Suryaa.co.in

Andhra Pradesh

చిన్నారికి మంత్రి మేకపాటి బీమా పత్రం

– చదువు బాధ్యత ప్రభుత్వానిదే

నెల్లూరు: ఇటీవల సంగం వద్ద జరిగిన ఆటో ప్రమాద సంఘటనలో తల్లిదండ్రులను కోల్పోయి అనాధగా మారిన చిన్నారి నవదీప్ (11) భవిష్యత్తుకు ఏం ఇబ్బంది రాకుండా అండగా ఉంటామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు.

సంగం మండలం బీరాపేరు వాగులో పడి ప్రాణాలు కోల్పోయిన ఆత్మకూరు పట్టణం, జ్యోతి నగర్ చెందిన బాధిత కుటుంబాన్ని బుధవారం సాయంత్రం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు తో కలసి పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమాద సంఘటనలో తల్లిదండ్రులను కోల్పోయి అనాధగా మారిన చిన్నారి నవదీప్ ను మంత్రి గౌతమ్ రెడ్డి, ఓదార్చి వై.ఎస్.ఆర్ భీమా పత్రాలను అందచేశారు.

నవదీప్ భవిష్యత్తుకు ఏం ఇబ్బంది రాకుండా ప్రభుత్వం ప్రకటించిన ఆర్ధిక సహాయం తో పాటు మరో రూ.10 లక్షల రూపాయల ఆర్థిక సహాయంను మంత్రి ప్రకటించారు. ఈ నగదును నవదీప్ పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేసి భ్యవిషత్ అవసరాల కొరకు వినియోగించేలా చర్యలు తీసులోవాలని మంత్రి గౌతమ్ రెడ్డి , అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ, వైయస్సార్ బీమా కింద రూ.15 లక్షలు ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబానికి సాయం అందించడం జరుగుతుందన్నారు.

చదువు బాధ్యత ప్రభుత్వమే చూసుకుంటుందని భరోసా ఇచ్చారు. భాధిత కుటుంబంలో చదువుకున్న వారు ఎవరైనా ఉన్నట్లైతే వారి అర్హత, ఆసక్తి తగ్గట్టు ఉద్యోగాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఆటో ప్రమాద సంఘటనలో బీరాపేరు వాగులో పడిపోయి గల్లంతైన వారి కోసం తీవ్రంగా శ్రమించిన అధికారులను, పోలీసు సిబ్బందిని, మత్స్యకారులను , స్థానికులను, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మంత్రి గౌతమ్ రెడ్డి అభినందించారు.

తొలుత మంత్రి గౌతమ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తో కలసి సంగం సమీపంలో జరిగిన ఆటో ప్రమాదం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వాగులో పడి ఒకే కుటుంబానికి చెందిన 12 మంది పడిపోయారని వార్త విన్న వెంటనే నా మనసు చలించిపోయింది ఒకే కుటుంబంలో ఆరుగురు చనిపోవడం, ఇప్పటికీ గల్లంతైన వారిలో ఇద్దరు కనుమరుగవడం తీవ్ర వేదన మిగిల్చే చేదు జ్ఞాపకం మని అన్నారు.

జిల్లా ఎస్పీ సహా, ఆత్మకూరు డిఎస్పి, ఆర్డిఓలను అప్పటికప్పుడు ఎలాగైనా కాపాడాలని ఆదేశించడం జరిగిందని, జిల్లా కలెక్టర్, జేసీల సహకారంతో ద్వారా ఎన్డీఆర్ఎఫ్ బృందాల గాలింపును మరిన్ని రోజులు పెంచినా దురదృష్టవశాత్తు సగం మందినే రక్షించుకోగలిగామన్నారు. బీర పేరు వాగు ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి ఆదుకున్న ఆర్డీవో సహా, ప్రతి ఒక్కరికి మంత్రి గౌతమ్ రెడ్డి, అభినందనలు తెలిపారు.మంత్రి వెంట ఆత్మకూరు పురపాలక సంఘం చైర్ పర్సన్ గోపారం వెంకట రమణమ్మ, వైస్ చైర్మన్లు షేక్ సర్ధార్, శ్రావణ్ కుమార్, ఆర్.డి.ఓ చైత్ర వర్షిణి, డి.ఆర్.డి.ఏ పి.డి సాంబశివా రెడ్డి, మున్సిపల్ కమీషనర్ రమేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE