బెంగళూరు: హిజాబ్ వివాదం కారణంగా కర్ణాటక సెకెండ్ పీయూసీ పరీక్షలు-2022కు హాజరు కాని విద్యార్థుల విషయంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్రీ యూనివర్శిటీ ఎడ్యుకేషన్ (పీయూఈ) కీలక ప్రకటన చేసింది.తిరిగి పరీక్షలు నిర్వహించలేమని తెగేసి చెప్పింది.
నిరసనలకు దిగిన విద్యార్థులు పీయూసీ-2 ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌ను బాయ్‌కాట్ చేసిన కారణంగా తిరిగి పరీక్షలు నిర్వహించరాదని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.ఫ్రిబవరి, మార్చిలో కర్ణాటక సెకెండ్ పీయూసీ ఎగ్జామ్స్-2020 షెడ్యూల్ ఉంది. అయితే, ఈ సమయంలో చాలా మంది విద్యార్థులు పరీక్షలు రాయకూడదని నిర్ణయించుకున్నారు.
హిజాబ్ ధరించడానికి అనుమతించని కారణంగా కొందరు, వీరికి మద్దతుగా మరికొందరు, ఒక తీర్మానం కోరుతూ ఇంకొందరు పరీక్షలకు దూరంగా ఉండిపోయారు. కర్ణాటక సెకెండ్ పీయూసీ పరీక్షల్లో (2022) పాస్ కాని వారి కోసం ప్రత్యామ్నాయ మార్గాలను సంబంధిత అధికారులు పరిశీలిస్తున్న తరుణంలోనే తాజా ప్రకటన వెలువడింది. ప్రాక్టికల్ పరీక్షలకు గైర్హాజరయ్యారనే కారణం చూపుతూ ప్రత్యామ్నాయ మార్గాలకు ప్రభుత్వం తెరదించేసింది.
దీనిపై ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ మంత్రి బీఎస్ నగేష్ మాట్లాడుతూ ”రీఎగ్జామ్ అంశాన్ని పరిశీలించే అవకాశం ఎక్కడుంది? హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వులు ఉన్నప్పటికీ హిజాబ్‌తో అనుమతించ లేదన్న కారణంగా ప్రాక్టికల్స్‌ను కొందరు విద్యార్థులు బాయ్‌కాయ్ చేశారు. మరికొందరు మరో కారణం చెబుతారు. సెకెండ్ ఛాన్స్ ఇవ్వమంటారు. ఇది ఎంతమాత్రం సాధ్యం కాదు” అని అన్నారు.
కర్ణాటకలో సహజంగా సెకెండ్ పీయూసీ ఎగ్జామ్స్‌లో ఒక్కో పేపరు 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రాక్టకల్స్‌కు 30 పాయింట్లు, థియరీకి 70 పాయింట్లు. ప్రాక్టికల్స్‌కు హాజరు కాని వారు 30 మార్కులు కోల్పోతారు. ప్రాక్టికల్స్‌కు హాజరు కాని వారు మొత్తం విద్యా సంవత్సరం కోల్పోకుండా 70 మార్కుల థియరీకి కూర్చుని పాస్ కావచ్చు. ఉడిపి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కె.రఘపతి భట్ (బీజేపీ) సైతం ప్రభుత్వానికి ఈ విషయంలో ఒక విజ్ఞప్తి చేశారు.
పలువురు విద్యార్థులు అనుకోని విధంగా నిర్బంధంలో ఉండిపోవడంతో పరీక్షలకు హాజరుకాలేక పోయారని అన్నారు. హిజాబ్‌తో అనుమతించని కారణంగా పరీక్షలకు హాజరుకాని వారికి తిరిగి పరీక్షలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. స్కూళ్లు, కాలేజీ క్యాంపస్‌ల వద్ద సమస్యలు సృష్టించిన వారెవరైనా సరే వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే, హైకోర్టు తుది తీర్పులో స్టూడెండ్లకు సెకెండ్ ఛాన్స్ ఇవ్వాలనే విషయాన్ని ప్రస్తావించకపోవడంతో రఘపతి భట్ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చినట్టయింది.