Suryaa.co.in

Andhra Pradesh

మార్చి నెల చివరి నాటికి నామినేటెడ్ పదవుల భర్తీ

మహానాడు నాటికి పార్టీ కమిటీల పూర్తి
పక్కన తిరిగేవారిని కాదు…పార్టీ కోసం పనిచేసేవారిని రికమండ్ చేయండి
పార్టీలో ఏ స్థాయి నేతైనా కుటుంబ సాధికార సారథిలో ఉండాలి
సుదీర్ఘ రాజకీయాల్లో ఉండాలంటే నిత్యం ప్రజల్లో ఉండాలి
ప్రత్యర్థులకు అవకాశం కలిగేలా ఎమ్మెల్యేలు, ఎంపీలు మాట్లాడొద్దు
వివేకా హత్య ఘటన కుట్ర రాజకీయాలకు ఒక కేస్ స్టడీ
కుట్ర, మోసం, ఫేక్ రాజకీయ సిద్దాంతంగా పెట్టుకున్న వాళ్లపట్ల అప్రమత్తంగా ఉండాలి
టీడీపీ ఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు కీలక సూచనలు చేసిన సీఎం

అమరావతి : మార్చిలోగా నామినేటెడ్ పదవులు, మే నెలలో జరిగే మహానాడు నాటికి పార్టీ కమిటీలు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నామినేటెడ్ పదవులకు ఎమ్మెల్యేలతో తిరిగే వారిని కాకుండా, పార్టీ కోసం కష్టపడ్డవారిని ఎంపిక చేయాలని సూచించారు. ఆలయ కమిటీ ఛైర్మన్, ఏఎంసీలు కమిటీలు మార్చిలోపు పూర్తి చేస్తామని అన్నారు. సమర్థులకే కో-ఆపరేటివ్ అధ్యక్ష పదవులు ఇవ్వాలని, ఎమ్మెల్యేలు, ఎంపీలు నామినేటెడ్ పదవుల కోసం ప్రతిపాదనలు పోర్టల్‌లో వెంటనే పెట్టాలని, మీరు ఇవ్వాల్సిన డాటా మీరు ఇవ్వకుండా పదవులు అంటే కుదరదని అన్నారు.

పనిచేసిన వారికి గుర్తింపు ఇచ్చేలా నామినేటెడ్ పదవులు ఇస్తామని స్పష్టం చేశారు. ఎప్పుడూ లేని విధంగా పార్టీ సభ్యత్వాలు కూడా కోటి దాటాయన్నారు. అసెంబ్లీ కమిటీ హాలులో శుక్రవారం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం కీలక సూచనలు చేశారు.

‘నేను రుణపడి ఉంది కార్యకర్తలకే. వారి ప్రాణాలు తీసినా, వేధించినా, కొట్టి కేసులు పెట్టినా పార్టీతోనే ఉన్నారు. కేడర్‌ను కాపాడుకోవడం మన బాధ్యత. నియోజకవర్గాల్లో కార్యకర్తలు, నేతలతో సమావేశాలు నిర్వహించండి. పంచాయతీ కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలతో సమావేశం నిర్వహించాలి. కార్యకర్తలను ఎంపవర్ చేస్తే మీకు తిరుగుండదు. మనల్ని నమ్ముకున్న వారిని మనం గౌరవించాలి. టీడీపీకి బీసీలు వెన్నెముకగా ఉంటూ వస్తున్నారు. అందుకే ఎస్టీ, ఎస్సీలతో పాటు బీసీలకు కూడా ఇంటి నిర్మాణానికి రూ.50 వేలు అదనంగా ఇవ్వబోతున్నాం. దీనికి రూ.2 వేల కోట్ల అదనంగా ఖర్చు అవుతుందని అధికారులు చెప్పారు…ఎంతైనా పర్వాలేదని ఈ నిర్ణయం తీసుకున్నాం.’ అని సీఎం అన్నారు.

కసరత్తు చేసి బడ్జెట్ రూపకల్పన

ఎంతో కసరత్తు చేసి బడ్జెట్ ప్రవేశపెట్టాం. సూపర్-6 హామీల అమలకు ప్రాధాన్యం ఇచ్చాం. పెన్షన్లకే ఏటా రూ.33 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలన్ని నెలలో మొదటి తేదీన ప్రజల్లోకి వెళ్లి వివరించాలి. త్వరలో ఎమ్మెల్యేలతో ముఖాముఖి నిర్వహిస్తా. మళ్లీ ఎమ్మెల్యేలుగా గెలవాలి అనుకుంటే ప్రతిష్టను పెంచుకోవాలి. కేంద్రమంత్రులు కూడా నెలకు రెండుమూడు సార్లు జిల్లాలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తున్నారు. ఇప్పుడు మనం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పైనా ప్రజల్లో చర్చించాలి. అన్నదాత, తల్లికి వందనం పథకాలకు నిధులు కేటాయించాం. మే నుంచి వాటిని అమలు చేస్తాం. మత్య్సకారులకు వేట నిషేధ సమయంలో రూ.20 వేలు ఇవ్వబోతున్నాం. విధి విధానాలు తయారు చేశాక మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం పథకం కూడా అమలు చేస్తాం.

