*మంత్రి నారాయణ దృష్టి పెడితే మునిసిపల్ రోడ్లే ఆదాయ వనరులు
*ప్రభుత్వానికి ఏటా వందల కోట్ల ఆదాయం
*మున్సిపాలిటీలకు తీరనున్న నిధుల కొరత
*పట్టణ ప్రాంత సమస్యల పరిష్కారానికీ శాశ్వత పరిష్కార మార్గం
*వాయు కాలుష్యాన్నీ నియంత్రించే వీలు
ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ శాఖ మంత్రి పి. నారాయణ దృష్టి ఇప్పుడు అమరావతి నిర్మాణం పై కేంద్రకృతమై ఉంది. నిద్ర లేచింది మొదలు…. పడుకునే వరకు,ఆయన… గాలికి బదులు,అమరావతి అనే ఆలోచనల్నే పీల్చి…. వదులుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిమతానికి అనుగుణం గా ….అసెంబ్లీ కి తీశారు.
రానున్న ఎన్నికల లోపు , అమరావతి నగర రూపురేఖలను రూపం ఇవ్వడానికి ఆయన అహరహం శ్రమిస్తున్నారు . కూటమి ప్రతిష్ట ….అమరావతి ఏ మేరకు రూపుదిద్దుకుంటుంది అనే అంశం పై కూడా ఆధార పడి ఉండడంతో, మంత్రి నారాయణ ఉరుకులు పరుగులు పెడుతున్నారు .
అయితే, రాష్ట్రం లోని మునిసిపల్ రోడ్ల నుంచి ‘సంపద సృష్టి’ కి గల అవకాశాలపై ఆయన దృష్టి పెడితే; రాష్ట్ర వ్యాప్తం గా ఉన్న పట్టణ జనావాసాలకు పెద్ద మేలు చేసినవారు అవుతారు . రోడ్లు డ్రెయిన్ల మరమ్మతులు, అవసరమైన ఇతర పౌర సదుపాయాల కల్పనకు అవసరమైన నిధుల కోసం ఆయా స్థానిక పాలనా యంత్రాంగాలు ప్రభుత్వం వైపు దీనం గా ఎదురు చూడాల్సిన స్థితి పెద్దగా ఉండదు.
రాష్ట్రం లోని పట్టణ ప్రాంతాలలోని జనావాసాల మధ్య ఉండే రోడ్ల నుంచి సంపద సృష్టించే కార్యాచరణపై దృష్టి పెడితే ; పట్టణ (నగర ) వాయు కాలుష్య నియంత్రణ కూడా సాధ్యం అవుతుంది . అందుకే , నగర పంచాయత్ , మునిసిపల్ పట్టణ , మునిసిపల్ నగరాల్లోని జనావాసాల మధ్య ఉండే రోడ్లే ఆ శాఖకు ప్రధాన ఆదాయ వనరులు .
వినడానికి కొంచెం వింతగా ఉన్నప్పటికీ; అవి ప్రభుత్వ మునిసిపల్ శాఖకు ఏటా సిరులు కురిపించే అక్షయ పాత్రలే. ఎటొచ్చీ పట్టణాభివృద్ధి శాఖ వాటిపై దృష్టి పెట్టాలి. ఏటా వందలాది కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతుంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో పదిహేడు మునిసిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి.
అనంతపురం, చిత్తూరు, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, బందరు, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖ, విజయనగరం, మంగళగిరి – తాడేపల్లి వంటి కార్పొరేషన్లు తో పాటు ; ఓ ఎనభయ్ మున్సిపాలిటీలు, ఓ ఇరవై తొమ్మిది నగర పంచాయతీలు…. అన్నీ కలిపి నూట ఇరవై ఆరు పట్టణ లోకల్ బాడీలు ఉన్నాయి.
ఈ జనావాసాల్లో మొత్తం పందొనిమిది వేల కిలోమీటర్ల పొడవైన రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్ల లో కనీసం 60 శాతం రోడ్లు… జనావాసాలు, కాలనీ ల్లోనే ఉన్నాయి. ఈ జనావాసాల్లో… ఇరుకు సందులు గొందుల్లో ఉన్న మునిసిపల్ రోడ్లే… ప్రభుత్వానికి ఏటా సిరులు కురిపించే కామధేనువులు.
గత పది, పదిహేనేళ్లుగా… జనానికి ఆదాయాలు పెరుగుతున్నాయి. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతున్నాయి. ఆదాయ మార్గం అనేది సక్రమమా… అక్రమమా అనేది ఎవరూ చూస్తున్నట్టు లేదు. దానితో, జీవన ప్రమాణాలు కూడా పెరుగుతున్నాయి. వాటితో పాటు, ఆధునిక జీవన రీతులు, నలుగురిలో గొప్పగా ఉండాలనే ” ఫాల్స్ ప్రెస్టీజ్ ” భావనలు కూడా సమాజం లో విపరీతంగా పెరిగిపోతున్నాయి.
