Suryaa.co.in

Andhra Pradesh

గంజాయి మత్తుతో నా కొడుకు పిచ్చోడయ్యాడు

  • విజయవాడకు చెందిన ఓ మహిళ ఆవేదన
  • గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపైనే అధికంగా ఫిర్యాదులు
  • ప్రతి ఫిర్యాదుపై తక్షణం స్పందిస్తున్న జనసేన ప్రజా ప్రతినిధులు
  • మంగళవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల వేదికకు వినతుల వెల్లువ

గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో గంజాయి సరఫరా ఎంత దారుణంగా జరిగిందో, దాని బారిన పడి తన కొడుకు ఎంత పాడయ్యాడో ఓ తల్లి ఆవేదన చెందారు. టీడీపీకి అనుకూలంగా ఉన్నామని గత ప్రభుత్వంలో ఎంత అన్యాయంగా ఉద్యోగాలు తొలగించారో మరో వ్యక్తి తన గోడు చెప్పుకొంటూ బోరుమన్నారు. ఒకటి కాదు రెండు కాదు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలు, అన్యాయాలు అర్జీదారులు చెబుతుంటే వాటికి ఎలాంటి పరిష్కారం చూపాలన్న మథనం కూడా జనసేన పార్టీ ప్రజా ఫిర్యాదుల వేదికలో జరుగుతోంది.

జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల వేదికకు రాష్ట్రంలోని నలు వైపుల నుంచి ఫిర్యాదులు వేలాదిగా వస్తున్నాయి. జనసేన పార్టీ ప్రజా ప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. వారి సమస్యలను వింటూ వెంటనే పరిష్కారం చూపేలా అధికారులతో మాట్లాడుతున్నారు. మంగళవారం ప్రజా ఫిర్యాదులను పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తీసుకున్నారు. ఫిర్యాదులు వెంటనే పరిష్కారం అయ్యేలా చొరవ చూపారు.

నా కొడుకును ఆస్పత్రిలో చేర్చండి

విజయవాడకు చెందిన  వై.జయలక్ష్మి – తన ఒక్కగానొక్క కొడుకు గత ఐదేళ్లుగా విచ్చలవిడిగా దొరికిన గంజాయికి అలవాటుపడిపోయాడని గోడు వెళ్లబోసుకున్నారు. చనిపోతానని బెదిరిస్తున్నాడని కన్నీటి పర్యంతమైంది. పురుగుల మందు తాగాడని, బ్లేడుతో చేతులు కోసుకున్నాడని, ప్రతి రోజూ ఏదో ఒక గొడవ తీసుకువస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు చెప్పినా మారడం లేదని, గంజాయి కోసం దొంగతనాలకు అలవాటుపడ్డాడని, పిచ్చివాడిగా మారిపోయాడని తెలిపారు. తన కొడుకును నయం చేయడానికి విశాఖ మానసిక వైద్యశాలకు పంపాలంటూ భోరున విలపించారు.

కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలం, చాగంటిపాడు గ్రామంలో రైల్వే గేటు విషయంలో ఇబ్బందులు ఉన్నాయని గ్రామస్తులు విన్నవించారు. గేటు పెట్టే సమయంలో పంచాయతీ సిబ్బంది ప్రజాభిప్రాయాన్ని వక్రీకరించి పంపారని, దీనివల్ల గేటు విషయంలో ఇబ్బందులు కలుగుతున్నాయని, సమస్య పరిష్కరించాలని కోరారు.

పర్చూరు నియోజకవర్గంలో గతంలో రక్షిత మంచినీటి సరఫరా శాఖలో వాటర్ టెస్టింగ్ విభాగంలో కెమిస్ట్ గా పని చేసిన నార్ని చంద్రశేఖర్ అనే వ్యక్తి గత ప్రభుత్వం తనను అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించిందని, న్యాయం చేయాలని కోరారు. టీడీపీకి అనుకూలంగా ఉన్నానని ఆరోపిస్తూ నన్ను ఉద్యోగం నుంచి తొలగించారని, తనకు తిరిగి ఉద్యోగం ఇప్పించాలని కోరారు.

కర్నూలు జిల్లా జోహరాపురం గ్రామంలో 500 మంది బీడీ కార్మికులకు గతంలో తాహసీల్దారు స్థలాలు ఇచ్చారని, అయితే ఈ స్థలాలు తమవంటూ ఓ మహిళ వాటిని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని బీడీ కార్మికులు ఫిర్యాదు చేస్తున్నారు. ఆ స్థలం పక్కనే ఉన్న స్థలం తనదని, ఈ స్థలాల మీద కూడా తనకు హక్కు ఉందని చెబుతూ కార్మికులను అటువైపు వెళ్లకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన పట్టాలు తప్పు అంటూ దొంగ పట్టాలు సృష్టించారని ఆరోపించారు. తమకు తగిన న్యాయం చేయాలని కోరారు.

LEAVE A RESPONSE