Suryaa.co.in

Telangana

మోదీ బీసీ కాదు… ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ

– ఆయన పుట్టుకతోనే ఉన్నత కులం
– కేసీఆర్.. ప్రజలను దోచుకున్న నీ కొడుకును, అల్లుడిని, బిడ్డను కొట్టు
– మళ్లీ బయటకు వచ్చి చేసేదేముంది?
– సోషల్ మీడియాతో ఏం చేస్తారు?
– దండం పెట్టి దండాలు పెడితే పదవులు రావు
– ఇచ్చిన మాట ప్రకారం సబ్ కమిటీ ఏర్పాటు చేసి కులగణన ప్రక్రియ పూర్తి
– గల్లీలో పేదల కోసం పనిచేసే వారినే పదవులు
– యువజన కాంగ్రెస్ నేతల ప్రమాణస్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌: యూత్ కాంగ్రెస్ లో పనిచేసిన చాలామంది జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో రాణించారు. రాజకీయాల్లో యువజన కాంగ్రెస్ మొదటి మెట్టు. ప్రజల వద్దకు వెళ్లి పేదల కోసం పనిచేస్తేనే రాజకీయాల్లో రాణిస్తారు. కాంగ్రెస్ కార్యకర్తలు భుజాలు కాయలు కాసేలా జెండాను మోసి రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నాం.

ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత యూత్ కాంగ్రెస్ పై ఉంది. పార్టీ అనుబంధ విభాగాల్లో బాధ్యత తీసుకున్న వారికి ప్రభుత్వంలో స్థానం కలిపిస్తామని ఆనాడు చెప్పాం. 37 కార్పొరేషన్ చైర్మన్ పదవులను అనుబంధ విభాగాలకు అందించాం. కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుంది. దండం పెట్టి దండాలు పెడితే పదవులు రావు. అలాంటి వారు పదవుల సంగతి మరచిపోండి. ఢిల్లీ నుంచి పైరవీలతో కాదు… గల్లీలో పేదల కోసం పనిచేసే వారినే పదవులు వరిస్తాయి. డబ్బులతో ఎన్నికల్లో గెలిచే రోజులు పోయాయి. నిత్యం ప్రజల్లో ఉండే వారినే గెలుపు వరిస్తుంది.

గట్టిగా కొడతానని అంటున్న కేసీఆర్ కు ఈవేదికగా చెబుతున్నా…గట్టిగా కొట్టాలంటే దుర్మార్గంగా ప్రజలను దోచుకున్న నీ కొడుకును, అల్లుడిని, బిడ్డను కొట్టు. ఇగ ఆయన బయటకు వస్తానని చెప్పుకుంటుండు.. బయటకు వచ్చి ఏం చేస్తాడు? నువ్వు కుర్చీలో ఉన్నప్పుడే నిన్ను బండకేసి కొట్టి ఓడగొట్టారు. మళ్లీ బయటకు వచ్చి చేసేదేముంది?

మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు భర్తీ చేసింది. రైతులకు రుణమాఫీ చేశాం…నీవు ఎగ్గొట్టిన రైతు బంధు మేం వేశాం.దేశంలో కులగణన చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. మాదిగ ఉపకులాల వర్గీకరణను అమలు కోసం నిర్ణయం తీసుకున్న రాష్ట్రం తెలంగాణ. మోదీ మందకృష్ణను ఎన్నోసార్లు కౌగిలించుకున్నారు. అది ధృతరాష్ట్ర కౌగిలిగానే మిగిలింది తప్ప వర్గీకరణ అమలు చేయలేదు.

సోషల్ మీడియాలో ప్రభుత్వంపై బీఆరెస్ దుష్ప్రచారం చేస్తోంది. చానెళ్లు, పేపర్లు ఉన్నప్పుడే కాంగ్రెస్ ను ఏమీ చేయలేకపోయారు. సోషల్ మీడియాతో ఏం చేస్తారు? యువజన కాంగ్రెస్ అనుకుంటే ఒక్కసారి కాదు. నాలుగుసార్లు గెలిపిస్తారు. మీతో పాటు నేను కూడా సిద్ధం. తెలంగాణకు చిల్లిగవ్వ ఇవ్వని మోదీపై పోరాటానికి సమయం ఇవ్వాలని సంయమనం పాటిస్తున్నాం.

