మా పార్టీ వాళ్లను ఛీకొడుతున్నారు

– వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు
అసెంబ్లీలో జరిగిన ఘటన ప్రజాస్వామ్యానికి చీకటిరోజని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. చంద్రబాబు నాయుడు వయసుకు సైతం గౌరవం ఇవ్వకుండా, ఆయన కుటుంబసభ్యులను దూషించి, చంద్రబాబును కంటతడిపెట్టించిన తమ పార్టీ సభ్యుల ప్రవర్తనను తెలుగు ప్రజలు ఛీకొడుతున్నారని రాజు వ్యాఖ్యానించారు. గతంలో బాబుకు సంబంధించి ఈనాడులో వేసిన కార్టూన్‌ను వైఎస్ వ్యతిరేకించారని గుర్తు చేశారు. అలాంటి మంచి లక్షణాలు, హుందాతనమైన రాజకీయాలు ఆయన కొడుకు జగన్‌కు ఎందుకురాలేదో తనకు అర్ధం కావడం లేదన్నారు.
గతంలో వైఎస్-బాబు మధ్య రాజకీయ వైరం ఉన్నప్పటికీ, అది సభ వరకే పరిమితయ్యేదని, కానీ ఇప్పుడు మంత్రులు చేస్తున్న వెకిలి చేష్టల వల్ల తమ పార్టీ ప్రజల్లో నవ్వులపాలయ్యే ప్రమాదం ఏర్పడం, ఆ పార్టీ సభ్యుడిగా తనను కలచివేస్తోందన్నారు. తన తండ్రి వైఎస్ సమకాలికుడయిన చంద్రబాబు అనుభవానికి సైతం విలువ ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఈ ఘటనపై బీపీ పెరిగిన వాళ్లు ఏం చేస్తారోనన్న ఆందోళన నాకుంది. డీజీపీ సవాంగ్ అన్న కూడా జనాలకు బీపీ రావటం సహజమని చెప్పారు కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా చంద్రబాబు అంత సీనియర్ నాయకుడిని, రాజకీయాలతో సంబంధం లేని ఆయన కుటుంబసభ్యులను, ముఖ్యంగా మహిళలను తూలనాడటం తెలుగు మహిళలందరినీ అవమానించినట్లుగానే అందరూ భావిస్తున్నార’ని రాజు వ్యాఖ్యానించారు. తెలుగుజాతి ఆరాధించే ఎన్టీఆర్ కుమార్తెను తమ పార్టీ సభ్యులు వ్యక్తిత్వ హననం చేయడాన్ని తాను ఖండిస్తున్నానన్నారు.
తమ ముఖ్యమంత్రి పక్కన మంచి చెడ్డలు చెప్పేవారెవరూ లేకపోవడం విచారకరమని, ఉన్నవాళ్లంతా గతంలో ఆయనను, విజయలక్ష్మిని తిట్టినవాళ్లేనని అన్నారు.తనలాంటి మంచి చెప్పేవాళ్లను దబిడిదిబిడి చేశారన్నారు. ‘‘రాజకీయాలు హుందాగా ఉండాలి. తమకు వ్యతిరేకంగా ఉన్నవారిపై భౌతికదాడులు, వ్యక్తిత్వ హననం చేసే ‘అరాజకీయాని’్న మేధావులు, విద్యావంతులు, సంస్కారం ఉన్న ఎవరూ సమర్ధించరు. ఈరోజు జరిగిన ఘటనకు సంబంధించి మాత్రం ప్రజలు మా పార్టీపై ఉమ్మేస్తున్నార’’ని రాజు వ్యాఖ్యానించారు.