- రైతులకు సాగు ఖర్చు తగ్గించి ఆదాయం పెంచాలి
- భూసార పరీక్షలను గత ప్రభుత్వం విస్మరించింది… మళ్లీ భూసార పరీక్షలు చేసి పోషకాలు అందించాలి
- పాడి, ఆక్వా రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలి
- వ్యవసాయం రంగం సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి : రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలి. గతంలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం అందించాం. 20 లక్షల హెక్టార్లకు ప్రకృతి వ్యవసాయ సాగును పెంచాలి. ఆహారపు అలవాట్లలో మార్పులు వచ్చాయి. హై ప్రొటీన్స్ కు జనం అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో ఎక్కువ డిమాండ్ ఉంటోంది.
గతంలో పామాయిల్, కోకో పంటలు తీసుకొచ్చాం. ఇప్పుడు హార్టి కల్చర్ లో అధిక ఉత్పత్తులు చూస్తున్నాం. మామిడి, అరటి, డ్రాగన్ క్లస్టర్లు ఏర్పాటవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా డ్రాగన్ ఫ్రూట్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కేంద్రం కూడా క్లస్టర్ విధానం తీసుకొస్తోంది. హార్టికల్చర్, అగ్రికల్చర్ విధానంలో మరిన్ని మార్పులు తీసుకురావాలి.
పాల డైరీలు వ్యవసాయ భూమి లేని వారికి ఆదాయం పెంచుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. నరేగా ద్వారా నిధులు కేటాయించి ఫామ్ నిర్మించుకోవడానికి ప్రోత్సాహం ఇవ్వాలి. సంక్షేమ కార్యక్రమాలతో పాటు అదనపు ఆదాయం రావడానికి ఇలాంటి ప్రోత్సాహకాలు అందించాలి.
2014-19 మధ్య రైతులకు ఉచితంగా భూసార పరీక్షలు నిర్వహించి ఉచితంగా పోషకాలు అందించాం. కానీ గత ప్రభుత్వం అన్నింటినీ మరుగున పడేసింది. చేపలకు ప్రపంచంలో ఎక్కువ డిమాండ్ ఉంది. ప్రతి ఒక్కరూ చేపలను ఆహారంలో తీసుకుంటున్నారు… మరింత ప్రమోట్ చేయాలి.
కింది స్థాయిలో చెరువులు అప్పగించి చేపల ఉత్పత్తిని పెంచడంతో పాటు ఆదాయాన్ని పెంపొందించడానికి అవకాశం ఉంది. ప్రజల ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించాలి. ఇన్ పుట్, బీమా, మార్కెట్ లింకింగ్ కల్పించాలి.
అడవులు అంటే పవన్ కళ్యాణ్ కు చాలా ఇష్టం. అడవుల విస్తీర్ణం పెంచాలి. కొండ ప్రాంతాల్లో స్ట్రెంచస్, చెక్ డ్యాములు నిర్మించాం. ఇలాంటి జాగ్రత్తలు లేకపోవడం వల్లే కేరళలో విపత్తు సంభవించింది.స్ట్రెంచస్, డెక్ డ్యాములు ఏర్పాటు చేస్తే పైనుండి వచ్చే నీటిని కంట్రోల్ చేయొచ్చు.
హెలికాప్టర్ల ద్వారా వితనాలు చల్లి మొక్కలు పెంచాం. వనభోజనాలు కూడా ప్రోత్సహించాలి. పారెస్ట్ డిపార్ట్ మెంట్ లో మంచి అధికారులు ఉన్నారు…అడవులు పెంపకంపై దృష్టి పెట్టాలి. వనమహోత్సవం నిర్వహించి మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించాం…మళ్లీ అలాంటి కార్యక్రమాలు రావాల్సి ఉంది. వ్యవసాయంలో డ్రోన్ ఎంత మేర ఉపయోగించారో చూడాలి. వ్యవసాయంలో డ్రోన్ విధానం తీసుకొస్తే ఉపాధి అవకాశాలు కూడా తీసుకురావొచ్చు. సాగుకు అయ్యే ఖర్చును తగ్గిస్తే రైతులకు నష్టాలు నివారించగలుగుతాం. అన్ని శాఖలు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి.