హైదరాబాద్: నగరంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఆధునీకరించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ) కొత్త చర్యలు చేపట్టింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇచ్చిన సూచనల మేరకు, అధికారులు నగరంలోని ట్రాన్స్ఫార్మర్ల అమరిక విధానంలో వినూత్న మార్పులు చేశారు.
ఇప్పటి వరకు, ఎక్కువగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు రహదారుల పక్కన నేలమట్టానికి సమీపంగా అమర్చబడి ఉండేవి. ఈ పద్ధతి వల్ల పాదచారులకు అసౌకర్యం కలగడంతో పాటు మరియు ట్రాన్స్ఫార్మర్ చుట్టుపక్కల చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాల వలన ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతున్నాయి. కొన్నిసార్లు షార్ట్ సర్క్యూట్లు, విద్యుత్ లీకేజీలు కూడా చోటుచేసుకుని ప్రమాదాలు సంభవించాయి.
ఈ సమస్యలను పరిష్కరించేందుకు, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ లో పోల్ మౌంటెడ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఒక కొత్త సాంకేతిక పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈ నూతన పద్ధతిలో, విద్యుత్ స్తంభానికి దాదాపు 10 అడుగుల ఎత్తులో ఇనుప స్ట్రక్చర్ ఏర్పాటు చేసి, దాని మీద ట్రాన్స్ఫార్మర్ను అమర్చుతారు. ఈ విధానం వల్ల ట్రాన్స్ఫార్మర్ నేలమట్టానికి దూరంగా ఉండి, పాదచారుల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగదు.
అదేవిధంగా, ట్రాన్స్ఫార్మర్ చుట్టూ చెత్త లేదా ఇతర వ్యర్థ పదార్థాలు చేరకుండా ఉండడం వలన భద్రతా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడతాయి. అంతేకాక, ఈ విధానం ట్రాన్స్ఫార్మర్ స్ట్రక్చర్ ఖర్చును కూడా తగ్గిస్తుంది, ఎందుకంటే పెద్ద స్థాయి కాంక్రీట్ ఫౌండేషన్ అవసరం ఉండదు.
అంబర్ పెట్ పోలీస్ లైన్ లో ఏర్పాటు చేసిన పోల్ మౌంటెడ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ నమూనా ను సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ, ఐఏఎస్ పరిశీలించి తగు సూచనలు చేసారు. నూతనంగా ఏర్పాటు చేసే ట్రాన్స్ ఫార్మర్ లకు ఈ పద్ధతినే వాడాలని సూచించారు.
ఈ పర్యటనలో డైరెక్టర్ డా. నరసింహులు, చీఫ్ ఇంజినీర్ మెట్రో ప్రభాకర్, సూపరింటెండింగ్ ఇంజినీర్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.