– వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
అమరావతి : అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఎంపికచేసిన గిరిజనుల కుటుంబాల వారికి 89,845 దోమ తెరలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. దోమల ద్వారా వచ్చే మలేరియా జ్వరాల వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా దోమ తెరలను ఎంపిక చేసిన గిరిజనుల కుటుంబాలకు ఇస్తామని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
గడిచిన మూడేళ్ళలో అధికంగా నమోదైన మలేరియా జ్వరాల కేసుల ప్రాతిపాదికన అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కలిపి, ఎంపికచేసిన 743 గ్రామల్లోని గిరిజనులకు వీటిని అందచేస్తామని తెలిపారు పార్వతీపురం మన్యం జిల్లాకు 26,338, అల్లూరి సీతారామరాజు జిల్లాకు 63,507 దోమ తెరలను పంపిణీ చేస్తామని తెలిపారు. వీటి ద్వారా ఎంపికచేసిన సదరు కుటుంబాల్లో ఉన్న సుమారు 2 లక్షల మంది గిరిజనులు ప్రయోజనం పొందుతారని వెల్లడించారు. 89,845 దోమతెరల కొనుగోలుకు రూ.2.30 కోట్లు వరకు వ్యయం కావొచ్చునని అంచనా నెల రోజుల్లో గిరిజనులకు వీటిని అందచేయనున్నారు.
క్రిమిసంహారక మందుతో తెరల తయారీ
క్రిమీ సంహారక మందును వినియోగించి తయారుచేసిన ఈ దోమ తెరలు దోమలను సంహరిస్తాయి. నిదురపోయే సమయంలో సాధారణ దోమ తెరలు మాదిరిగానే వీటినీ ఉపయోగిస్తారు. వినియోగతీరును అనుసరించి ఈ దోమ తెరలు మూడేళ్ల నుంచి నాలుగేళ్ల వరకు పనిచేస్తాయని చెప్పారు.