రేవంత్ ఆవిష్కరించిన కొత్త కోణం!

-మావోలు మళ్లీ వస్తారా?
– పోలీసులో కులం కోణం
( మార్తి సుబ్రహ్మణ్యం)
తెలంగాణ పొలిటికల్ ఫైర్ బ్రాండ్ రేవంత్‌రెడ్డి ఆవిష్కరించిన కొత్తకోణం రాజకీయ, సామాజికరంగాల్లో చర్చనీయాంశమవుతోంది. శిధిలావస్థకు చేరిన తెలంగాణ కాంగ్రెస్‌కు పునరుజ్జీవం తీసుకువచ్చేందుకు,


తెరాస సర్కారుపై చావో రేవోగా పోరాడుతున్న టీపీసీసీ దళపతి రేవంత్‌రెడ్డి.. తాజాగా ప్రస్తావించిన రెండు ప్రధాన అంశాలు సంచలనం రేపాయి. అందులో ఒకటి మళ్లీ మావోలు రావాలన్న ఆకాంక్ష అయితే, రెండోది పోలీసు శాఖలో కులం కోణం. ఈ రెండు అంశాల్లో ఒకటయిన ‘పోలీసులలో కులం కోణాన్ని’ ఆయన గతంలో రెండు మూడు సార్లు ప్రస్తావించినా.. హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో పేర్లతో సహా వివరాలను వెల్లడించి, అందరి చూపు అటు మళ్లించడంలో సఫలీకృతులయ్యారు.
తెలంగాణలో ఇప్పుడున్న అరాచక పరిస్థితి చూస్తుంటే తనతోపాటు, తెలంగాణ సమాజానికి ఏడుపు వస్తోందన్న రేవంత్.. దీనికి మావోయిస్టుల మౌనమే కారణమన్నట్లు చేసిన వ్యాఖ్య, తెలంగాణ రాజకీయ వేదికపై నిస్సందేహంగా కొత్త ఆవిష్కరణ. నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న సమైక్య రాష్ట్రంలో కూడా ఇప్పటి పరిస్థితి లేదని, కనీసం నక్సల్స్ ఉండి ఉంటే ప్రభుత్వాలు ఒళ్లు దగగర పెట్టుకుని, ఆ

భయంతోనయినా సక్రమంగా పరిపాలించేవన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. దాన్నిబట్టి మళ్లీ మావోలు రావాలన్న, ఆయన కవిహృదయం సులభంగానే అర్ధమవుతుంది. అయితే ఒక ప్రజాస్వామ్యవాదిగా, చట్టాలు చేసే చట్టసభ సభ్యుడిగా అలా కోరుకోవడం తప్పయినప్పటికీ, తప్పడం లేదని కూడా రేవంత్ వివరణ ఇచ్చారనుకోండి. అది వేరే విషయం. అంటే.. మావోలను ప్రస్తావించడం ద్వారా, కేసీఆర్ సర్కారు దూకుడుకు మావోలు మాత్రమే ముకుతాడు వేయగలరన్న విషయాన్ని, తన వ్యాఖ్యల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లగలిగారు. మావోలను మేల్కొలిపే ప్రయత్నం చేయగలిగారు.
ఎలాగూ రేవంత్ నక్సల్స్ గురించి ప్రస్తావించారు కాబట్టి.. కొన్నేళ్లు వెనక్కి వెళదాం. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ మినహా తెలంగాణ జిల్లాలన్నీ, నక్సల్స్ ప్రభావిత జిల్లాలే. నక్సల్స్ ప్రధాన టార్గెట్లు భూస్వాములు. వారిలో ఎక్కువమంది వెలమ, రెడ్డి వర్గానికి చెందివవారే. కొన్ని జిల్లాల్లో బ్రాహ్మణుల ఆధిపత్యమూ ఉండేది. ప్రజాప్రతినిధులు రాత్రి వేళ తమ నియోజకవర్గాలు వదిలి, హైదరాబాద్ వచ్చేవారు. మరీ అత్యవసరమయితే తప్ప, జిల్లా ప్రధాన కేంద్రాల్లో రాత్రిళ్లు ఉండేవారు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే, ముందుగా పోలీసులకు సమాచారమిచ్చి, భద్రత తీసుకునేవారు. ఆ అంశంలో విపక్ష పార్టీలకు కొంత వెసులుబాటు ఉండేది. ఆ రకంగా తెలంగాణ జిల్లాల్లోని ప్రజాప్రతినిధులంతా, ముఖ్యంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులంతా హైదరాబాద్‌లోనే జీవించేవారు. చివరకు హైదరాబాద్‌లో కూడా మధుసూదన్ యాదవ్ ఎన్‌కౌంటర్ జరిగింది. అది వేరే విషయం.
