Suryaa.co.in

Andhra Pradesh

ప్రజాసేవకే ఎన్టీఆర్ ట్రస్ట్ అంకితం

– తలసేమియా బాధితులకు అండగా నిలిచేందుకే యూఫోరియా మ్యూజికల్ నైట్
– ప్రజల స్పందన చూశాక మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలనే ధైర్యం, ప్రోత్సాహం వచ్చాయి
– రక్తదానం ప్రాణదానంతో సమానం
– ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి

విజయవాడ: ప్రజాసేవకే ఎన్టీఆర్ ట్రస్ట్ అంకితం. తలసేమియా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించి, ఆ వ్యాధితో బాధపడే బిడ్డలను ఆదుకోవాలనే లక్ష్యంతోనే యూఫొరియా మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. తలసేమియా బాధితుల సహాయార్థం ఏర్పాటు చేసిన మ్యూజికల్ నైట్ కు మంచి మనసులు ఇంతలా స్పందించడం గొప్ప విజయం. సమాజంలో మంచి మిగిలే ఉంది.. మంచి పనికి ప్రజల మద్ధతు ఉంటుంది అనడానికి ఇక్కడికి వచ్చిన మీరే నిదర్శనమని నారా భువనేశ్వరి అన్నారు.

తలసేమియా బాధితులకు అండగా

ఒక ఛారిటీ కార్యక్రమానికి ఇంతమంది వస్తారని ఊహించలేదు. కార్యక్రమానికి అనుకున్న దానికంటే మంచి స్పందన వచ్చింది. మీ స్పందన చూశాక ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయాలనే ధైర్యం, ప్రోత్సాహం వచ్చాయి. ప్రపంచంలో అతి భయంకరమైన వ్యాధి తలసేమియా. ఆ వ్యాధితో బాధపడే బిడ్డలను ఆదుకోవాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము. ఎన్టీఆర్ ట్రస్ట్ యూఫోరియా మ్యూజికల్ నైట్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం తలసేమియా బాధితుల జీవితాలకు మంచి భరోసా ఇవ్వడం.

ముఖ్యమంత్రి అయి ఉండీ ఒక సాధారణ వ్యక్తిగా టికెట్ కొని కార్యక్రమానికి వచ్చిన చంద్రబాబునాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. పవన్ కల్యాణ్ , నారా లోకేష్, బాలకృష్ణ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉండి ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి ప్రతి రెండువారాలకు ఒకసారి రక్తమార్పిడి జరగాలి. అలాంటి వారి కష్టాలు, బాధలు చూశాక, వారిని కలిసిన సమయంలో వారికోసం ట్రస్ట్ ఏమి చేయగలదని ఆలోచించాము.

అప్పుడే తలసేమియా ట్రస్ట్ పెట్టాలని నిశ్చయించుకున్నాము. ఒక్కో తలసేమియా కేంద్రం ఏర్పాటుకు సుమారు రూ. 40 నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చవుతుంది. దానికోసమే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి తలసేమియా కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాము. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఏమీ ఆశించకుండా తన బృందంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అంగీకరించారు. ఆయనకు, ఆయన బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.

ప్రజా సేవలో ఎన్టీఆర్ ట్రస్ట్

మాతో పాటు ఎంతోమంది ఈ ప్రయాణంలో మమ్మల్ని ముందుకు నడపడానికి ప్రోత్సాహం, ధైర్యం ఇచ్చారు. లోకంలో పుట్టిన ప్రతి ప్రాణి సుఖ,సంతోషాలతో ఉండాలని మా నాన్నగారు, స్వర్గీయ ఎన్.టీ.ఆర్ గారు భావించేవారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ను 1997 ఫిబ్రవరి 15న ఏర్పాటు చేశాము. 28 ఏళ్ల ట్రస్ట్ ప్రయాణంలో ఆరోగ్యం, విద్య, విపత్తు సహాయం, ఉపాధికల్పన, మహిళా సాధికారతకు విశేష సేవలందిస్తూ, లక్షలాది మందికి సాయం చేస్తున్నామనే సంతృప్తి మా ట్రస్ట్ కు మిగిలింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుంటుంది. ట్రస్ట్ ద్వారా హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం, రాజమహేంద్రవరంలో నాలుగు బ్లడ్ బ్యాంకులు నిర్వహిస్తున్నాము. 4.91లక్షల యూనిట్ల రక్తం దాతల నుంచి స్వీకరించి, అవసరమైన 8.70లక్షల మంది పేషంట్లకు అందించాము. 13 వేలకు పైగా హెల్త్ క్యాంపులు నిర్వహించి, 20లక్షల మంది పేషంట్లకు దాదాపు రూ.23 కోట్ల విలువైన మందులు అందించాము.

