హైదరాబాద్: తమ సామాజిక వర్గం పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా వచ్చే నెల (మే మాసంలో) హైదరాబాద్ పరేడ్ మైదానంలో గర్జన పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నామని మున్నూరు కాపు ప్రముఖులు తెలిపారు.
ప్రభుత్వం నిర్వహించిన కుల గణన సందర్భంగా మున్నూరుకాపుల జనాభాను తక్కువ చేసి చూపించడాన్ని నిరసిస్తున్నామని మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య, అపెక్స్ కౌన్సిల్ కన్వీనర్ సర్థార్ పుటం పురుషోత్తమ రావులు తెలిపారు.హైదరాబాద్ (సోమాజిగూడ) ప్రెస్ క్లబ్ బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన విధంగా మున్నూరకాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయకుండా, సొసైటీ ప్రకటించి,కేవలం 50 లక్షలు మాత్రమే బడ్జెట్ లో పెట్టడం ఛైర్మన్ నియమాకం జరుపకపోవడం శోచనీయమన్నారు.
ప్రెస్ మీట్ కు ముందు జరిగిన మున్నూరుకాపు ప్రముఖుల సమావేశంలో జల వనరుల అభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ వీ.ప్రకాష్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యులు సీ.విఠల్,మీసాల చంద్రయ్య,మణికొండ వెంకటేశ్వర్లు,చందూ జనార్థన్, మంగళారపు లక్ష్మణ్,చల్లా హరిశంకర్, ఎడ్ల రవికుమార్, బండి సంజీవ్, కొత్త లక్ష్మణ్,ఆవుల రామారావు, వనమాల ప్రవీణ్ తదితరులు మాట్లాడారు.
రాష్ట్ర మంత్రి వర్గంలో మున్నూరుకాపులకు ప్రాతినిథ్యం కల్పించకపోవడాన్ని వారు తీవ్రంగా నిరసించారు. కార్పొరేషన్ ఛైర్మన్ల పదవుల నియమాకంలో జనాభా దామాషా ప్రకారం మున్నూరుకాపులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని వారు తప్పుబట్టారు. కోకాపేటలో ఆత్మ గౌరవ భవన నిర్మాణానికి నిధుల కేటాయింపులో నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు.
కాచిగూడ మున్నూరుకాపు (కాపు)విద్యార్ధి వసతి గృహాన్ని దేవాదాయ,ధర్మా దాయ శాఖ పరిధి నుంచి వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ సామాజిక వర్గం ఆత్మ గౌరవం దెబ్బతినేలా ప్రభుత్వం వ్యవహరిస్తుండడాన్ని నిరసిస్తూ వచ్చే నెలలో 10లక్షల మందితో మున్నూరుకాపు “గర్జన”ను “పరేడ్ గ్రౌండ్” లో నిర్వహించాలని నిర్ణయించామని వారు తెలిపారు.దీనిని విజయవంతం చేయడంలో భాగంగా ఈనెల (ఏప్రిల్)13 వ తేదీన నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ సన్నాహాక సమావేశం జరుపుతున్నట్లు కార్యాచరణ కమిటీ నిర్ణయించింది.
ఈ సమావేశంలో రాజకీయాలకు అతీతంగా తమ సామాజిక వర్గానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు,మాజీ ఏమ్మేల్సీలు,జిల్లా పరిషత్ మాజీ చైర్మన్స్, మాజీ మేయర్స్, మాజీ మునిసిపల్ చైర్మన్స్, కార్పొరేషన్ ఛైర్మెన్స్,మాజీ ఛైర్మన్స్,మార్కెట్ కమిటీ ఛైర్మెన్స్, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు,వివిధ పార్టీల ప్రముఖులు, మున్నూరుకాపు సంఘాల జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గం సమన్వయ కర్తలు, ముఖ్య నాయకులు పాల్గొంటారని కొండా దేవయ్య, సర్థార్ పుటం పురుషోత్తమ రావులు తెలిపారు.అలాగే,ఈ సమావేశాలలో సంఘం ప్రముఖులు ఆకుల వెంకట్ రావు,బండి పద్మక్క, నాయికోటి రాజు పటేల్,సుంకరి నరహరి,సామల వేణు,కాసారం రమేష్, మామిడి అశోక్
తదితరులు పాల్గొన్నారు.