Suryaa.co.in

Andhra Pradesh

టమోటా రైతులు ఆధైర్యపడవద్దు

– ప్రభుత్వమే పంట కొంటుంది
– టమోటా రైతులకు ఎమ్మెల్యే పరిటాల సునీత భరోసా
– ఆలమూరులో టమోటా పంటను పరిశీలించిన ఎమ్మెల్యే సునీత
– ప్రస్తుతం 15కిలోల బాక్స్ రూ.50నుంచి వంద రూపాయలు మాత్రమే పలుకుతోందన్న రైతులు
– ప్రభుత్వం కిలో రూ.8 లతో కొనుగోలు చేస్తుందని హామీ

అనంతపురం: టమోట పంటకు గిట్టుబాటు ధరలు లేవని రైతులు ఆందోళన చెందవద్దని.. ప్రభుత్వమే మీ పంట కొనుగోలు చేస్తుందని రైతులకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత భరోసా ఇచ్చారు. అనంతపురం రూరల్ మండల పరిధిలోని ఆలమూరు గ్రామసమీపంలో రైతులు నారాయణ తదితరులు సాగు చేసిన టమోటా పంటను ఆమె పరిశీలించారు. పంటకు ఎంత పెట్టుబడి పెట్టారు.. ఎంత మేర దిగుబడి వచ్చింది. ప్రస్తుతం ధర ఎంత వరకు పలుకుతోందని ఆరా తీశారు.

మొన్నటి వరకు ధరలు బాగా ఉండేవని.. ప్రస్తుతం ధరలు తగ్గిపోయాయాన్నారు. కనీసం మార్కెట్ కు తరలిస్తే.. పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదన్నారు. మార్కెట్లో ప్రస్తుతం 15కిలోల బాక్స్ 50నుంచి వంద రూపాయలు పలుకుతోందని.. అది కూడా మొదటి రకంకి మాత్రమే ఈ ధర ఉందన్నారు. కనీసం 150నుంచి నుంచి 250రూపాయల వరకు ధర ఉంటే.. తమకు గిట్టుబాటు అవుతుందని రైతులన్నారు. ఎమ్మెల్యే సునీత వెంటనే మార్కెటింగ్, ఉద్యాణశాఖ అధికారులతో మాట్లాడారు.

ధరలు ఎందుకు తగ్గాయని ఆరా తీశారు. నాందేడ్, నాగపూర్, తెలంగాణ, తమిళనాడు, ఛత్తీస్ ఘడ్ తో పాటు ఉత్తర భరతదేశంలో దిగుబడి ఎక్కువ రావడంతో ఎక్స్ పోర్టు లేక ఇక్కడ ధరలు తగ్గాయని అధికారులు తెలిపారు. ప్రతి ఏటా ఈ సమయానికి పంట దిగుబడి ఉండదని, ఈ సంవత్సరం ఇంకా దిగుబడి ఉండడంతో మార్కెట్ ఎక్స్పోర్ట్ లేక ధరలు పడిపోతున్నాయన్నారు. దీని వలన రైతులకు నష్టం ఉంటుందన్నారు. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వం రైతుల నుంచి టమోటాను కొనుగోలు చేస్తుందన్నారు.

అనంతపురం జిల్లా నుండి ప్రభుత్వం టమోటాను కొనుగోలు చేసి విజయవాడ రైతు బజార్లకు సరఫరా చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం అయిన మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం(MIS)లో NAFED మరియు NCCF ద్వారా రాష్ట్రంలో ఉన్న టమోటాను అన్ని ఆపరేషనల్ ఖర్చులను వారే భరించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకుందన్నారు. దీనివలన కిలో టమోటా ధర సుమారు రూ.10 నుంచి రూ.15ల వరకు రైతులకు అందుతుందన్నారు.

అంతే కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రాసెసింగ్ యూనిట్లకు కూడా ఈ టమాటోలను పంపి రైతులకు మంచి గిట్టుబాటు ధర వచ్చే విధంగా అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే నడుస్తున్న ఈ ప్రభుత్వం రైతుల కోసం పని చేస్తోందని ఎమ్మెల్యే సునీత అన్నారు.

LEAVE A RESPONSE