రాష్ట్రప్రజల భవిష్యత్తును సమూలంగా మార్చిన ‘నవరత్నాలు’

0
131

–  వైయస్ జగన్ ఆలోచన నుంచి రూపుదిద్దుకున్న బృహత్కర పథకాలు
– పేదల కోసం నిరంతరం తపించే నాయకుడు  వైయస్ జగన్
– దేశంలోని పలు రాష్ట్రాలకు ఆదర్శంగా మారిన నవరత్నాలు
– వైయస్ఆర్ సిపి ప్లీనరీలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

వైయస్ఆర్ సిపి ప్లీనరీ:
1) నవరత్నాలతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు ఈ రాష్ట్రప్రజల భవిష్యత్తును సమూలంగా మార్చివేశారని రాష్ట్ర మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలోని వైయస్ఆర్ ప్రాంగణంలో జరిగిన వైయస్ఆర్ సిపి ప్లీనరీలో నవరత్నాలు – డిబిటి పథకాలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రసంగించారు.
2) రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు చేరువ చేసిన నవరత్నాలు మన ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారి ఆలోచన. భారతదేశంలో ఈ తరహా పథకాల రూపకల్పన, అమలు ఎక్కడా లేదు. నవరత్నాలను ఆచరణలో ప్రతి ఇంటికి తీసుకువెళ్ళేందుకు సీఎంగారు సచివాలయ, వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. జాతీయ స్థాయిలో ప్రజలకు పాలనను చేరువ చేసేందుకు రూపొందించిన ఇటువంటి వ్యవస్థలు మరే రాష్ట్రంలోనూ లేవు. ఒకేసారి నాలుగు లక్షల మందికి ఉద్యోగాలను కల్పించిన ఘనత కూడా మన సీఎంగారికే దక్కుతుంది. 2017లో వైయస్ఆర్ సిపి ప్లీనరీలో నవరత్నాల పథకాలను వైయస్ జగన్ గారు ప్రకటించారు. అధికారం లోకి వచ్చిన తరువాత వాటిని ఆచరణలో అమలు చేసి, ప్రజలకు మంచి భవిష్యత్తును అందిస్తున్నారు.
3) గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రం అవినీతిమయంగా మారింది. ప్రభుత్వ కార్యక్రమాలను తమ పార్టీకి అప్పగించారు. ప్రజలకు సంక్షేమం దూరమైంది. ఆ దుర్భర పరిస్థితులను చూసి, వైయస్ జగన్ గారు నవరత్నాలను తీసుకువచ్చారు. ప్రజల బతుకులను మార్చే దిశగా నేడు పాలనను కొనసాగిస్తున్నారు.

వైయస్ఆర్ కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా మేనిఫేస్టోలో ప్రకటించిన నవరత్నాలు:
1. జలయజ్క్షం
2. మద్యనిషేదం
3. ఆరోగ్యశ్రీ
4. ఫీజురియాంబర్స్ మెంట్
5. పేదలందరికీ ఇళ్ళు
6. వైయస్ఆర్ ఆసరా, వైయస్ఆర్ చేయూత
7. పింఛన్ల పెంపు
8. అమ్మ ఒడి
9. వైయస్ఆర్ రైతుభరోసా

