అమరావతి బహుజన ఐకాస బాలకోటయ్య
ఆంధ్రప్రదేశ్ లో నాట్ బిఫోర్ మీ( నా ముందు కాదు) పాలన మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతుందని, ఎంతటి వారైనా నాట్ బిఫోర్ మీ అని అనాల్సిందేనని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పేర్కొన్నారు . శుక్రవారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగబద్ధమైన సంస్థలన్నీ నాట్ బిఫోర్ మీ అనే ప్లే కార్డులు మెడలో తగిలించుకున్నట్టుగా కనబడుతున్నాయని చెప్పారు.
ధర్నా, నిరసన చేయాలి అని అడిగితే, పోలీసులు నాట్ బిఫోర్ మీ అంటారని, హత్యలు, అత్యాచారాలపై విచారణ జరపండి అంటే విచారణ సంస్థలు నాట్ బిఫోర్ మీ అంటున్నాయని , రాజధాని, పోలవరం, ఉద్యోగాలు వంటివి అడిగితే, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా నాట్ బిఫోర్ మీ అంటూ ముఖ్యమంత్రి వైపు చూపుతున్నారని చెప్పారు. ఆఖరికి 73 ఏళ్ళ చంద్రబాబు అనారోగ్యంతో బాధపడుతున్నారని, వైద్యం యుద్ధ ప్రాతిపదికన అవసరం అని ముందస్తు బెయిల్ అడిగినా కోర్టులు నాట్ బిఫోర్ మీ అంటున్నట్లు తెలిపారు.
. బహుశా ఏ అదృశ్య శక్తో రాజ్యాంగ సంస్థల వెనుక నిలబడి ఆదేశాలు ఇస్తున్నట్టుగా లేదా కత్తితో బెదిరిస్తున్నట్టుగా ప్రజల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని చెప్పారు. నాలుగేళ్లలో వ్యవస్థల్ని ఇంతగా చెప్పు చేతుల్లో పెట్టుకొన్న ఘనత జగన్మోహన్ రెడ్డి ఒక్కరికే దక్కుతుందన్నారు. ఏపీకి రాజధాని లేకపోయినా, పోలవరం కట్టక పోయినా, ప్రత్యేక హోదా తీసుకు రాలేక పోయినా, పరిశ్రమలు పెట్టక పోయినా, కూలీలు ఊళ్ళు వదిలి వలస పోతున్నా చలనం లేని ముఖ్యమంత్రి ఐఏఎస్, ఐపీఎస్, కోర్టు లపై మాత్రం పూర్తిగా పట్టు సాధించారని చెప్పారు.
‘ నేను నమ్మను’ అన్న పోలీసులను నమ్మిన బంట్లుగా మార్చు కున్నారని చెప్పారు. నాలుగేళ్ళలో పాలనా పాదాలను వడి వడిగా వెనక్కి నడిపించి, అందరినీ నిమిత్త మాత్రులుగా మార్చటం లోనూ, అందరి నోట నాట్ బిఫోర్ మీ అనిపించటంలో ముఖ్యమంత్రి కి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇవ్వొచ్చు అని బాలకోటయ్య అభిప్రాయపడ్డారు.