విజయవాడ: వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ పర్యటించారు. ఊర్మిళా నగర్‌లో నిత్యావసర కిట్లు పంపిణీ చేశారు. కర్నూలు జిల్లా నుండి మంత్రి టి.జి భరత్ ఆధ్వర్యంలో ఎనిమిది వేల నిత్యావసర కిట్లను తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలు తీసుకువచ్చారు. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలతో కలిసి వరద బాధితుల ఇంటికెళ్లి మంత్రి భరత్ పరామర్శించారు.
ప్రజల కష్టాలు తెలుసుకొని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వరదలు రావడం ఎంతో బాధాకరమని, కష్ట సమయాల్లో ప్రజలను రక్షించడంలో సీఎం చంద్రబాబు అనుభవజ్ఞుడని తెలిపారు. పరిస్థితులను చక్కదిద్దడంలో సీఎం చంద్రబాబును మించిన వారు మరొకరు లేరు… స్వయంగా రంగంలోకి దిగి నిద్రాహారాలుమాని పనిచేసిన సీఎం ఎక్కడా ఉండరన్నారు. కరోనా సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండింటే వేలాది మంది బతికేవారని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం మనం చేసుకున్న అదృష్టం… ప్రజల ఆశీర్వాదాలు సీఎం చంద్రబాబుపై ఉండాలని కోరారు. వైసీపీ నేతలు విమర్శలు చేయడం తప్ప వరద బాధితులకు సహాయం చేసింది ఏమీ లేదని విమర్శించారు.