4) రాష్ట్రంలో రైతుపక్షపాత ప్రభుత్వం-వైయస్ఆర్ రైతుభరోసాతో అన్నదాతకు అండ
ఈ రాష్ట్రంలో రైతులకు అండగా నిలిచిన స్వర్గీయ వైయస్ఆర్ ఆశయాలను ఆయన తనయుడు  వైయస్ జగన్ గారు అమలు లోకి తీసుకువచ్చారు. రైతుపక్షపాత ప్రభుత్వంగా వైయస్ఆర్ రైతుభరోసా పథకంను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిఏటా దాదాపు 50 లక్షల మందికి పైగా రైతులకు వర్తింప చేశారు. ఈ మూడేళ్ళలో ఇప్పటి వరకు డిబిటి ద్వారా రైతన్నల ఖాతాలకు మొత్తం 23,875 కోట్ల రూపాయలను జమ చేశారు. ప్రతి రైతు కుటుంబానికి అయిదేళ్ళలో 67,500 రూపాయలను పెట్టుబడి సాయంగా అందిస్తున్నాం. ఇలా ప్రతియేటా దాదాపు 50 లక్షల మందికి పైగా రైతన్నలకు సుమారు రూ.7వేల కోట్లు రూపాయలు ఒక్క రైతుభరోసా అన్న పథకం ద్వారానే అందిస్తున్నాం. మన మేనిఫెస్టోలో ప్రతి రైతన్నకు రూ.12,500 చొప్పున 4 ఏళ్లలో రూ.50 వేలు ఇస్తామని చెప్పాం. కానీ అంతకంటే ఎక్కువ అంటే రూ.13,500 చొప్పున హామీ ఇచ్చిన నాలుగేళ్లకు బదులు 5 సంవత్సరాలు ఇస్తున్నాం. అంటే 5 సంవత్సరాలు ముగిసే సరికి ప్రతి రైతు చేతిలో రూ.67,500 పెట్టే కార్యక్రమం జరుగుతుంది. వైయస్సార్‌ రైతు భరోసా అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతు కుటుంబానికి, కౌలు రైతులకు, దేవాదాయ భూములు సాగుచేస్తున్న రైతులకు, ఆర్వోఎఫ్‌ఆర్‌(అటవీభూములు) సాగు చేస్తున్న వారికి కూడా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. ఈ పథకం అమలు ప్రారంభించి వరుసగా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. నాలుగో ఏడాదికి మొదట విడత కింద ఖరీప్‌ సీజన్‌ మొదలుకాక ముందు మే నెలాఖరులోపు 7,500 రూపాయలు, తర్వాత పంట కోతకు వచ్చినప్పుడు అక్టోబరు మాసంలో మరో 4వేలు రూపాయలు, ఆ తర్వాత సంక్రాంతికి పంట ఇచ్చికొచ్చే సమయానికి మరో 2వేల రూపాయల చొప్పున మొత్తం 13,500 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తున్నాం.

5) పేదల ఆత్మబంధువు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ
పేద ప్రజల పాలిట ఆత్మబంధువు ఆరోగ్యశ్రీ. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఆలోచనల నుంచి రూపుదిద్దుకున్న ఆరోగ్యశ్రీని ఆయన తనయుడు వైయస్ జగన్ మరింత పటిష్టపరిచారు. వైద్యం కోసం డబ్బులు లేక ఏ ఒక్కరూ చనిపోకూడదని ఆరోగ్యశ్రీ పథకంను వార్షిక ఆదాయం రూ. 5 లక్షలు లోపు ఉన్న అన్ని వర్గాల వారికి వర్తింపచేశారు. అంతేకాదు వైద్యం ఖర్చు రూ. 1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తించేలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా 2436 చికిత్సా విధానాలకు గానూ పూర్తిగా పేదలకు ఉచిత వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై తదితర నగరాలతో పాటు మన రాష్ట్రంలో ఎక్కడ వైద్యం చేయించుకున్నా ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తున్నాం. వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఈ మూడేళ్ళలో 17,37,618 మందికి 6,002 కోట్ల రూపాయలను ఖర్చు చేశాం. ఆపరేషన్ లేదా జబ్బు చేసిన వ్యక్తికి చికిత్స తరువాత విశ్రాంతి సమయంలో ఆ కుటుంబానికి అండగా ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. కిడ్నీ వ్యాధి, తలసేమియా ఇంకా ఇటువంటి దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా రూ.10,000 పింఛన్ నెల నెలా ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ సేవలు ఇంకా మెరుగ్గా పకడ్బందీగా అందిస్తూనే మరోవైపు కార్పోరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్నారు. ఖాళీగా ఉన్న వైద్యులు, వైద్యసిబ్బంది పోస్టులను భర్తీ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీని తీసుకువస్తున్నారు.

