– సెంట్రల్ జిఎస్టీ కమిషనర్ సుజిత్ మల్లిక్
గుంటూరు: కస్టమ్స్, సెంట్రల్ ఎక్సజ్, జిఎస్టీ శాఖలోని ఐ.ఆర్.ఎస్ అధికారి ఎం. నాగరాజు అందించిన సేవలు డిపార్ట్మెంట్ లో చిరస్థాయిగా నిలిచిపోతాయని సెంట్రల్ జి. ఎస్. టి కమిషనర్ సుజిత్ మల్లిక్ పేర్కొన్నారు.
శుక్రవారం పలకలూరు రోడ్ లోని గుంటూరు క్లబ్ లో జరిగిన జిఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ ఎం. నాగరాజు ఉద్యోగ విరమణ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దీనికి రిటైర్డ్ జిఎస్టీ చీఫ్ కమిషనర్ సి. పి. రావు అధ్యక్షత వహించారు.
కమిషనర్ సుజిత్ మల్లిక్ మాట్లాడుతూ.. నాగరాజు శాఖ పరంగా ఎన్నో ప్రభుత్వ అవార్డులు, రివార్డులు పొంది శాఖకు గర్వకారణంగా నిలిచారన్నారు. ఉద్యోగ సంఘ నేతగా ఉద్యోగుల సంక్షేమానికి మెరుగైన సేవలు అందించారని కొనియాడారు. ఉద్యోగ విరమణ కాలం విశ్రాంతికే కాకుండా, శాఖ అభివృద్ధికి తగు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు.
రిటైర్డ్ చీఫ్ కమిషనర్ సి. పి. రావు మాట్లాడుతూ.. విధి నిర్వహణలో దక్షత, సమర్ధత, విశ్వాసనీయత కలిగిన అధికారి నాగరాజు అని ప్రశంసించారు. ఆయన ఉద్యోగ అనుభవాన్ని ఇతరులకు పంచాలని విజ్ఞప్తి చేసారు. జిఎస్టీ అడిషనల్ కమిషనర్ బి. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. నాగరాజు సేవలు సాటిలేనివన్నారు. ఆయన పనితీరు ఉద్యోగులందరికీ మార్గదర్శకమన్నారు.
జిఎస్టీ జాయింట్ కమిషనర్ దేవ్ కుమార్ మాట్లాడుతూ.. అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు కృషి చేసి జిఎస్టీ శాఖలో సుస్థిరమైన స్థానాన్ని నాగరాజు పొందకలిగారన్నారు. ఉద్యోగ విరమణ చేస్తున్న ఎం. నాగరాజు మాట్లాడుతూ..విధుల పట్ల అంకితభావం, బాధ్యయుతంగా పనిచేస్తే, ఏ ఉద్యోగికైనా గుర్తింపు లభిస్తుందన్నారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నాగరాజును పెద్ద ఎత్తున అధికారులు, ఉద్యోగులు సత్కరించి, జ్ఞాపికలు బహుకరించారు.
కార్యక్రమంలో మాజీ ఎం. ఎల్. సి పందుల రవీంద్ర బాబు, గజిటెడ్ అధికారుల సంఘ నాయకులు గాదె శ్రీనివాస రెడ్డి, కె. యుగంధర్ కుమార్, బి. నవీన్ రాజు, సూర్యదేవర రమేష్ బాబు మినిస్టీరియల్ సంఘ నేతలు శాఖమూరి శ్రీనివాస్, బిల్లా ప్రశాంత్ కుమార్ పెన్షనర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు టి. వివేకానంద, గద్దె తిలక్, పి.వి.సత్యనారాయణ, పి.ఎన్.వి. ప్రసాద్, గుమ్మడి సీతారామయ్యచౌదరి, ఎన్. ఎస్. నగేష్ బాబు, కె. సాంబ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు.