Suryaa.co.in

Andhra Pradesh

ఎమ్మెల్యే వసంత ఆన్ డ్యూటీ

  • వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే వసంత విస్తృత పర్యటన
  • వర్షం పడుతున్నా ఆగని వసంత అడుగులు
  • ప్రజలకు సేవలను అందించే క్రమంలో రాజీలేని తత్వం
  • కృష్ణానదికి వరద ఉధృతి…మరింత అప్రమత్తంగా ఉండండి

ఇబ్రహీంపట్నం: వరద ప్రభావిత ప్రాంతాల్లో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఓ వైపు జోరున వర్షం పడుతున్నప్పటికీ ఆయన అడుగు ఆగడం లేదు. ఐదు పదుల వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా పర్యటిస్తూ బాధిత ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. శనివారం ఉదయం నుంచి ప్రారంభమైన ఆయన పర్యటన ఆదివారం కూడా నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది.

వరద బాధితులకు అందుతున్న సహాయక చర్యలను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఎంతో ఓపికతో పర్యటిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ఓ వైపు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూనే, మరో వైపు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. వరద బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ప్రాణనష్టాన్ని నివారిస్తున్నారు. ముందుగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

ఐదు దశాబ్దాల్లో కనీ వినీ ఎరుగని రీతిలో ఎదురైన జల ప్రళయాన్ని సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు సఫలీకృతం అయ్యారని చెప్పవచ్చు. ప్రజలకు యుద్ధప్రాతిపదికన వసతి ఏర్పాట్లు చేయించారు. ఆహారం, తాగునీరు అందజేశారు. రెస్క్యూ టీములను పంపి వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించారు. ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను తగు చర్యలకు ఆదేశించారు.

ముఖ్యంగా వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ గేట్లు ఎత్తేసే క్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ముందుగానే ప్రజలను అప్రమత్తం చేశారు. వరద బీభత్సం క్రమేపీ పెరుగుతున్న దృష్ట్యా గేట్లు ఎత్తాల్సి వచ్చింది. కవులూరు, ఈలప్రోలు, రాయనపాడు తదితర గ్రామాల ప్రజలను, రైతులను అప్రమత్తం చేసి నష్టనివారణకు తన వంతు ప్రయత్నం చేశారు.

LEAVE A RESPONSE