6) విద్యార్ధులతోనే దేశ భవిష్యత్తు-అమ్మ ఒడి గొప్ప పథకం
ఈ దేశ భవిష్యత్తు విద్యార్ధులతోనే ముడి పడి ఉందని ఆలోచన చేసిన ఘనత  వైయస్ జగన్ గారికే దక్కుతుంది. గతంలో పాలించిన వారికి అమ్మ ఒడి వంటి మంచి పథకాన్ని తీసుకురావాలనే కనీస ఆలోచన కూడా రాలేదు. కానీ వైయస్ జగన్ పాఠశాలకు వెళ్ళే ప్రతి విద్యార్థికి అండగా నిలవాలి, వారిని మంచి చదువుల వైపు ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ పథకానికి రూపకల్పన చేశారు. అమ్మఒడి కింద ప్రతిఏటా 44 లక్షల మంది తల్లులకు మంచి చేస్తూ.. సుమారు 80 లక్షల మంది పిల్లలను ప్రోత్సహిస్తూ… ఈ మూడేళ్ళలో రూ.19,617 కోట్లు ఖర్చు చేశారు. ఒక మనిషి తలరాతైనా, కుటుంబం తలరాతైన, వారి బ్రతుకునైనా మార్చగలికే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉంది. ఒక సమాజం తలరాతను, ఒక దేశం తలరాతను కూడా మార్చగలికే శక్తి చదువుకు మాత్రమే ఉందని నమ్మిన మన ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎంతో ముందుచూపుతో జగనన్న అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌వరకు చదువుతున్న పిల్లలకు అమ్మ ఒడి ఇస్తున్నాం. ఈ పథకం ద్వారా ఈ మూడేళ్ళలో ఏటా దాదాపుగా 84 లక్షలమంది పిల్లలకు మంచి జరుగుతోంది. దాదాపు 44 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి జగనన్న అమ్మఒడి కింద రూ.6595 కోట్లు జమ చేస్తున్నాం.

7) వైయస్ఆర్ పెన్షన్ కానుకతో….అవ్వాతాతలకు మనవడిగా నిలిచారు
వైయస్ జగన్  ఎన్నికలకు ముందే తిరుపతి సభలో పెన్షన్లపై హామీ ఇచ్చారు. పెన్షన్ మొత్తాలను మూడు వేల రూపాయల వరకు పెంచుకుంటూ పోతానని హామీ ఇచ్చారు. ఆ విధంగా ఇప్పడు రూ. 2500 చొప్పున పెన్షన్ అందిస్తున్నారు. టిడిపి అధికారంలో ఉన్నప్పడు పెన్షన్లు ఇవ్వాలంటే గ్రామ, మండలం, జిల్లాలో జన్మభూమి కమిటీలు నిర్ణయించేవి. వారు కూడా తమ పార్టీ కార్యర్తలు, బంధువులు, తమకు డబ్బులు ఇచ్చిన వారికే పెన్షన్లు ఇస్తున్నారు. దీనిపై అప్పట్లోనే మేం కోర్ట్ కు కూడా వెళ్ళాం. వైయస్ జగన్ సీఎంగా అధికారంలోకి వచ్చిన తరువాత అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికీ పెన్షన్ ను చేరువ చేశారు.

వైయస్ఆర్ పెన్షన్ కానుక కింద ప్రతినెలా దాదాపు 61 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు పెన్షన్లు అందచేస్తున్నారు. పెన్షన్ల కింద ఈ మూడేళ్ళలో రూ. 52,041 కోట్లకు పైగా చెల్లింపులు జరిపాం. వృద్దాప్యంలో ఉన్న పండుటాకులకు పెన్షన్ కోసం కాళ్ళు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాల ముందు పడిగాపులు కాసే విధానంను  వైయస్ జగన్ పూర్తిగా మార్చివేశారు. జీవిత చరమాంకాంలో ఉన్న అవ్వాతాతలకు మనవడిగా నిలిచారు. నెల ఒకటో తేదీన తెల్లవారుజామునే పెన్షన్ దారుల గడప ముందుకు వెళ్ళి, పెన్షన్ సొమ్మును వారి చేతికే అందించే బృహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

అలాగే పింఛన్ల అర్హత వయస్సు 65 నుంచి 60కి తగ్గించారు. అవ్వా తాతల పింఛన్ ను 2వేల నుంచి రూ. 3,000 వరకు పెంచుకుంటూ పోతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆరునెలల ముందు వరకు ఇచ్చినపెన్షన్ల సంఖ్య కేవలం 39 లక్షలు మాత్రమే. ఈ రోజు మనం దాదాపుగా 61 లక్షల మందికి పైగా పెన్షన్‌లు ఇస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో పెన్షన్‌లపై నెలకు కేవలం రూ.400 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే ఈ రోజు మనం ప్రతినెలా దాదాపు 1570 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నాం. అంగవైకల్యానికి గురైన వారు, తీవ్ర కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నవారికి, తలసేమియా, సికిల్‌సెల్‌ ఎనీమీయా, హీమోఫీలియా, బోధకాలు, చివరికి పక్షవాతం వచ్చి మంచానికో, వీల్‌ చెయిర్‌కో పరిమితమైన వారు, కండరాల క్షీణత, కుష్టువ్యాధి, కిడ్నీ, కాలేయం, గుండె వంటివి ట్రాన్స్‌ ప్లాంట్‌ జరిగిన నిరుపేదలకు కూడా హెల్త్ పెన్షన్లు ఇస్తున్నాం. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలాంటి విధానం లేదు.

