సిటీ ఎమ్మెల్యేల..పిటీ పిటీ !

– క్యాంపు ఆఫీసులు లేని రాజధాని ఎమ్మెల్యేలు
– జిల్లాల ఎమ్మెల్యేలకే ఆఫీసు అదృష్టం
– స్థలం లేకనే సమస్యలంటున్న అధికారులు
– కర్నాటక తర్వాత తెలంగాణలోనే ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులు
( మార్తి సుబ్రహ్మణ్యం)
వారంతా పేరుకే హైదరాబాద్ రాజధాని నగర ఎమ్మెల్యేలు. కానీ కూర్చోవడానికి క్యాంపు ఆఫీసు లేని దురదృష్టవంతులు. ఆ అదృష్టం జిల్లాల ఎమ్మెల్యేలకే సొంతం. రాజధాని నగర ఎమ్మెల్యేలకు క్యాంపు ఆఫీసుల కోసం ఉత్తర్వులిచ్చినా స్థలం లేని దయనీయం. దానితో సిటీ ఎమ్మెల్యేలు ఎక్కడ కూర్చుంటే అదే క్యాంపు ఆఫీసు. ఇళ్లకు వచ్చే ప్రజలకు అక్కడే సమాధానం చెప్పి, పనులు చేసి పంపిస్తున్న హైదరాబాద్ నగర ఎమ్మెల్యేల దుస్థితి ఇది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. ప్రతి ఎమ్మెల్యేలకు ఒక క్యాంపు ఆఫీసు ఉండాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. నియోజకవర్గాల పర్యటనలకు వెళ్లినప్పుడు ఎమ్మెల్యేలు ఉండేందుకు ఒక ఆఫీసు ఉంటే, ఆ నియోజకవర్గ ప్రజలు నేరుగా అక్కడికే వెళ్లే వెసులుబాటు ఉంటుందని కేసీఆర్ భావించారు. జిల్లా- నియోజకవర్గ స్థాయిలో ఎస్పీ, కలెక్టర్, డీఎస్పీ, ఆర్డీఓ, ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్లకు ఆఫీసులు ఉన్నప్పుడు.. 2 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేకు ఆఫీసు లేకపోవడం భావ్యం కాదన్న దూరదృష్టితో, ప్రతి ఎమ్మెల్యేకు ఒక క్యాంపు కార్యాలయం నిర్మించాలని సీఎం చాలాకాలం క్రితమే నిర్ణయించారు.
దానికోసం కోటి రూపాయలు రెండు విడతలుగా విడుదల చేశారు. ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ శాఖలకు సంబంధించిన స్థలాలను గుర్తించి, ఆక్కడ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులు నిర్మించారు. ప్రస్తుతం చాలా నియోజకవర్గాల్లో క్యాంపు ఆఫీసులు పూర్తి కాగా, మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. కొన్ని చోట్ల ఎస్పీ-ఆర్డీఓ ఆఫీసు ప్రాంగణంలో కూడా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులు నిర్మించారు. అన్ని ఆఫీసులూ ఒకేచోట ఉంటే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్న భావనతో కేసీఆర్, ఈ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు.
ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, గెలిచిన ఎమ్మెల్యేలకు శాశ్వతంగా ఒక క్యాంపు ఆఫీసు ఉండాలన్న లక్ష్యంతోనే కేసీఆర్ ఈ వినూత్న ఆలోచనకు తెరలేపారు. నిజానికి ఎమ్మెల్యేలకు క్యాంపు ఆఫీసులు ఇప్పటిదాకా దేశంలో కర్నాటకలో మాత్రమే ఉన్నాయి. అక్కడి విధానం చూసిన కేసీఆర్, తెలంగాణలో కూడా అదే విధానం అమలుచేయాలని నిర్ణయించారు. ఫలితంగా నియోజకవర్గాలకు వెళుతున్న ఎమ్మెల్యేలు క్యాంపు ఆఫీసులోనే కొలువు దీరి, రాత్రిళ్లు అక్కడే బస చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాల్లోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులలో ఎమ్మెల్యే పీఏ, అధికారులతో సమావేశాలు, విశ్రమించేందుకు ప్రత్యేకంగా గదులు నిర్మించారు.
అయితే, హైదరాబాద్ ఎమ్మెల్యేలకు మాత్రం ఈ సౌకర్యం లేకపోవడం ఇబ్బందిగా మారింది. కొంతమంది ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో గదులు ఉన్నప్పటికీ, ప్రజలు అక్కడి వరకూ వెళ్లడం తక్కువే. నిజానికి జిల్లాల్లో ఎమ్మెల్యేలతో పోలిస్తే, నగర ఎమ్మెల్యేలపై జనం ఒత్తిళ్లు ఎక్కువ.అయితే హైదరాబాద్‌లో కూడా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుల కోసం 500 గజాల స్థలాన్ని కేటాయిస్తూ, జిల్లా కలెక్టర్ చాలాకాలం క్రితమే ఉత్తర్వులిచ్చారు. అయితే నగరంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అంత స్థలం లేకపోవడంతో, ఇప్పటివరకూ క్యాంపు ఆఫీసులు నిర్మించలేకపోయినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాల్లో క్యాంపు ఆఫీసులను ఆర్ అండ్ బీ అధికారులు నిర్మిస్తుండగా, హైదరాబాద్‌లో ఏ శాఖ నిర్మించాలన్నదానిపై స్పష్టత లేదంటున్నారు.
