– మంత్రి కందుల దుర్గేష్
విశాఖ: త్వరలోనే నంది అవార్డులను ప్రకటిస్తామని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. చాలా కాలంగా మూలన పడిన నంది అవార్డులను పునరుద్ధరిస్తామని తెలిపారు. త్వరలోనే నంది అవార్డులను ప్రకటిస్తామని కూడా అన్నారు. సినిమా పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ప్రొడ్యూషర్లు, దర్శకులు, నటీనటులతో సమావేశం నిర్వహిస్తామన్నారు.
తెలుగు సినిమా పరిశ్రమను నూటికి నూరు శాతం అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. భైరవం సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ ఏపీలో అద్భుతమైన అందాలు ఉన్నాయని, అక్కడ సినిమా షూటింగులు కూడా జరుగుతున్నాయని అన్నారు.
స్టూడియోల నిర్మాణం, డబ్బింగ్, రీరికార్డింగ్ థియేటర్లు నిర్మించడానికి అవసరమైన మద్దతు ఇవ్వడానికి పాలసీ తెచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు.
రాబోయే రోజుల్లో హైదరాబాద్ లాగానే విశాఖపట్నాన్ని కూడా అభివృద్ధి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి అవసరమైన ప్లాన్లు వేస్తామని అన్నారు.