ఉస్మానియా యూనివర్శిటీలో అయితే పీపుల్స్‌వార్ అనుబంధ రాడికల్స్ ప్రభావం, వారికి పోటీగా ఏబీవీపీ యుద్ధవాతావరణం ఎక్కువగా ఉండేది. ఇక విరసం, ఏపీ మానవ హక్కుల సంఘం, పిడిఎస్‌యు కార్యకలాపాలు ఉండనే ఉన్నాయి. అప్పటి పీపుల్స్ వార్‌కు లీగల్ సెక్షన్ ఎక్కువ ఉండటంతో, అగ్రనేతలు అరెస్టయిన మరుక్షణమే వారంతా రంగంలోకి దిగేవారు. ఇప్పుడు అసలు కనిపించని హెబియస్‌కార్పస్ పిటిషన్లు, అప్పుడు వారానికి నాలుగైదు హైకోర్టుకు చేరేవి. అప్పట్లోనే పీపుల్స్‌వార్ అగ్రనేతలకు హైదరాబాద్, బెంగళూరు షెల్టర్‌జోన్లుగా ఉండేవి.
ప్రజాప్రతినిధుల కిడ్నాపులు, హత్యలు, ఎన్‌కౌంటర్లతో ఉద్రిక్తంగా ఉండే రోజుల్లో.. ఏ పార్టీ ప్రజాప్రతినిధి అయినా సరే, నక్సల్స్ ఆదేశాలు వినేవారు. వారికి ఆశ్రయంతోపాటు, అన్ని రకాల సాయం చేసేవారు. ప్రజలు కూడా సహకరించేవారు. వారిని తమ మనుషులుగా భావించి, షెల్టర్ ఇచ్చేవారు. ఇప్పుడంటే మావోలు అనారోగ్యం పాలయితే, వారే ఆసుపత్రులకు వెళ్లాలి. అప్పుడు డాక్టర్లే నక్సల్స్ వద్దకు వచ్చి చికిత్సలు చేసేవారు. ముఖ్యంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు ఉండేవి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వంటనే వారిపైనే ప్రభావం చూపేది. అలా కొన్ని వందల మంది ప్రజాప్రతినిధుల ఇళ్లు పేల్చివేయబడ్డాయి.
అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీలు ముఖ్యమంత్రుల వద్దకు వెళ్లి.. తమ దయనీయాన్ని మొరపెట్టుకునేవారు. దానితో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసిన అనివార్యతను, నక్సల్స్ తమ చర్యలతో కల్పించేవారు. మొత్తంగా నక్సలైట్లంటే ప్రభుత్వానికి ఒక స్పీడ్‌బ్రేకర్‌గా, ఒక హెచ్చరికగా ఉండేవాళ్లు. ఇదంతా మూడుపదుల నుంచి జర్నలిజంలో ఉండి, నాటి ఘటనలను దగ్గరగా పరిశీలించిన నాలాంటి వారికి, నాలుగయిదు పదుల నుంచి జర్నలిజంలో కొనసాగుతున్న సీనియర్లకు అనుభవమే. అప్పట్లో నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో ఎస్‌పి, ఏఎస్పీలుగా పనిచేసి… ఇప్పుడు డిఐజీ, ఐజి, ఏడీజీ, డీజీ స్థాయిలో ఉన్న వారికీ అనుభవమే.
వైఎస్ విపక్ష నేతగా ఉన్న సమయంలో.. పీపుల్స్‌వార్ అగ్రనేతలతో సంధి చేసుకున్న ఫలితమే, తెలంగాణలో కాంగ్రెస్‌కు ఎక్కువ స్థానాలు లభించాయన్నది అప్పట్లో వినిపించిన మాట. ఆ తర్వాత చర్చల పేరిట పీపుల్స్‌వార్ అగ్రనేతలను.. జనారణ్యంలోకి తీసుకువచ్చిన పోలీసు వ్యూహానికి, కొద్దికాలం తర్వాత పీపుల్స్‌వార్ భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. ఆ పార్టీ అగ్రనేతలు చర్చల తర్వాత ఒక్కొక్కరూ నేలకొరిగిపోయారు. కొత్త రిక్రూట్లుమెంట్లు నిలిచిపోయాయి. మధ్యలో లంపెన్‌గ్రూపులు పార్టీలో చేరి, సెటిల్‌మెంట్ బ్యాచ్‌గా మారాయి.
