Suryaa.co.in

Telangana

బీసీ గర్జన కాదు.. కాంగ్రెస్ మాయ గర్జన

– కాంగ్రెస్ హయాంలో బీసీలకు అన్యాయం
– మళ్లీ అదే నాటకం
– బీజేపీ రాజ్యసభ సభ్యులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె. లక్ష్మణ్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ, బీసీలను మరోసారి మోసం చేయడానికి కుట్రపన్నుతోంది. బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చాలన్న కాంగ్రెస్ పార్టీ ప్రకటన పూర్తి మోసపూరితమైనది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా పోరు గర్జన పేరుతో కాంగ్రెస్ పార్టీ మరో రాజకీయ డ్రామాకు తెరలేపింది.

స్వతంత్ర భారతదేశ చరిత్రను పరిశీలిస్తే, కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎన్నడూ న్యాయం చేయలేదని స్పష్టంగా కనిపిస్తుంది. 1952లో తెలంగాణలో 102 శాసనసభ స్థానాల్లో బీసీలకు కేవలం 9 సీట్లు మాత్రమే ఇచ్చింది. 2023లో కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలకు కేవలం 22 టిక్కెట్లు మాత్రమే ఇచ్చి వారి హక్కులను కాలరాస్తూ వచ్చింది. ఇక ఇప్పుడు, బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చాలన్న నినాదం కాంగ్రెస్ పార్టీ బీసీలను మభ్యపెట్టేందుకు వేస్తున్న కొత్త పథకం మాత్రమే.

9వ షెడ్యూల్‌లో బీసీ రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్ చేస్తున్న రాజకీయ డ్రామా

రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4), 16(4) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు బీసీ రిజర్వేషన్లను పెంచే పూర్తి అధికారమున్నది. అసలు 9వ షెడ్యూల్ అడ్డుగా లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఈ అంశాన్ని అమలు చేయగలదు. అయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ అనవసరంగా 9వ షెడ్యూల్ అంశాన్ని లేవనెత్తడం, దీన్ని ఓ రాజకీయ అస్త్రంగా మార్చి ప్రజలను తప్పుదోవ పట్టించడం దుర్మార్గమైన చర్య.

1973 తర్వాత 9వ షెడ్యూల్‌లో చేర్చిన ఏ అంశంపైనా సుప్రీంకోర్టుకు న్యాయ సమీక్ష చేయడానికి అధికారమున్నది. 2007లో IR COELHO Vs STATE OF TAMILNADU కేసులో సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చడం ద్వారా రక్షణ కలుగుతుందని కాంగ్రెస్ పార్టీ చెబుతున్నది పూర్తిగా తప్పుదోవ పట్టించే ప్రయత్నమే.

నిజంగా బీసీలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ కు తపన ఉంటే, వారి ప్రభుత్వంలో బీసీలకు తగిన ప్రాతినిధ్యం ఎందుకు కల్పించలేదు? మంత్రివర్గంలో బీసీలకు కేవలం ఇద్దరినే ఎందుకు ఇచ్చారు? స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల అమలు ఎందుకు చేయలేదు? ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ సమాధానం చెప్పాలి.

కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ అమలుపరచడం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఏ మాత్రం ఇష్టం లేదు. అందుకే అశాస్త్రీయమైన కుల గణనతో, 51 శాతం ఉన్న బీసీల సంఖ్యను 46 శాతానికి తగ్గించి చూపించింది. అంతేకాదు, అసలైన బీసీలకు అన్యాయం చేస్తూ, బీసీ జాబితాలో 10 శాతం ముస్లింలను చేర్చడం ద్వారా అసలైన బీసీలకు రిజర్వేషన్లు కేటాయించకుండా మోసం చేస్తోంది.

కాంగ్రెస్‌ నిజంగా బీసీల సంక్షేమాన్ని కోరుకుంటే, బీసీ రిజర్వేషన్లపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలి. అసలు బీసీలకు అన్యాయం చేసేందుకు ఈ కుల గణనను ఉపయోగించడం ఎంతవరకు సమంజసం? రాష్ట్రంలోని బీసీ ప్రజలు కాంగ్రెస్‌ నిజస్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. బీసీ గర్జన పేరుతో ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ధర్నా పూర్తిగా ఒక రాజకీయ డ్రామా. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక, బీసీలను మళ్లీ మభ్యపెట్టేందుకు ఢిల్లీ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సిగ్గుచేటు.

ప్రజలు కాంగ్రెస్ కుట్రలను అర్థం చేసుకోవాలి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికే పూర్తి అధికారం ఉన్నా, కేంద్రంపై నెపం నెట్టాలని చూస్తున్న కాంగ్రెస్ నాయకత్వం బీసీల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించటం లేదు.

తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు పూర్తి న్యాయం జరిగేలా బిజెపి నిరంతరం పోరాడుతుంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలి. మోదీ ప్రభుత్వం పాలనలో బీసీల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత కల్పించింది. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత విధానాలను ప్రజలు అర్థం చేసుకోవాలి. బీసీల హక్కుల కోసం భారతీయ జనతా పార్టీ బలమైన పోరాటం చేస్తుందని స్పష్టం చేస్తున్నామని డాక్టర్ కె.లక్ష్మణ్ స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE