– ఆయనను అప్రతిష్ఠపాలు చేస్తున్నారు
– వారిపై చర్యలు తీసుకోండి
– సీపీకి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు నందిపాటి మురళి ఫిర్యాదు
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ లక్ష్యంగా కొందరు సోషల్‌మీడియాలో ఆయన అప్రతిష్ఠపాలు చేస్తున్నారంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పోలీసులకు ఆశ్రయించారు. ఎన్టీఆర్‌ను అప్రతిష్ఠపాలు చేస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్‌కు లిఖిత పూర్వక ఫిర్యాదు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
ఎన్టీఆర్ వ్యక్తిగత ప్రతిష్ఠను, పరువును దెబ్బతీసేలా పోస్టులు పెడుతున్నారని.. ఎన్టీఆర్ అభిమానుల సంఘం నాయకుడు నందిపాటి మురళి ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ ఫొటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని.. సామాజిక మాధ్యమాల్లో ఉన్న అభ్యంతరకర పోస్టులను వెంటనే తొలగించేలా చూడాలని, అలాంటి వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని నందిపాటి మురళి కోరారు. దీనికి స్పందించిన సీపీ సజ్జన్నార్.. తాము దీనిపై విచారణ జరిపించి, నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.