అలా ప్రారంభమయిన నక్సల్స్ పతనం, మొన్నటి ఆర్కే మృతితో దాదాపు సంపూర్ణమయినట్లే కనిపిస్తోంది. కొత్తగా ఎవరూ పార్టీలోకి చేరే పరిస్థితి లేదు. నిరుద్యోగ యువత పోటీపరీక్షలో బిజీగా ఉంది. పల్లెలోని యువత, పట్టణ-నగర బాట పట్టింది. ప్రభుత్వాలు కూడా పథకాల పేరుతో కూర్చోబెట్టి డబ్బులిస్తున్నాయి. ఫలితంగా పల్లెలో కూలీలకు వచ్చేవారే లేదు. ఒకప్పటి భూస్వామ్య పెత్తందారీతనం ఇప్పుడు ప్రత్యక్షంగా లేదు. కాలేజీ విద్యార్ధులు కూడా చాలామంది, ఫీజుల రీఇంబర్స్‌మెంట్ వల్ల పైచదువుల వైపు చూస్తున్నారు. మిగిలిన వారు కులరాజకీయాలు- పార్టీల్లో తిరిగేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అందువల్ల తిరుగుబాటు ఆలోచన విజయవంతంగా సమాధి అయింది. కాబట్టే నక్సలిజానికి ఇప్పుడు అవకాశం లేదు. కొత్త రిక్రూట్‌మెంట్లు నిలిచిపోవడానికి ప్రధాన కారణం అదే. ఇప్పుడు అసలు తెలంగాణ-ఆంధ్రాలో ఎంతమంది నక్సలైట్లు ఉన్నారని వేళ్లపై లెక్కబెట్టుకోవలసిన దుస్థితి. ఇదీ నాకు తెలిసి.. స్థూలంగా పీపుల్స్‌వార్ నుంచి మావోయిస్టులుగా మారిన నక్సలైట్ల పరిస్థితి.
బహుశా రేవంత్‌రెడ్డి లాంటి మేధావి, ఇవన్నీ తెలియక మాట్లాడి ఉండవచ్చనుకోలేం. ఎందుకంటే ఆయన కూడా నక్సల్స్ ప్రభావిత పాలమూరు వచ్చిన బిడ్డే కాబట్టి. పైగా బాలమేధావి. చిన్న వయసులోనే రాజకీయ వ్యూహాల్లో పండిపోయిన ముదురు నాయకుడు. అయితే.. ఆయన ఇప్పటి రాజకీయ దిగ్బంధ పరిస్థితిలో వ్యూహాత్మకంగానే నక్సల్స్ పేరు ప్రస్తావించినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వంపై రాజకీయ పార్టీలుగా తమ ప్రతిఘటన సరిపోవడం లేదని.. కేసీఆర్ రాజకీయ వ్యూహాలు- పోలీసు దన్ను ముందు, రాజకీయ పార్టీల పోరాటం సరిపోవడం లేదన్న భావనతోనే, నక్సల్స్‌ను ఆకర్షించే ప్రయత్నం చేసి ఉండవచ్చని స్పష్టమవుతోంది. తమ రాజకీయ పోరాటానికి, నక్సల్స్ బెడద భయం తోడయితేనయినా.. కేసీఆర్ సర్కారు అదుపులో ఉంటుందన్న ముందస్తు అంచనా కూడా, రేవంత్ ప్రకటనలో లేకపోలేదు. కానీ.. ప్రస్తుత పరిస్థితిలో మావోలకు తమను తాము రక్షించుకోవడమే చేతకావడం లేదు. ఇక మరొకరిని రక్షించి, బలమైన సర్కారును భయపెట్టే పరిస్థితి వస్తే బాగుంటుందని కోరుకోవడం అత్యాశ.
