– బిజెపి ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన కార్యశాలలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు
హైదరాబాద్: గిరిజన నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని నవంబర్ 9 నుండి 16 వరకు దేశవ్యాప్తంగా “జనజాతీయ గౌరవ్ దివస్” వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో బిజెపి ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన కార్యశాలలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రణాళిక రూపొందించారు. ఈ సమావేశానికి బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఏమన్నారంటే.. భగవాన్ బిర్సా ముండా గిరిజన హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు. బ్రిటిష్ వలసవాదంపై తిరుగుబాటు చేసి, గిరిజన సమాజానికి ఆరాధ్యదైవంగా నిలిచారు. ఆయన పోరాట స్పూర్తి మన అందరికీ స్ఫూర్తిదాయకం.
గతంలో విస్మరించబడిన గిరిజన సమాజం, వారి గొప్ప సాంస్కృతిక వారసత్వం, కృషిని గుర్తిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతి సంవత్సరం జనజాతీయ గౌరవ్ దివస్ను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. మోదీకి గిరిజన వర్గాలపై ప్రత్యేకమైన అనుబంధం, గౌరవం ఉంది. వారి అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తున్నారు.
ప్రధానమంత్రి మోదీ గిరిజన నాయకులు, కళలు, సంస్కృతులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించేందుకు కృషి చేస్తూ, ప్రపంచ నాయకులకు గిరిజన కళాఖండాలను అందించడం ద్వారా భారత గిరిజన సంస్కృతుల పట్ల ప్రపంచవ్యాప్తంగా గౌరవం పెంచారు. కార్యశాలలో బిజెపి ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు నేనావత్ రవి నాయక్ , జిల్లా ఇంచార్జీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.