ఈ భావనలకు అద్దం పట్టేది – కారు.
దిగువ, ఎగువ మధ్య తరగతి అనే భేదం లేకుండా…. ఒక కారు ఉండడం అనేది – ఒక స్టేటస్ సింబల్ గా మారిపోయింది.తోటి వాడు తొడ కోసుకుంటుంటే…. మనం పీక కోసుకోవాలనే మానసిక దౌర్భల్యానికి… మునిసిపల్ రోడ్లు బలి అయిపోతున్నాయి.
చేయడానికి పని, తినడానికి తిండి లేకపోయినా సరే… ఇంటి ముందు కారు ఉండాలి అనే మానసిక వైపరీత్యాలు….మధ్య తరగతి మనస్తత్వాలను కుదిపేస్తున్నాయి.
దీనికి తోడు…. జనం వెంట బడుతున్న కార్ల కంపెనీలు. ” ఇలా రండి. అలా కొత్త కారు తో వెళ్ళండి….. ” అంటూ ప్రకటనలు.
ఫలితం గా – అవసరం లేకపోయినా, స్థోమతు లేకపోయినా… పార్కింగ్ వెసులుబాటు లేకపోయినా….ఫాల్స్ స్టేటస్ కోసం అన్నట్టుగా, కారు కొనేసి; ఇంటి ముందు ఉన్న రోడ్ పై రాత్రింబవళ్ళు పార్క్ చేసేస్తున్నారు.
నగర పంచాయతీలా… మునిసిపల్ పట్టణాలా… మునిసిపల్ కార్పొరేషన్లా అనే తేడా లేకుండా… అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోయిన వీధులలో… మునిసిపల్ శాఖ మంత్రి ఒకసారి రాత్రిళ్ళు పర్యటిస్తే…. మునిసిపల్ రోడ్లు ఎంతగా ఆక్రమణలకు గురి అవుతున్నాయో తెలుస్తుంది.
ఆయా వీధుల్లో రాత్రిళ్ళు, లేదా సెలవు దినాల్లో పగళ్లు…. కార్ల పార్కింగ్ తో నిండిపోతున్నాయి. వాటి యజమానులేమో అపార్ట్మెంటుల్లో… ఎక్కడో పై అంతస్థులలో నివసిస్తుంటారు. దీనితో ; ప్రభుత్వ ఆస్తి అయిన మునిసిపల్ రోడ్లు…. వారి ప్రైవేట్ ఆస్థి అయిపోతున్నది. జనావాసాల్లో అసలే సన్నని, ఇరుకు రోడ్లు. పైపెచ్చు… కార్ల కబ్జా.
ప్రభుత్వం. పబ్లిక్ రోడ్ల మీద కార్ల పార్కింగ్ కల్చర్ ను అదుపు చేయాల్సిన అవసరం ఉంది.
ఇంటి ముందు రోడ్ పై రాత్రిళ్ళు పార్క్ చేసే ప్రతి కారుకు….. నెల వారీ పార్కింగ్ ఫీ విధించాలి.
నగర ప్రాంతం పరిధిలో వెయ్యి రూపాయలు, పట్టణ ప్రాంతం పరిధి లో ఎనిమిది వందలు, నగర పంచాయతీ పరిధిలో ఐదు వందలు వంతున ఈ పార్కింగ్ ఫీ విధించడం ద్వారా…. ” పార్కింగ్ లేకపోతే ఇబ్బంది అనే స్పృహ ” ను కాబోయే కారు వినియోగదారుల్లో కలిగించవచ్చు.
బస్సులు, లారీలు, ట్రాక్టర్లు, ఆటోలు కాకుండా… దాదాపు ఎనిమిది లక్షల కార్లు ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిరుగుతున్నట్టు ఒక అంచనా.
కాంపౌండ్ గోడలు కలిగిన స్వంత…ప్రైవేట్ గృహాలు, గేటెడ్ కమ్యూనిటీలు మినహాయిస్తే; అపార్ట్మెంట్ లలో ఉండేవారిలో అధిక సంఖ్యాకుల ప్రవేట్ కార్లు… వాటి ముందు ఉన్న రోడ్ మీదే పార్క్ చేసి ఉంచుతున్నారు.
ఈ జనావాసాల్లో…. ప్రధాన వీధుల్లో కాకుండా ఈ చిన్న చిన్న సైడ్ రోడ్ల పై ప్రయాణించే వాహన దారులు తీవ్ర ఇబ్బందులను రుచి చూస్తున్నారు.