సంజీవని ఉచిత క్లినిక్ లో భాగంగా 4 మొబైల్ ఆసుపత్రుల ద్వారా 2 లక్షల మందికి ఉచిత వైద్యసేవలు అందించడం గొప్ప విషయం. చదువుతోనే భవిష్యత్ అనే నానుడిని బలంగా నమ్మిన 2వేల మందికి పైగా అనాథపిల్లలకు ఉచిత విద్య, వసతి, ఆహారం అందించడంలో మా ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుంది.

కరోనా సమయంలో ట్రస్ట్ ద్వారా సేవలు

ఆడబిడ్డలు ఆర్థికంగా వారి కాళ్లపై వారు నిలబడాలని 7,531 మందికి టైలరింగ్, నెట్ వర్కింగ్, స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ అందించి ఉపాధి కల్పించాము. కోవిడ్ సమయంలో 3 లక్షల మాస్కులతో పాటు ఉచిత మందులు అందించాము. రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో రూ.కోటి30లక్షలతో ఆక్సిజన్ ప్లాంట్లను ట్రస్ట్ ఏర్పాటు చేసింది. కోవిడ్ సమయంలో ఎవరూ బయటకురాలేని స్థితిలో మా వాలంటీర్లు అందించిన సేవలు నిజంగా అభినందనీయం.

వారికి ఒక కాల్ వస్తే చాలు.. అర్థరాత్రి అని కూడా లేకుండా సేవలు అందించారు. కోవిడ్ సమయంలో చనిపోయిన వారి అంతిమ సంస్కారాలు కూడా మా ట్రస్ట్ ద్వారా నిర్వహించాము. కర్నూలు వరదలు, విజయవాడ.. గోదావరి వరదలు, హుద్ హుద్ తుఫాన్ వంటి విపత్తుల సమయంలో లక్షలాది నిరాశ్రయులకు అండగా నిలిచి ఆదుకున్నాము. కడప జిల్లాలో అన్నమయ్య డ్యామ్ గేట్లు కొట్టుకుపోయినప్పుడు ఆ ప్రాంతాల్లో ప్రాణాలు కోల్పోయిన 48 కుటుంబాలకు, ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేశాము. ఇప్పటివరకు 22లక్షల మందికి విపత్తుల సమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ సాయంచేసిందని గర్వంగా చెప్పగలను.

రక్తదానం ప్రాణదానంతో సమానం

మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి. రక్తదానం చేయడమంటే ప్రాణదానం చేయడమే. ఇక్కడకు వచ్చిన యువత మీ కుటుంబాలను, స్నేహితులను ప్రోత్సహించి ప్రతి ఒక్కరూ ట్రస్ట్ నిర్వహించే బ్లడ్ డొనేషన్ డ్రైవ్ లో పాల్గొనాలని కోరుతున్నాను. ఎందుకంటే మీరు దానం చేసే ప్రతి రక్తపు బొట్టు చాలామంది జీవితాలు నిలబెడుతుందని గుర్తుంచుకోండి. ఇన్ని సంవత్సరాలుగా మా ట్రస్ట్ ఇన్ని కార్యక్రమాలు చేయడానికి ఒక నాయకుడు.. ఒక విజనరీ ఆలోచనలున్నాయి.

అలానే మా బృందం చేసిన గొప్పసేవలు ఉన్నాయి. 24/7 కష్టపడుతున్న మా బృందం సహాయసహకారాల వల్లనే ఇన్ని సేవా కార్యక్రమాలు చేపట్టగలుగుతున్నాము. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి కారకులైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమం మరెన్నో మంచి పనులు చేసేందుకు ఎంతో స్ఫూర్తిగా నిలిచిందని నారా భువనేశ్వరి అన్నారు.

LEAVE A RESPONSE