్, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి రవీంద్రాచారి, సిహెచ్ విజయశ్రీ, ఎం నర్సింహులు, లత, మల్లికార్జున్ తదితరులు లక్ష్మీనారాయణ నివాసానికి హుటాహుటిన చేరుకున్నారు. పోలీసుల ప్రయత్నాలపై నిరసన వ్యక్తం చేశారు. మచ్చలేని వ్యక్తిగా పేరున్న లక్ష్మీనారాయణపై కక్ష సాధింపు చర్యలను ఖండించారు. ‘‘ ఏపీ పోలీసులపై హైకోర్టు ఎన్నిసార్లు అక్షింతలు వేసినా, డీజీపీని కోర్టుకు పిలిపించినా జగన్ ప్రభుత్వానికి బుద్ధిరావడం లేదు. సీనియర్ ఐఏఎస్‌గా పనిచేసిన లక్ష్మీనారాయణ ఇంటికి అర్ధరాత్రి రావడం ఏమిటి? ఉదయం రావచ్చుకదా? ఆయనేమైనా దేశం విడిచి పారిపోతారా? జడ్జిలపై పోస్టింగులు పెట్టిన వారిని అరెస్టు చేయడం చేతకాని సీఐడీ, మాజీ ఐఏఎస్ ఇంటికి దాడికి రావడమేమిట’ని మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, సికింద్రాబాద్ పార్లమెంటు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా ప్రశ్నించారు.
ఈలోగా, రాత్రి సీఐడీ అధికారులతో జరిగిన వాగ్వాదంతో మానసిక ఒత్తిడికి గురైన లక్ష్మీనారాయణకు, హటాత్తుగా కళ్లు తిరిగి పడిపోయారు. గుండెనొప్పి రావడం కుటుంబసభ్యులను కలవరపరిచింది. దానితో ఆయనను ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు సీఐడీ అధికారులు తాము లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకుంటున్నామని కుటుంబసభ్యులకు చెప్పారు. అయితే నోటీసులు ఇవ్వకుండా ఎలా వస్తారని కుటుంబసభ్యులు ప్రశ్నించగా, అప్పుడు నోటీసులు అందించారు. ఈలోగా ధనుంజయ, సత్యనారాయణ బెడ్‌రూంలోకి కొన్ని పత్రాలతో వెళ్లి, తిరిగి వచ్చారు. స్టార్ ఆసుపత్రి నుంచి
ias-laxminarayanaడాక్టర్ దిలీప్ వచ్చి లక్ష్మీనారాయణకు ట్రీట్‌మెంట్ ఇచ్చారు. ఆయనను ఆసుపత్రికి తరలించాల్సి ఉందని, లక్ష్మీనారాయణ పేషెంట్ అని అధికారులకు స్పష్టం చేసినా, అధికారులు అంగీకరించలేదని నల్లెల కిశోర్ మీడియాకు చెప్పారు. పోలీసులు రౌడీల మాదిరిగా వచ్చి, సెర్చివారెంట్‌తో రాకుండా ఇంట్లోకి రావడం ఏమిటని కుటుంబసభ్యులు ప్రశ్నించారు. తాము వెంట తెచ్చిన డాక్యుమెంట్లను లక్ష్మీనారాయణ ఇంట్లో దొరికినట్లు అబద్ధపు సాక్ష్యం సృష్టించడం దారుణమని, అసలు మనం ప్రజాస్వామ్యదేశంలో ఉన్నామా? పాకిస్తాన్‌లో ఉన్నామా అని మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన ప్రశ్నించారు.
నాకేం సంబంధం లేదు: లక్ష్మీనారాయణ
రిటైర్డ్ ఐఏఎస్ డా.లక్ష్మీనారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 13న విచారణకు హాజరుకావాలని నోటీసులలో పేర్కొంది. రిటైర్డ్ ఐఏఎస్, డాక్టర్ లక్ష్మీనారాయణపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ఏ2గా లక్ష్మీనారాయణ పేరును చేర్చారు. మొత్తం 13 మంది పేర్లను ఎఫ్ఐఆర్‌లో ఏపీ సీఐడీ చేర్చింది. డిజైన్ టెక్, సిమెన్స్ కంపెనీ పేర్లను ఏ4, ఏ5గా సీఐడీ పేర్కొంది.
రిటైర్డ్ ఐఏఎస్, డాక్టర్ లక్ష్మీనారాయణను ఏపీ సీఐడీ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. 2017 జీవో ఎంఎస్-4 గురించి తనకు తెలియదని లక్ష్మీనారాయణ చెబుతున్నారు. తాను డైరెక్టర్‌గా ఉన్నప్పుడు 8 మంది ఎండీలు మారారని, కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉన్న సమయంలో రిటైర్డ్ అయ్యానని తెలిపారు.
సిమెన్స్‌తో ఎలాంటి ఒప్పందం కుదిరిందని ఏపీ సీఐడీ ప్రశ్నించారు. సిమెన్స్‌ వివిధ ప్రాంతాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు ఏర్పాటు చేసిందని, సిమెన్స్‌ మేనేజ్‌మెంట్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. సిమెన్స్‌తో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంవోయూ ఉందని, కార్పొరేషన్ రోజువారీ కార్యక్రమాల్లో పాలు పంచుకోలేదని లక్ష్మీనారాయణ తెలిపారు.

LEAVE A RESPONSE