ఏటా… కార్ల సంఖ్య పెరుగుతుంది, అపార్ట్మెంట్ ల సంఖ్య పెరుగుతుంది కానీ ; రోడ్ల విస్తీర్ణం పెరగదు కదా!
అందుకే, ఈ రోడ్లను తమ ప్రైవేట్ ఆస్థి గా భావించుకునే వారిపై ” పార్కింగ్ ఫీ ” విధించాలి.
దీని వల్ల అనేక ప్రయోజనాలు సమకూరుతాయి. ముందు, జనావాసాల్లో వాయు కాలుష్యాన్ని ఎంతో కొంత నియంత్రించవచ్చు. ప్రధాన రహదారుల్లో వందకు పైబడిన కిలోమీటర్ల వేగం తో పరుగులు తీసే కార్లు, వీధుల్లో కి తిరగగానే, పది…. ఇరవై కిలోమీటర్ల వేగం లోకి దిగిపోతాయి. పార్క్ చేయడానికి కూడా ఐదు, పదినిముషాలు పడుతుంది. ఆ సమయం అంతా కార్ల ఇంజిన్ లు పనిచేస్తూనే ఉంటాయి కదా! అందువల్ల,ఇంధనం మాత్రం మామూలు గానే బర్న్ అవుతుంది.
దానితో,, వాయు కాలుష్యం మాత్రం మామూలు గానే విడుదల అవుతుంటుంది. వీధుల్లో రాత్రిళ్ళు పార్క్ చేసి ఉంచే కార్ల పై పన్ను విధించడం ద్వారా…. పార్కింగ్ సదుపాయం లేని వారు, కొత్తగా కారు కొనడానికి కొంచెం ఆలోచిస్తారు. ఆ మేరకు వీధుల్లో ఈ కార్ల మూలక వాయు కాలుష్యం పై కొంత నియంత్రణ ఉంటుంది.
అలా, వీధుల్లో పార్క్ చేసే కార్లపై నెలవారీ ఫీ విధించడం వల్ల ; “వన్ షాట్…టెన్ బర్డ్స్ ” అన్నట్టుగా ప్రభుత్వానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి..
‘పన్ను’ అనగానే, తమ ముక్కు పిండి మరీ ప్రభుత్వం వసూలు చేస్తుందనే భావం వినియోగదారులలో సహజం గా ఉంటుంది. కానీ, ఈ వీధులలో పార్కింగ్ చేసే కార్లపై నెలవారీ ఫీని, వినియోగదారులు చెల్లించడానికి ఇబ్బంది పడరు. ఐదు నుంచి పది లక్షలు బెట్టి కార్ కొనుక్కున్నవారు, నెలకు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల పార్కింగ్ ఫీ చెల్లించడానికి ఇబ్బంది ఎందుకు పడతారు?
*కార్ల కొనుగోలు దారుల్లో ‘పార్కింగ్ స్పృహ ‘ కూడా బాగా పెరుగుతుంది
*మునిసిపల్ శాఖకు నెల నెలా వందల కోట్ల ఆదాయం లభిస్తుంది
*మునిసిపల్ జనావాసాల్లో రోడ్లు, డ్రైన్లు వంటి వసతుల ఆధునీకరణకు, ఇతర మౌలిక సదుపాయాల ( ఇన్ఫ్రాస్ట్రక్చర్ ) ఏర్పాటుకు నిధుల కొరత ఉండదు
*వందల సంఖ్యలో ప్రత్యక్ష, వేల సంఖ్యలో పరోక్ష ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. *అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటూ ఒకటి ఏర్పాటు చేస్తే ; ఈ మొత్తం పార్కింగ్ ఫీ వసూలు, దానిని మునిసిపల్ పాలక సంస్థలకు దామాషా పధ్ధతి లో కేటాయించి, ప్రజలకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఏర్పాటు చేయడం మొదలైన కార్యకలాపాలన్నీ సజావుగా జరగడానికి అవకాశం ఉంది.
ఈ విధానం లో, ప్రభుత్వం పై భారం తగ్గుతుంది.
పౌర వసతుల కోసం వెచ్చించే, ప్రతి రూపాయి లో కనీసం మూడో వంతు అయినా ప్రజల వినియోగం లోకి వస్తుంది. ప్రత్యేకంగా ప్రభుత్వ నిధుల కేటాయింపు లేకుండానే, సాధారణ పట్టణ వాసుల జీవన శైలి మరింతగా మెరుగు పడుతుంది.మునిసిప ల్ శాఖ మంత్రి నారాయణకు కృతజ్ఞతలు చెప్పుకుంటారు, వసతులు మెరుగైనందుకు.
– భోగాది వేంకటరాయుడు
(జర్నలిజం లో రాష్ట్ర ప్రభుత్వ కళారత్న అవార్డు గ్రహీత )