– బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్
తిరుపతి : శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను ఉపదేశించి 5,125 సంవత్సరాలు అవుతోంది. కోట్లాది మంది హిందువులు తమ జీవన శైలిలో భగవద్గీత అంతర్భాగం. జీవనశైలి, సమస్యల నుంచి విముక్తి, ధర్మాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయాలకు భగవద్గీత బోధిస్తుందని బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. పాలకమండలి సభ్యుడు ఎంఎస్ రాజు వ్యాఖ్యలను భాను ప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండిస్తూ మాట్లాడారు.
ధర్మకర్తల మండలి సభ్యులు ఎం.ఎస్. రాజు భగవద్గీతపై చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని, హిందువులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. భగవద్గీత, రామాయణం, మహాభారతం హైందవ సంప్రదాయంలో పవిత్ర గ్రంథాలు… సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్ళే సమయంలో కూడా భగవద్గీతని, గణేష్ ప్రతిమని తీసుకొని వెళ్లారని మనకు తెలుసు. పీఎం కూడా విదేశాలకు వెళ్లినప్పుడు విదేశీ అధ్యక్షులకు ఈ పవిత్రమైన భగవద్గీతని అందించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి భగవద్గీత పట్ల ఇంత అవహేళనగా మాట్లాడడం మంచిది కాదని ఆయన హితవు పలికారు.