దీనితో ఎమ్మెల్యేలు ప్రైవేటుగా ఆఫీసులు తీసుకోవడమో, లేక ఇళ్లనే క్యాంపు ఆఫీసులుగా మార్చుకోవడమో చేస్తున్నారు. ప్రైవేటు ఆఫీసులకు అద్దెలు ఎక్కువయినప్పటికీ, ప్రజల సౌకర్యం కోసం అక్కడ నుంచి కార్యకలాపాలు కొనసాగించక తప్పడం లేదని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ‘నగరంలో మాకు 500 గజాల స్థలం దొరకడం దుర్లభం. కొన్నిచోట్ల స్థలాలు ఉన్నప్పటికీ అవి కోర్టుల్లో ఉన్నాయి. మరికొన్ని రైల్వే, రక్షణ ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖల అధీనంలో ఉన్నాయి. సిటీలో అయితే ఎమ్మెల్యేలకు క్యాంపు ఆఫీసులు అవసరం. ఈ సమస్యకు మా సీఎం గారు పరిష్కారం చూపిస్తారని ఆశిస్తున్నామ’ని ఒక ఎమ్మెల్యే చెప్పారు. ఇదేవిధంగా సికింద్రాబాద్ నియోజకవర్గం మారేడ్‌పల్లిలో స్థలం ఉన్నప్పటికీ, కోర్టు వివాదం కారణంగా పెండింగ్‌లో ఉండటంతో, కార్మిక శాఖ స్థలాన్ని ఎంపిక చేసుకోవలసి వచ్చింది.
మినిష్టరు చాంబర్లకు మించి పద్మారావు కార్పోరేట్ స్థాయి క్యాంపు ఆఫీసు
హైదరాబాద్ నగరంలోని ఎమ్మెల్యేలకు క్యాంపు ఆఫీసు లేకపోయినప్పటికీ, సికింద్రాబాద్ ఎమ్మెల్యే-డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు మాత్రం, కార్పొరేట్ స్థాయి క్యాంపు ఆఫీసు నిర్మించడం విశేషం. మంత్రుల చాంబర్లకు మించి, అన్ని హంగులతో క్యాంపు ఆఫీసు నిర్మించారు. సీతాఫల్‌మండిలోని కార్మికభవన్‌లో దాదాపు వెయ్యి గజాల స్థలంలో ఎమ్మెల్యే చాంబరు, మీటింగ్ హాల్, ప్రజలు కూర్చునేందుకు పెద్ద వరండా, పీఏ, కార్యాలయ సిబ్బందికి గదులు నిర్మించారు. అయితే ఇప్పటివరకూ దీనికి, ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు కేటాయించకపోయినప్పటికీ, కాంట్రాక్టర్లను ఒప్పించి కార్పొరేట్ స్థాయిలో క్యాంపు ఆఫీసు నిర్మించారు. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చిన తర్వాత సర్దుబాటు చేస్తారని కార్యాలయ వర్గాలు వివరించారు.
అదేవిధంగా ఇదే క్యాంపు ఆఫీసులో, సికింద్రాబాద్ నియోజకవర్గంలోని కార్పొరేటర్లకు సైతం ప్రత్యేకంగా గదులు నిర్మించడం విశేషం. ఈవిధంగా కార్పొరేటర్లకు కూడా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులోనే కార్యాలయాలు ఏర్పాటుచేయడం, హైదరాబాద్ నగరంలో ఇదే తొలిసారి కావడం విశేషం.
‘ప్రజలు నా కోసం ప్రతిరోజూ నా ఇంటి వరకూ కష్టపడి రావడం నాకు నచ్చలేదు. నేనే ప్రజల మధ్యలో ఉండాలన్న ఉద్దేశంతో ఈ క్యాంపు ఆఫీసు నిర్మించాం. అధికారులకు, ప్రజలకు వే ర్వేరుగా గదులు నిర్మించాం. ఇంత పెద్ద ఆఫీసు ఎందుకని చాలామంది అడిగారు. ఇది నా కోసం కాదు. ఇది నా సొంతం కాదు. ప్రజల ఆశీస్సులున్నంత వరకూ నేను ఎమ్మెల్యేగా ఉంటా. ఆ తర్వాత వచ్చే వారికి ఈ ఆఫీసు శాశ్వతంగా ఉపయోగపడుతుందన్న దూరదృష్టితో, క్యాంపు ఆఫీసు నిర్మించడం జరిగింది. ఇది నిర్మించిన తర్వాత ఇంటికి వచ్చే ప్రజల సంఖ్య తగ్గిపోయింది. రాత్రివరకూ ఇక్కడే ఉండటం వల్ల ప్రజల సమస్యలను ఇక్కడే పరిష్కరించి పంపిస్తున్నాం. నా ఆఫీసు సిబ్బంది ఉదయం పదిగంటల నుంచే అందుబాటులో ఉండటం వల్ల, మరీ ముఖ్యమైతే తప్ప ఎవరూ ఇంటివరకూ రావడం లేదు. క్యాంపు ఆఫీసు నిర్మించిన ఉద్దేశం కూడా అదే’నని డిప్యూటీ స్పీకర్ పద్మారావు వివరించారు.

Leave a Reply