త్వరలోనే అన్ని సమస్యలపై కార్యాచరణ రూపొందిస్తాం. ప్రజా సమస్యలపై కేంద్రంపై చేసే పోరాటంలో మీరు ముందుభాగాన నిలవాలి. అత్యంత ప్రధానమైన రెండు కీలక అంశాలపై కాంగ్రెస్ సాహసోపేత నిర్ణయాలు తీసుకుంది. కులగణనపై లేని అపోహలను సృష్టించి తప్పుల తడక అని చెప్పాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. నిజం నిప్పులాంటి అది వారినే దహిస్తుంది తప్ప ప్రజలకు నష్టం కలిగించదు.

మహాత్ముడి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని దేశ సమగ్రత కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నారు. సోనియా గాంధీ మాట ఇస్తే శిలా శాసనం అని ఆనాడు తెలంగాణ ఏర్పాటుచేసి నిరూపించుకున్నారు. కులగణన చేసి బలహీన వర్గాల జనాభా లెక్కగట్టి వారికి రిజర్వేషన్లు కల్పిస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సబ్ కమిటీ ఏర్పాటు చేసి కులగణన ప్రక్రియ పూర్తి చేసుకున్నాం.

సాంకేతికంగా, న్యాయ పరంగా కులగణనపై నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్లాం. 150 ఇండ్లను ఒక యూనిట్ గా చేసి ఎన్యుమరేటర్లను నియమించి కులగణన నిర్వహించాం. కులగణన ప్రకారం 56.33 శాతం బలహీనవర్గాల లెక్క తేలింది. చెట్ల మీద విస్తర్లు కట్టినట్టు కెసిఆర్ ఆనాడు సమగ్ర కుటుంబ సర్వేలో కాకిలెక్కలు చూపించారు. కెసిఆర్ లెక్కలు నిజమైతే 52 గా ఉన్న మాదిగ ఉపకులాలు కెసిఆర్ లెక్కపెడితే 82 ఎట్ల అయినయి? వాళ్లు పెద్ద గ్యాంబ్లర్స్… ఆ గ్యాంబ్లర్స్ కు ఇష్టం లేకనే సర్వేలో పాల్గొనలేదు.

ప్రజలు అడిగి కడుగుతారని ఈ లెక్కలను గందరగోళం చేసి గంగలో కలపాలని చూస్తున్నారు. ఈ లెక్క నాకోసం చేయలేదు.. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ నాయకుడిగా మా నాయకుడి ఆదేశాలను పాటించా. త్యాగానికి సిద్ధమయ్యే ఈ లెక్కలను పక్కాగా చేయించాం. మా నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కులగణన నిర్వహించాం.

గణనలో ఒక్క తప్పు లేదు… వాళ్లు రాసి సంతకం పెట్టిన లెక్కనే మేం తీసుకున్నాం. జనజీవన స్రవంతిలో కలవని వారికి కూడా మళ్లీ అవకాశం ఇచ్చాం. ఇది మా నిబద్ధతకు నిదర్శనం. రాహుల్ గాంధీ మోదీ మెడలు వంచుతారనే కులగణనపై బీజేపీ కుట్రలు చేస్తోంది.

మోదీ బీసీ కాదు… ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. ఆయన పుట్టుకతోనే ఉన్నత కులం.. 2001 లో ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కులాన్ని బీసీల్లో చేర్చుకున్నారు. ఆయన బీసీ అయితే ఇన్నాళ్లు కులగణన ఎందుకు చేయలేదు.చిత్తశుద్ధి ఉంటే జనగణనలో కులగణనను పరిగణనలోకి తీసుకోవాలి. ఈ లెక్కలను తప్పు పడితే నష్టపోయేది బీసీలే. వర్గీకరణ కోసం జరిగిన పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.

మేం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేస్తే దాన్ని కూడా తప్పుపట్టాలని చూస్తున్నారు. అలాంటి వారి మాటలు నమ్మొద్దు. త్వరలోనే దీన్ని చట్టం చేయబోతున్నాం. కెసిఆర్, కేటీఆర్, హరీష్ ఇండ్లముందు మేలుకొలుపు డప్పు కొట్టండి.. వాళ్లను లైన్ లో పెట్టి లెక్కగట్టండి. కులగణనలో నమోదు చేయించుకోకపోతే కెసిఆర్ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేయాలని తీర్మానం చేస్తున్నాం.

LEAVE A RESPONSE