– సర్వేపల్లి శాసన సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
తిరుమల: తిరుమలలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని సర్వేపల్లి శాసన సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం తొలిసారి శ్రీవారిని దర్శనానికి వచ్చిన సోమిరెడ్డి.. ఆయన వెంట తెలంగాణ డెయిరీ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి కుటుంబంతో పాటు కుమార్తె డాక్టర్ సోమిరెడ్డి సింధు కుటుంబ సభ్యులు ఉన్నారు. శ్రీ వారి దర్శనం అనంతరం సోమిరెడ్డిని ఆలయ మర్యాదల ప్రకారం టీటీడీ అధికారులు సత్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో సోమిరెడ్డి ఏమన్నారంటే…
ఏడుకొండల వాడి ఆశీస్సులతో ప్రజలందరూ బాగుండాలని, రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకున్నాను. ఆంధ్రప్రదేశ్ కు ఆర్థిక కష్టాల నుంచి విముక్తి కల్పించడంతో పాటు అద్భుతమైన రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దే శక్తిని చంద్రబాబు నాయుడుకి ఇవ్వాలని శ్రీవారిని వేడుకున్నాను. మొన్న వరదలు పోటెత్తిన సమయంలో ప్రకాశం బ్యారేజీ పైకి వదిలిన బోట్ల వెనుక ఎవరున్నారో.. వాటి రంగులే చెబుతున్నాయి.. పొరపాటున ఏమైనా జరిగివుంటే పరిస్థితి ఏంటి? వైసీపీ ఐదేళ్ల పాలనలో గాడి తప్పిన వ్యవస్థలన్నింటిని సక్రమ మార్గంలో పెట్టి ప్రజలకు మంచి పాలన అందించేందుకు దేవుడి ఆశీస్సులతో ఎన్డీయే ప్రభుత్వం ముందుకు సాగుతోంది.