ఇక తెలంగాణలో కేసీఆర్ కులానికి చెందిన పోలీసు అధికారులే పెత్తనం చేస్తున్నారంటూ రేవంత్ చేసిన ఆరోపణ, రెడ్డి కులానికి చెందిన అధికారులపై నిఘా పెడుతున్నారన్న ప్రస్తావన కూడా వ్యూహాత్మకంగానే కనిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా, ఎవరి నుంచీ ఇలాంటి ఆరోపణలు వినిపించలేదు. కాకపోతే తమ కులానికి చెందిన వారికి మంచి పోస్టింగులు ఇప్పించుకునే సంప్రదాయం ఉండేది త ప్ప, పోలీసు శాఖలో కులాలనేవి పెద్దగా కనిపించేవి కాదు. ఎక్కువ శాతం విధేయత-ప్రతిభ ఆధారంగానే పోస్టింగులుండేవి.
ఇక చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడయితే.. హైదరాబాద్‌లో మంత్రులు సిఫార్సు చేసిన వారికీ పోస్టింగులిచ్చేవారు కాదు. పూర్తి అధికారాలు అధికారులకే కట్టబెట్టారు. అప్పట్లో ఒక మంత్రి తన కులానికి చెందిన సీఐ పోస్టింగు కూడా వేయించుకోలేకపోయారు. సరే.. ఆ తర్వాత కాంగ్రెస్ వచ్చి సిఫార్సు లేఖల సంప్రదాయానికి తె రలేపితే, ఇప్పటికీ ఆ సంప్రదాయం ఉభయ రాష్ట్రాల్లో కొనసాగుతుందనుకోండి. అది వేరే విషయం! కానీ హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో సీఐ, ఏసీపీ స్థాయి అధికారుల్లో.. రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నందున, బహుశా రేవంత్ విమర్శ సరైంది కాదనుకోవాలేమో!?
హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ గెలిచేందుకు కేసీఆర్.. రిటైరయిన పోలీసు అధికారులతో ఒక బృందం ఏర్పాటుచేశారన్నది రేవంత్ ఆరోపణ. అందుకు ప్రధాన కారణం బహుశా ప్రభాకర్‌రావునుద్దేశించి ఉండవచ్చు. తనను అరెస్టు చేసినప్పటి నుంచి రేవంత్, ఆయనపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అనేక సందర్భాల్లో ప్రభాకర్‌రావు పేరు ప్రస్తావిస్తూనే ఉన్నారు. కానీ తాజాగా అదే వెలమ సామాజికవర్గానికి చెందిన రాధాకిషన్‌రావు టాస్క్‌ఫోర్సులో, సిట్‌లో సందీప్‌రావు, ఏసీబీలో భుజంగరావు, మల్కాజిగిరి ఏసీపీ శ్యాంప్రసాదరావు, రమణకుమార్‌ను పెట్టి హైదరాబాద్ శివార్లలో భూములపై నిఘా పెట్టడంతోపాటు.. ఫోన్ ట్యాపింగులకు పాల్పడుతున్నారన్న రేవంత్ ఆరోపణ సంచలనమే. ఈవిధంగా పొలీసుశాఖలో ఫలానా చోట, ఫలానా కులంవారున్నారని ఇప్పటిదాకా ఎవరూ ఆరోపించింది లేదు.
పైగా పోలీసు శాఖ రెండు వర్గాలుగా చీలిపోయిందన్న రేవంత్ ఆరోపణ కూడా సామాన్యమైనదేమీ కాదు. రెండోసారి అధికారంలోకి వచ్చి.. మూడోసారి కూడా అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్‌కు ప్రధాన బలం పోలీసే కాబట్టి, రేవంత్ అటునుంచే నరుక్కు వస్తున్నట్లు ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. తన ఆరోపణలు జనంలోకి వెళ్లి, అవి జనక్షేత్రంలో చర్చనీయాంశమయితేనన్నా.. తనకు అడ్డంకులు సృష్టిస్తున్న పోలీసులకు బ్రేకులు వేసి, వారిని ప్రజాస్వామ్యయుత దారిలో నడిపించవచ్చన్నది ఆయన వ్యూహం కావచ్చు. దానితపోపాటు తెలంగాణలో సరైన పోస్టింగులు లేక, అసంతృప్తితో ఉన్న రెడ్డి వర్గాన్ని ఆకర్షించే ఎత్తుగడ కూడా కావచ్చు. ఏదేమైనా రేవంత్.. టీఆర్‌ఎస్ మూలస్తంభాలతోనే యుద్ధం ప్రారంభించినట్లు ఆయన ఎంచుకున్న వైఖరి స్పష్టం చేస్తోంది.