అధికారులూ.. కొంచెం… వాడండి!

– మరో మర్యాద ‘రామ’న్న తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్
– ఇలాంటి అధికారులు ఎంతమంది ఉన్నారు?
– మన అధికారుల్లో ‘మర్యాద రామన్న’లేరీ?

కలెక్టర్ నుంచి ఎమ్మార్వో వరకూ… డీజీపీ నుంచి ఎస్‌ఐల వరకూ ఎదుటివారిని కూర్చోబెట్టి మాట్లాడటమంటే అస్సలు నచ్చదు. పైగా మహా చికాకు. అల్పులు తమ ఎదుట కూర్చోవడమేమిటన్నది వారి ఫిలాసఫీ. కానీ అది మన సంస్కృతి అని వారిలో చాలామందికి తెలియదు. కారణం.. చదువుకున్న అహంకారం కావచ్చు. తమ ముందు మరొకరు కూర్చోవడమేమిటన్న తెల్లవాడు వదిలిపోయిన పాత ఆలోచనా కావచ్చు.పోలీసుస్టేషన్లలో అయితే ‘మర్యాద స్థాయి’ మరీ దారుణం. అనాగరికంగా ఉంటుంది. ఎస్‌ఐని ఎస్పీలు కూర్చోబెట్టరు. ఎస్‌ఐలు ఫిర్యాదుదారుని కూర్చోబెట్టరు. వారి దృష్టిలో అది తమ సామ్రాజ్యం. తామే మహరాజులమన్న భ్రమ.

మొత్తానికి మన భారతీయ అధికారుల్లో ఎదుటివారిని ‘కూర్చోబెట్టి మాట్లాడించమనే మంచి అలవాటున్న’ మర్యాద రామన్న’లు పెద్దగా కనిపించరు.. గతంలో గంధం చంద్రుడు అనంతపురం జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు, అర్జీలు ఇచ్చే వారు కింద కూర్చునే పురాతన సంప్రదాయానికి చర మగీతం పాడి, వారికి కార్యాలయాల్లో కుర్చీలు వేయాలని అప్పుడెప్పుడో ఆదేశాలిచ్చారు. తాజాగా బ్యూరోక్రాట్లకు ఈ డాక్టర్ బాబు మార్గదర్శిగా నిలిచారు. తన వద్దకు వచ్చేవారు కూర్చోవడం వారి హక్కు’ అని ఏకంగా బోర్డు తగిలించిన ‘చాదస్తపు అధికారి’!

తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఛాంబర్ లోకి మీరు వెళ్తే టేబుల్ మీద కనిపించే దృశ్యం ఇది.

మీరు కూర్చున్నందుకు ధన్యవాదాలు. ఇది ” మీ హక్కు” అని ఇంగ్లీషులో టేబుల్ పై ఓ బోర్డు మనకు కనిపిస్తుంది.

కూర్చున్నందుకు ధన్యవాదాలు. ఇది మీ హక్కు అని ఎంత మంది అధికారులు చెప్పగలరు?
చాలా కార్యాలయాల్లో 20 , 30 కుర్చీలు ఉన్నా కూర్చో మనడానికి అధికారులకు మనసొప్పదు.
పేదవాళ్ళని నిలబెట్టి మాట్లాడటం.
మహిళలను నిలబెట్టి మాట్లాడటం.
తన కిందిస్థాయి వారిని నిలబెట్టి మాట్లాడటం తమ హక్కులాగా భావిస్తూ ఉంటారు.
చాలామంది అధికారులు వీటి కతీతంగా డాక్టర్ రామ్ స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ మనకు కనిపిస్తారు.

అన్ని కార్యాలయాల్లో ఇలాంటి వాతావరణం రావడానికి అధికారులు ప్రయత్నించా లని కోరుకోవడం అత్యాశ కాదు కదా?

 

Leave a Reply