2029 నాటికి ప్రతి ఇంటికి నీరు, గ్యాస్, ఇంటర్‌నెట్

టీడీపీ, జనసేన, బీజేపీ సొంత అవసరాల కోసం కలిసి పోటీ చేయలేదు. రాష్ట్ర అవసరాల కోసమే మూడు పార్టీలు కలిసి పని చేశాయి. 1998లో కూడా టీడీపీ మద్ధతుతో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు కూడా కేంద్రంలో కూడా టీడీపీ ఎంపీలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ పట్ల గౌరవం మరింత పెరిగింది. కేంద్రం కూడా రాష్ట్రానికి అన్ని విధాలా సహకారం అందిస్తోంది.

కేంద్రంతో మంచి సమస్వయంతో ముందుకెళ్తున్నాం. నేను మిమ్మల్ని కోరేది ఒకటే…మంచి ఆలోచనలు చేయండి. మీ నియోజకవర్గాన్ని ఏ విధంగా బాగు చేస్తారో ప్రణాళికా పత్రం రూపొందించుకోండి. 2029 నాటికి ప్రతి ఒక్క కుటుంబానికి ఇల్లు, నీటి సరఫరా, విద్యుత్ సదుపాయం, పీఎం సూర్యఘర్, పైపుద్వారా గ్యాస్ సరఫరా, మరుగుదొడ్డి, ఇంటర్నెట్ అందిచాల్సి ఉంది. ప్రతి గ్రామంలో రోడ్లు, లైట్లు, చెత్త సేకరించి పోల్యూషన్ లేకుండా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం.

జగన్ కుట్రలను నాడు ఇంటిలిజెన్స్ కూడా పసిగట్టలేకపోయింది

2019 ఎన్నికల ముందు మాజీమంత్రి వివేకానందరెడ్డి ని హత్య చేసి గుండెపోటు అని నమ్మించే ప్రయత్నం చేశారు. వివేకా హత్య ఘటనను మనం లోతుగా అర్ధం చేసుకోవాలి. రాజకీయాల్లో ఉండే క్రిమినల్స్ ఆలోచనలు ఎలా ఉంటాయో, కుట్రలు ఎలా ఉంటాయో ఆ ఘటన మనకు తెలియజేస్తుంది. వివేకా హత్యకు గురైతే గుండెపోటు అని సాక్షిలో బ్రేకింగ్ న్యూస్ వేశారు. మేం కూడా వాస్తవమేమో అనుకున్నాం. ప్రభుత్వంలో ఉన్న వాళ్లు పట్టించుకోలేదు…నేను కూడా పట్టించుకోలేదు.

ఎన్నికల సమయం కావడంతో నాడు మనం కూడా టికెట్ల కేటాయింపుపై కసరత్తు చేస్తున్నాం. నిజంగా గుండెపోటు ఏమో అని ముందుగా అనుకున్నాం. హత్య జరిగిన రోజున హైదరాబాద్‌లో తెల్లవారుజామున 5 గంటలకు మేనిఫెస్టో తయారు చేస్తున్నామని అజయ్ కల్లం చెప్పారు. ఆ సమయంలో ఫోను వస్తే జగన్ పైకి వెళ్లి మాట్లాడొచ్చి చిన్నాన్న చనిపోయారని చెప్పి సమావేశం కొనసాగించారని చెప్పారు. హత్య చేశాక ప్లాన్ ప్రకారం బెడ్ రూమ్, బాత్రూమ్‌లో రక్తం లేకుండా శుభ్రం చేశారు. రక్తం మరకుల, దాడి ఆనవాళ్లు ఉండడంతో ఆయన కుమార్తె సునీతారెడ్డి పోస్టుమార్టం చేయాలని ఎస్పీని అడిగారు.

దీంతో మళ్లీ వాళ్లు గొడ్డలి పోటు అని…అది మనం చేయించామని ఆరోపణలు చేశారు. అధికార పార్టీ నేతలు చంపారని ప్రచారం చేశారు. సాయంత్రానికి జగన్ వచ్చి మా నాన్నను చంపారు, ఇప్పుడు బాబాయిని కూడా చంపారు అని మాట్లాడారు. ఎన్నికల సమయంలో కావడంతో రాజకీయ లబ్దికోసం నీచమైన ఆరోపణలు చేశారు. మరుసటిరోజున సాక్షిలో నా చేతిలో కత్తిపెట్టి నారాసుర రక్త చరిత్ర అని పెద్ద వార్త రాశారు. హత్య గురించి ఎక్కడా ఎవరూ మాట్లాడకుండా, వాస్తవాలు బయటకు రాకుండా వాళ్లే కోర్టుకు వెళ్లి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు.

