– కబ్జాదారులు, సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ గ్రీవెన్స్ లో పవన్ కుమార్ ఫిర్యాదు
– విచారించి న్యాయం జరిగేలా చూస్తామని నేతలు హామీ
విజయవాడ: టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో భూ సమస్యలతో పాటు పలు సమస్యలపై వచ్చిన అర్జీదారుల నుండి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, APCOGF చైర్మన్ గండి బాబ్జిలు వినతులు స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. అనంతరం టీడీపీ ఎన్నారై వింగ్ రాజశేఖర్ ఆధ్వర్యంలో పలువురి పేదలకు ఆర్థిక సాయాన్ని నేతలు వారి చేతుల మీదుగా అందజేశారు.
• కడప జిల్లా సిద్దవటానికి చెందిన పవన్ కుమార్ గ్రీవెన్స్ లో నేతలకు విజ్ఞప్తి చేస్తూ.. 50 సంవత్సరాలకు పైగా యువతకు ఆట స్థలంగా ఉన్న భూమిని అధికారులే అక్రమంగా నకిలీ డాక్యూమెంట్లతో కబ్జాదారులకు కట్టబెట్టారని.. ఈ అక్రమానికి పాల్పడిన అధికారి ప్రస్తుతం డిప్యూటీ తాహసీల్దారుగా ఉన్నారని.. దీనిపై ఉన్నతాధికారులు విచారించి వారిపై చర్యలు తీసుకొని భూమిని కబ్జా నుండి విడిపించాలని కోరాడు.
• అనంతపురం జిల్లా యల్లనూరు మండలం లోని 85 నిట్టూర్ చెరువుకు గండికోట నుండి చెపట్టిన ఎత్తిపోతల పథకం పనులు 50% జరిగి ఆగిపోయినవని మిగిలిన పనులు త్వరగా పూర్తి చేసి త్వరగా సాగు నీరు అందించేలా చూడాలని జిల్లా తెలుగు రైతు ఉపాధ్యాక్షుడు చల్లా చంద్రశేఖర్ నాయుడు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశాడు.
• పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగం గ్రామానికి చెందిన బొల్లేపల్లి శివప్రసాద్ విజ్ఞప్తి చేస్తూ.. తాను వికలాంగుడినని తనకు ఉండటానికి ఇల్లు లేదని.. దయ చేసి తనకు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం సాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు.
• తాను మున్సిపాలిటికి డబ్బులు కట్టి మున్సిపల్ స్థలంలో చెరకు రసం మిషన్, టిఫిన్ బండి పెట్టుకుని అమ్ముకుంటుంటే పక్కన గంపలు అమ్ముకునే వారు తమపై దాడికి వచ్చారని.. తాను ఒంటరి మహిళలనని అధికారులు స్పందించి తమపై దాడికి వచ్చిన వారిమీద చర్యలు తీసుకొని తమ వ్యాపారానికి ఇబ్బంది లేకుండా చూడాలని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పొన్నూరు మల్లిక గ్రీవెన్స్ లో నేతలకు అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశారు.
• కర్నూలు జిల్లా కౌతాళం మండలం కంబిలనూరు గ్రామానికి చెందిన ఉప్పుల పాటి వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేస్తూ.. తమ భూమిని వెబ్ ల్యాండ్ లో పెట్టి అధాకారులు మళ్లీ రిజెక్ట్ చేశారని… తమ వద్ద అన్ని ఆధారలు ఉన్నా ఆన్ లైన్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని.. తమ భూ సమస్యను పరిష్కరించాలని గ్రీవెన్స్ లో నేతలకు అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశాడు.
• ఎన్టీఆర్ జిల్లా జి. కొండూరు మండలం కవులూరు గ్రామానికి చెందిన చెరుకూరి భూపెందర్ రావు గ్రీవెన్స్ లో విజ్ఞప్తి చేస్తూ.. తమ స్వాధీనంలో ఉన్న భూమిని ఆన్ లైన్ చేసి పాస్ బుక్ ఇవ్వమంటే అధికారులు తిప్పించుకుంటున్నారని.. ఎన్నిసార్లు ఆఫీసు చుట్టూ తిరిగినా పనిచేయడంలేదని.. దయ చేసి తమ భూ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
• అనంతపురం జిల్లా నార్పల మండలానికి చెందిన కె. శ్రీనివాసుల నాయుడు విజ్ఞప్తి చేస్తూ.. ఎన్ని సార్లు అర్జీలు పెట్టుకున్న తన పొలానికి కరెంట్ సప్లై ఇవ్వకపోవడంతో తన ఐదెకరాల దానిమ్మతోట నీరులేక నిలువునా ఎండిపోతుందని.. దయ చేసి అధికారులు స్పందించి వెంటనే కరెంట్ సప్లై ఇస్తే తన పంట నిలబడుతుందని.. లేదంటే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని.. నేతలకు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి వాపోయాడు.
• అల్లూరి సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలం చిన్నరమణయ్య పేటకు చెందిన పలువురు బాధితులు విజ్ఞప్తి చేస్తూ.. పోలవరం ఎడమ కాలువకోసం తమ భూమిని తీసుకొని తమకు పరిహారం ఇవ్వలేదని.. దయ చేసి తమకు పరిహారం వచ్చేలా చూడాలని మడకం చంద్రరావు దొర తదితరులు విజ్ఞప్తి చేశారు.
• వివిధ సమస్యలతో ఆర్థిక సాయం కోసం గతంలో అర్జీలు పెట్టుకున్న అభ్యర్థులకు టీడీపీ ఎన్నారై వింగ్ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఎన్నారైలు అందించిన సాయాన్ని నేతలు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ అశోక్ బాబు చేతుల మీదుగా దాదాపు 11 మంది పేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నగదును స్వీకరించిన వారు టీడీపీ పార్టీ చేసిన మేలును మరిచిపోలేమని నేతలకు కృతజ్ఞతలు తెలియచేశారు.