చంద్రబాబుకు ప్రజలు వేసిన మొదటి శిక్ష పదేళ్లు

-మరి ఈసారి పదిహేనేళ్లకు పైనేనేమో!
–అధికారం కోల్పోయిన ఐదేళ్లకే ఎన్టీఆర్‌కు 1994 డిసెంబర్‌లో అధికారం
–2004లో గద్దెదిగిన చంద్రబాబుకు పదేళ్ల విపక్ష నేత పాత్ర
–2019లో సీఎం కుర్చీ కోల్పోయిన టీడీపీ నేతకు ఇక పదిహేనేళ్లకు పైగా ప్రతిపక్ష పాత్ర అయినా దక్కేనా?
-వి. విజయసాయిరెడ్డి

తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారిని ‘శకపురుషుడు’ అంటూ నారా చంద్రబాబు నాయుడు గారి టీడీపీ ఇప్పుడు నివాళులర్పిస్తోంది. ఎన్టీఆర్‌ శత జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను స్మరించుకోవాలంటూ పార్టీ శ్రేణులకు తెలుగుదేశం పిలుపు ఇవ్వడం తెలుగు ప్రజానీకానికి వింతగా కనిపిస్తోంది.

మూడో అల్లుడు, ‘నమ్మకస్తుడు’ అయిన చంద్రబాబు తన మామగారిపైనే ‘తిరుగుబాటు’ పేరుతో విజయవంతంగా చేసిన కుట్రకు వచ్చే ఆగస్ట్‌ నెలలో 27 ఏళ్లు నిండుతున్నాయి. ఆర్థిక, రెవెన్యూ శాఖలు అడిగి మరీ తీసుకున్న చంద్రబాబు ఎన్టీఆర్‌కు రెండో ఆగస్టు సంక్షోభం సృష్టించారు. అనుకూల మీడియా సాయంతో ముఖ్యమంత్రి పదవిని ఆయన గుంజుకున్న విషయం ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మరిచిపోలేదు.

1995 సెప్టెంబర్‌ ఒకటిన హడావుడిగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు తన మామ మానసిక క్షోభకు, ఆరు నెలలలోపు 1996 జనవరి 18న ఆయన హఠాన్మరణానికి కారకులయ్యారు. ఎన్టీఆర్‌ మరణానంతరం జరిగిన మొదటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో (1999 సెప్టెంబర్‌) ఆయన పేరును నిసిగ్గుగా వాడుకున్నారు బాబు. ఆయన దుర్మార్గ పాలనను తెలుగు ప్రజలు నాలుగున్నరేళ్లకు పైగా భరించారు.

–దాదాపు 9 సంవత్సరాల చంద్రబాబు దౌర్భాగ్య ఏలుబడికి 2004 మే నెలలో తెలుగువారు వీడ్కోలు పలికారు. అంతటితో వారు ఆగలేదు. మళ్లీ 2009లోనూ చంద్రబాబు టీడీపీని ప్రతిపక్షంలోనే కొనసాగించడానికి నిర్ణయించారు. ఏడేళ్ల పాలన తర్వాత ఎన్టీ రామారావును ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉంచిన ప్రజానీకం ఆయన అల్లుడిని మాత్రం పదేళ్లు సీఎం పీఠానికి దూరంగా కూర్చోమని తీర్పు ఇచ్చారు.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ విభజన పుణ్యమా అని చంద్రబాబు జనాన్ని మభ్యపెట్టి మళ్ళీ మెజారిటీ సీట్లు సాధించారు. కాని, ఐదేళ్ల నీతిబాహ్య పాలన చూశాక ఆయనకు జీవితకాలం గుర్తుండిపోయే శిక్ష వేశారు ప్రజలు. కేవలం ప్రతిపక్ష నేత హోదా పొందడానికి అవసరమైన 23 సీట్లనే టీడీపీకి ఇచ్చారు. మరి ఇక ఎన్నేళ్లు చంద్రబాబు విపక్ష నేత హోదాలో ఉంటారు? అంటే ఈసారి ఆయన పదిహేనేళ్లకయినా మళ్లీ ఏపీ ముఖ్యమంత్రి కాగలరా? అనే ప్రశ్నే జవాబుగా ఎదురవుతుంది. మహానుభావుడు ఎన్‌.టి. రామారావు గారు స్థాపించిన పార్టీని 2034 ఏపీ అసెంబ్లీ ఎన్నికలనాటి వరకూ చంద్రబాబు సజావుగా నడపగలరా? అనే అనుమానం ప్రజలకే కాదు తెలుగదేశం కార్యకర్తల్లో సైతం వచ్చే రోజులు ముందున్నాయి.