ఎన్నికల ముందు సీబీఐ దర్యాప్తు కావాలన్ని జగన్….అధికారం వచ్చిన తర్వాత సీబీఐ విచారణ అవసరం లేదని చెప్పారు. అప్పుడు సునీతారెడ్డికి పూర్తి అనుమానం వచ్చి పోరాటం మొదలుపెట్టారు. ఆ హత్య, పరిణామాలు కూడా నాటి ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలకు ఒక ప్రధాన కారణం అయ్యింది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా వారి కుట్రలను పసిగట్టలేక పోయింది. కుట్రలను అంచనా వేయలేక నాడు నష్టపోయాం. ఏ మాత్రం అలెర్ట్ గా ఉన్నా నాడు నిందితులను అరెస్టు చేసేవాళ్లం.

మళ్లీ మొన్నటి ఎన్నికల ముందు గులకరాయి నాటకం ఆడారు. దాన్ని గట్టిగా తిప్పి కొట్టాం. దీంతో వాళ్ల డ్రామాలు జనం నమ్మలేదు. ఇటీవల జగన్ ఇంటి ముందు గడ్డి తగలబడింది. దానిపై వైసీపీ నేతలు నానాయాగీ చేశారు. సీపీ ఫుటేజీ ఇవ్వండి అంటే లేవు, అవి డమ్మీవి అని మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో క్రిమినల్స్ వస్తే ఇలాంటి ఘటనలే జరుగుతాయి. క్రిమినల్ ఆలోచనలతో ఉన్న వాళ్లు నిత్యం ఇదే తీరుతో వ్యవహరిస్తారు.

మనం ఇలాంటి వారి కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వాళ్ల రాజకీయ సిద్దాంతమే కుట్రలు, ఫేక్ అయినప్పుడు మనం వాటిని నిరంతరం తిప్పి కొట్టాలి. ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రాను అని నా జీవితంలో చూడలేదు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడకుండా ప్రతిపక్ష హోదా కావాలని గోల చేస్తున్నారు. అందుకే మీరు చిన్నపొరపాటు మాట మాట్లాడినా దాన్ని పార్టీకి అంటగడతారు.

అప్పుడప్పుడు అన్నక్యాంటీన్‌లు సందర్శించాలి

ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు అండగా నిలబడాలి. లేదంటే వారికి సమయం వచ్చినప్పుడు ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తారు. మరో 2 నెలల్లో రోడ్లపై గుంతలు లేకుండా చేస్తాం. ఇప్పటికే 80 శాతం మేర పనులు పూర్తయ్యాయి. వాట్సాప్ గవర్నెన్స్ గురించి మాట్లాడటం కాదు. వినియోగించుకోవాలి. ఇప్పటికే 161 సేవలు తీసుకొచ్చాం. వాటిని 500కు పెంచుతాం. దీనిపై మీరు కూడా ఫీడ్ బ్యాక్ ఇవ్వాలి.
ధృవపత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగడానికి ముగింపు పడుతుంది. అప్పుడప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు అన్నక్యాంటీన్‌లకు కూడా వెళ్లండి. ఎండాకాలం వస్తోంది. నీటి సమస్య లేకుండా చూడాలి. దీనికోసం యాప్ కూడా తీసుకొస్తాం. ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చాలి. డయేరియా లేకుండా చర్యలు తీసుకోవాలి. కేంద్రం రూ.27 వేల కోట్లు జల్ జీవన్ మిషన్‌కు కేటాయించింది. ఏపీలో ప్రతి ఇంటికి నీరివ్వాలంటే అదనంగా రూ.55 వేల కోట్లు కావాలి.

త్వరలో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు

సభలో ఏ ఎమ్మెల్యే ఎంతసేపు ఉన్నారో కూడా త్వరలో స్క్రీన్‌పై చూపిస్తాం. ప్రతి ఎమ్మెల్యే అసెంబ్లీ జరిగే సమయంలో అసెంబ్లీలో ఉండాల్సిందే. మంత్రులు, ఎంపీలతో ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు కలిసి వచ్చి అభివృద్ధిపై నాతో చర్చించవచ్చు. మీకు నేను సమయం కేటాయిస్తాను. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు త్వరలో సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు నిర్వహిస్తాం’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

LEAVE A RESPONSE