రానున్నదంతా ఒమిక్రానే

– కోవిడ్ పీడ ఇక అంతానికి చేరువలో

కొరోనావైరస్ రక రకాలుగా రూపాంతరం చెందుతూ, 2021 నవంబర్ 24 నాటికి ఒమిక్రాన్ రకంగా పరిణమించింది. తొలిగా దక్షిణ ఆఫ్రికాలో బయటపడ్డ ఈ రకం వైరస్ విపరీతమైన వేగంతో వ్యాపించగలదు. అయితే ప్రధానంగా ముక్కు, గొంతు కణజాలానికి పరిమితమవుతుంది. విధ్వంసాన్నీ, విషాదాన్నీ సృష్టించిన డెల్టా రకం కొరోనావైరస్ తరహాలో ఇది ఊపిరితిత్తుల కణజాలానికి వ్యాపించడం, అక్కడ పెరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందువలన ఒమిక్రాన్ రకం తేలికపాటి జలుబుని మాత్రమే కలుగజేస్తుంది. అనగా 2019 డిసెంబర్ ముందు నాటి రూపానికి కొరోనావైరస్ వేసిన పెద్ద వెనుక అంగగా దీనిని భావించాలి.

ఆర్ఎన్ఏ వైరస్ లలో ఉండే తీవ్రమైన జన్యు రూప మార్పిడి శక్తి మూలంగా… గతంలో కేవలం జలుబును మాత్రమే కలుగ చేయగల కొరోనావైరస్ కాస్తా… ఊపిరితిత్తుల్లోకి చేరుకొని, అక్కడ కణజాల వాపుని కలుగజేసి, రక్తం గడ్డ కట్టే ప్రక్రియను ప్రేరేపితం చేయడమే కాకుండా… దెబ్బతిన్న కణజాలం తేలికగా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కు లొంగిపోవడంతో… ప్రపంచవ్యాప్తంగా గత రెండు సంవత్సరాల కాలంలో కొరోనావైరస్ 38 కోట్ల మందికి సోకి 57 లక్షల మందిని పొట్టన పెట్టుకుంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న అన్ని కొరోనావైరస్ రకాలను పక్కకు నెట్టివేసి ఒమిక్రాన్ రకం ఆక్రమిస్తున్నది. కొరోనావైరస్ రకాలను గుర్తించడానికి వాటిని జీన్స్ ని విశ్లేషించాలి. తాజాగా బ్రిటన్ లో జీన్ సీక్వెన్సింగ్ వల్ల తెలిసింది ఏమంటే ప్రస్తుతం 99 శాతం పైగా ఒమిక్రాన్ రకం కొరోనావైరస్ వ్యాప్తిలో వున్నది.

కాగా ఒమిక్రాన్ రకంలో మరో చిన్న మార్పుతో సబ్ టైప్ పుట్టుకొచ్చింది. దీనిని BA2 ఒమిక్రాన్ రకంగా చెప్తున్నారు. డెల్టా వేరియంట్ కొరోనావైరస్ లో వుండే ‘ఎస్’ జీన్… ఒమిక్రాన్ రకంలో లేకపోవడాన్ని ఒక కొండ గుర్తుగా ఒమిక్రాన్ రకమును గుర్తించడానికి వాడుతున్నారు. దీనిని ‘ఎస్’ జీన్ డిలీషన్ లేదా ఎస్ జీన్ టార్గెట్ ఫెయిల్యూర్ (SGTF) గా వ్యవహరిస్తున్నారు. అయితే కొత్తగా అవతరించిన BA2 ఒమిక్రాన్ రకంలో ‘ఎస్’ జీన్ ఉంటున్నది.

కనుక ప్రాథమిక ఆర్టి పిసిఆర్ పరీక్షలలో ‘ఎస్’ జీన్ ని చూసి డెల్టా వేరియంట్ కొరోనావైరస్ గా భావించి ఆందోళన పడనవసరం లేదు. బ్రిటన్లో జరిగిన కొరోనావైరస్ జీన్స్ సీక్వెన్సింగ్ లో 96 శాతం ఒమిక్రాన్ రకం మొదటి రూపం (BA1 అంటున్నారు), మూడున్నర శాతం BA2 ఒమిక్రాన్ రకం, ఒక్కశాతం కన్నా తక్కువగా వేరే రకం ఉన్నట్టు గుర్తించారు.

అయితే BA2 ఒమిక్రాన్ రకం వారానికి రెట్టింపు అవుతోంది. కనుక ఒక్కసారి ఒమిక్రాన్ రకం కొరోనావైరస్ వ్యాపించిన తర్వాత ఇక వేరే వేరియంట్స్ కి చోటు ఉండదు. మాస్క్ ధరించడం మూలంగా ఒమిక్రాన్ రకం సోకినప్పటికీ ఇన్ఫెక్షన్ తక్కువగా ఉండి సహజమైన వాక్సిన్ లా పనిచేస్తుంది. ఆందోళన వద్దు, ధైర్యంగా ఉండండి… బాధ్యతతో మెలగండి.

– డాక్టర్ యనమదల మురళీకృష్ణ, ఎండీ,
సాంక్రమిక వ్యాధుల నిపుణులు, కాకినాడ