8) జగన్ నిర్మిస్తున్నవి ఇళ్ళు కావు… ఊళ్ళు
నీడలేని ప్రతి పేదవాడికి సొంత ఇంటిని నిర్మించి ఇవ్వాలనే తలంపుతో సీఎం వైయస్ జగన్ నిర్మిస్తున్నవి ఇళ్ళు కాదు… ఊళ్ళు. ఇప్పటి వరకు దేశంలోని మరే రాష్ట్రంలో ఇంత వరకు జరగని విధంగా మన రాష్ట్రంలో ఒకేసారి దాదాపు 31 లక్షల మందికి ఇళ్ళస్థలాలను ఇచ్చేందుకు 27 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది. నలబై అయిదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను…. ఎప్పుడూ ఇలా ఒకేసారి 31 లక్షల మంది మహిళల పేరుతో పట్టాలు ఇవ్వడం చూడలేదు. ఇది ఒక బృహత్కర కార్యక్రమం. తొలి విడతలో 15.60 లక్షల ఇళ్ళు, రెండో విడతలో 5.70 వైజాగ్, గ్రామీణ, డిడ్కో కింద 5.70 లక్షల ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది. మొత్తం 21.30 లక్షల ఇళ్ళను మొదలు పెట్టాం. ఇప్పటి వరకు దానికోసం 9వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఇల్లు లేని పేదలందరికీ పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు చూడకుండా ఇళ్ళ స్థలాలు, పక్కా ఇళ్ళు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

9) పేదల చదువుకు ఫీజు రీయింబర్స్ మెంట్ తో భరోసా
మహానేత వైయస్ఆర్ ప్రవేశపెట్టిన ఫీజురియాంబర్స్ మెంట్ పథకం ద్వారా దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా మన విద్యార్థులు ఉన్నత చదువులతో స్థిరపడి తమ కుటుంబాలను ముందుకు తీసుకుపోతున్నారు. మూడేళ్ళలో జగనన్న విద్యాదీవెన కింద 21.55 లక్షల మంది విద్యార్ధులకు రూ.7,678 కోట్లు చెల్లించారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పేదపిల్లల గురించి, వారి తల్లిదండ్రుల గురించి ఒక్క అడుగు ముందుకు వేస్తే.. ఆ తండ్రికి తగ్గ కొడుకుగా… వైయస్ జగన్ నాలుగు అడుగులు ముందుకు వేశారు. మన సమాజ గతినే మార్చగలిగే, పేదరికం నుంచి బయటకు తీసుకుని రాగలిగే చదువులనే మహా విప్లవాన్ని, ఫీజురీయాంబర్స్ మెంట్ ద్వారా విద్యాకుసుమాలను వికసించేలా నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వంలో వందశాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్న జగనన్న విద్యాదీవెన వంటి ఏ పథకాన్ని అమలు చేయలేదు. తెలుగుదేశం ప్రభుత్వం విద్యార్ధులకు అరకొరగా ఫీజులు చెల్లించింది. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఫీజు రియింబర్స్‌మెంట్‌కు సంబంధించి 2017–18, 2018–19 కి సంబంధించిన రూ.1778 కోట్ల రూపాయలు బకాయిలు కట్టకుండా గాలికి వదిలేస్తే.. వాటిని సైతం మన ప్రభుత్వం చెల్లించింది.

