
– మంత్రి కన్నబాబుతో కలిసి తలశిలకు సత్కారం
అమరావతి, డిసెంబర్ 6: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన 11 మంది ఎమ్మెల్సీలను రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అభినందించారు. బుధవారం ఏపీ శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభ వ్యవహారాలు, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తదితరులు హాజరయ్యారు.
ఎమ్మెల్సీలుగా విజయనగరం జిల్లా నుండి ఇందుకూరు రఘురాజు, విశాఖ జిల్లా నుండి వరుదు కళ్యాణి, వంశీకృష్ణ యాదవ్, తూర్పుగోదావరి జిల్లా నుండి అనంత ఉదయభాస్కర్, కృష్ణాజిల్లా నుండి తలశిల రఘురాం, మొండితోక అరుణ్ కుమార్, గుంటూరు జిల్లా నుండి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు, ప్రకాశం జిల్లా నుండి తూమాటి మాధవరావు, చిత్తూరు జిల్లా నుండి భరత్, అనంతపురం జిల్లా నుండి వై శివరామిరెడ్డి ప్రమాణస్వీకారం చేయడం జరిగింది. అనంతరం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబుతో కలిసి ఎమ్మెల్సీ తలశిల రఘురాంకు మంత్రి కొడాలి నాని పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీమోహన్, కైలే అనిల్ కుమార్, జోగి రమేష్, వైసీపీ నేత పాలడుగు రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.