– తెలంగాణలో అనుముల రాజ్యాంగం
– రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి
హైదరాబాద్: చెప్పేవి నీతి సూక్తులు.. చేసేటివి ఛండాలపు పనులు అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ పార్టీ పనితీరు. ఓ వైపు రాహుల్ గాంధీ.. ఓట్ చోరీ అంటూ దేశమంతా తిరుగుతున్నారు. ఎలక్షన్ కమిషన్ ఒక పార్టీ తొత్తుగా మారిందని మాట్లాడుతున్నారు. కానీ తెలంగాణలో మాత్రం, కాంగ్రెస్ పార్టీ నాయకులే ఎన్నికల నిబంధనలను దర్జాగా ఉల్లంఘిస్తున్నారు.
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నాయకుడు, టికెట్ రేసులో ఉన్న నవీన్ యాదవ్.. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఓటరు కార్డులు పంపిణీ చేయడం, కాంగ్రెస్ పార్టీ ద్వంద్వనీతికి చట్టాలపై వారికి ఉన్న గౌరవానికి నిదర్శనం. ఎలక్షన్ కమిషన్ ఇవ్వాల్సిన ఓటరుకార్డులను అధికార పార్టీ పంపిణీ చేస్తోందంటే.. బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కనపెట్టి, తెలంగాణలో అనుముల రాజ్యాంగం ఏ స్థాయిలో అమలు చేస్తున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
ఎన్నికల కోడ్ మాత్రమే కాదు.. రాజ్యాంగాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఉల్లంఘిస్తోంది.
ఓ వైపు రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగం పుస్తకం పట్టుకుని నీతులు చెబుతారు. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ నాయకులు.. ఆ రాజ్యాంగాన్ని పాటించరు. వాళ్లకంటూకొత్తగా అనుముల రాజ్యాంగాన్ని రాసుకుని నడిపిస్తుంటారు. ఎలక్షన్ కమిషన్ నిజంగానే నిష్పక్షపాతంగా పనిచేస్తున్నట్టయితే.. వెంటనే నవీన్ యాదవ్ ఓటు హక్కు రద్దు చేయాలి.
జూబ్లీహిల్స్ ఓటరు జాబితా నుండి ఆయనను తొలగించాలి. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ ఎన్నికల్లో పోటీకి అతడిని అనర్హుడిగా ప్రకటించారు. లేకపోతే ముందు ముందు నిబంధనలకు విరుద్ధంగా ఇంకెన్ని పనులు చూస్తారో ఊహించలేము.