10) వైఎస్సార్ జలయజ్ఞంకు ప్రాధాన్యం
కరువు కాటకాలు వల్ల రైతులు చితికిపోకూడదనే లక్ష్యంతో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జలయజ్ఞం అనే పథకాన్ని స్వర్గీయ వైయస్ఆర్ ప్రవేశపెట్టారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ స్కీమ్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చారు. అలాగే రైతులకు సాగునీరు కొరత ఉండకూడదని ఈ పథకాన్ని ఆవిష్కరించారు. మహానేత వైఎస్సార్ మరణించే నాటికి కొన్ని ప్రాజెక్టులు రెడీ అయితే.. మరికొన్ని పెండింగ్‌లోనే ఉండిపోయాయి.
వైయస్ రాజశేఖర్ రెడ్డి తలపెట్టిన జలయజ్ఞం పథకాన్ని తన తనయుడు వైఎస్ జగన్ పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అందుకే ఈ పథకాన్ని నవరత్నాల్లో భాగంగా చేశారు. పోలవరం సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలుగొండ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను ప్రాధాన్యతల ఆధారంగా పూర్తి చేయడంపై దృష్టి సారించారు.

11) మద్యనిషేదం దిశగా ప్రభుత్వ అడుగులు
మద్యం మహిళల కాపురాల్లో చిచ్చుపెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. అందుకే అధికారంలోకి వచ్చిన తరువాత మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తామని వైయస్ జగన్ నవరత్నాల్లో మద్య నిషేదాన్ని చేర్చారు. మద్యంపై వచ్చే దానిని ఆదాయంగా చూడకుండా, మద్యం వ్యవసంకు పేదలు బలికాకుండా ఉండేందుకు దశలవారీగా మద్య నియంత్రణ చర్యలను ప్రభుత్వం చేపట్టింది. మద్యం ధరలను భారీగా పెంచడం, బెల్ట్ షాప్ లను పూర్తిగా నిర్మూలించడం, మధ్యం విక్రయ సమయాలను తగ్గించడం, క్రమంగా మద్యం షాప్ ల సంఖ్యను తగ్గించుకుంటూ… పూర్తిగా మద్యం మత్తు నుంచి ప్రజలను దూరంగా ఉంచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలకు మహిళా లోకం నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.

12) మహిళా స్వావలంభనకు కృషి-వైఎస్సార్ ఆసరా , వైఎస్సార్ చేయూత
ప్రతి కుటుంబంలోనూ 45-60 సంవత్సరాల వయస్సు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ మహిళలు తమ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడాలన్న లక్ష్యంతో సీఎం వైయస్ జగన్ వైయస్ఆర్ చేయూత పథకాన్ని తీసుకువచ్చారు. చేయూత పథకం ద్వారా 45-60 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళలకు అండగా నిలవడం, వారికి ప్రతిఏటా రూ. 18,750 చొప్పున నాలుగేళ్ళ పాటు మొత్తం రూ.75వేలు అందిస్తున్నారు. ఈ పథకం మహిళ జీవితాల్లో మార్పు తీసుకువస్తోంది. ఇళ్ళకే పరిమితమైన మహిళలు వ్యాపారదక్షతను అలవరుచుకుని, ఆర్థికంగా కుటుంబానికి చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకు చేయూత కింద దాదాపు 24,95,714 మంది అక్కచెల్లెమ్మలకు మొత్తం రూ.9,179 కోట్లు వారి ఖాతాలకు జమ చేశారు.

వైయస్‌ఆర్ ఆసరాతో 78.76 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతోంది. చంద్రబాబు అమలు చేయని హామీలను నమ్మి మోసపోయిన మహిళాబృందాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. వారిని ఆదుకునేందుకు దాదాపు 7.97 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని సుమారు 78.76 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు 4 వాయిదాల్లో రూ.25,517 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని జమ చేస్తున్నాం. దీనిలో భాగంగా వైయస్‌ఆర్ ఆసరా కింద రాష్ట్రంలో మొదటి ఏడాదిలోనే 7,87,524 స్వయం సహాయక బృందాలకు రూ.6318 కోట్ల రూపాయలను అందించారు. అలాగే రెండో విడతగా గత అక్టోబర్ ఏడో తేదీన 7,96,532 స్వయం సహాయక బృందాలకు రూ.6439 కోట్ల రూపాయలను చెల్లించారు. ఆసరా పథకం ద్వారా రెండు విడతల్లో మొత్తం రూ.12,757 కోట్ల రూపాయలను అక్కచెల్లెమ్మలకు ప్రభుత్వం అందించింది. ఈ సొమ్ముతో వారు వ్యాపార, ఉపాధి అవకాశాలను పెంపొందించుకునేందుకు ప్రభుత్వం సహకారంను అందిస్తోంది.