Suryaa.co.in

Features

దక్షిణ భారతదేశ తొలి గజల్ దార్శనికుడు పీ.బీ.శ్రీనివాస్

దక్షిణ భారతదేశ సినిమా గానాన్ని ప్రభావితం చేసిన గాయకుడు, అష్టభాషా కవి, సంగీతవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, ఎనిమిది భాషల్లో గజళ్లు రాసిన ఏకైక కవి, దక్షిణ భారతదేశపు తొలి గజల్ దార్శనికుడు, రచన, గానం ఈ రెండిటి పరంగానూ గజలియత్ పై అవగాహన ఉన్న తొలి దక్షిణాది కళాకారుడు పీ. బీ. శ్రీనివాస్. అమేరిక‌ అధ్యక్షుడు నిక్సన్ (Nixon) ప్రశంసల్ని, చంద్రుడిపై కాలు మోపిన ఆంస్ట్రంగ్ (Armstrong) ప్రశంసల్ని అందుకున్న కవి-గాయకుడు పీ.బీ. శ్రీనివాస్. ఇవాళ పీ.బీ. శ్రీనివాస్. వర్ధంతి.

పీ. బీ. శ్రీనివాస్ కు ముందు, తరువాత అని దక్షిణ భారత సినిమా గానం చెప్పబడడం చారిత్రిక వాస్తవమౌతుంది. తెలుగు సినిమా గానమే కాదు ఘంటసాల (తెలుగు సినిమా గానికి ఆదర్శం కాలేదు)తమిళ్ష్, కన్నడం, మలయాళం భాషల సినిమా గానం పీ.బీ. శ్రీనివాస్ గానం ఆదర్శంగా నడిచింది అన్నది క్షేత్ర వాస్తవం.

అంతర్జాతీయ స్థాయి గాత్రం, గానం
– మన‌ పీ.బీ. శ్రీనివాస్
(22/4/19న ఆంధ్రజ్యోతి వెబ్ ఎడిషన్ లో వెలువడిన వ్యాసం)

“గానకళా సార్వభౌమ” గా కన్నడంలో మెఱిసిన‌ ప్రభ‌ పీ.బీ.శ్రీనివాస్‌. కన్నడ సంస్కృతిలో ఒక భాగం పీ.బీ. శ్రీనివాస్. ఒక చలన‌ చిత్ర నేపథ్య గాయకుడు ఒక ప్రాంత ప్రజల సంస్కృతిలో భాగం అవడం అపూర్వం, ఒక చారిత్రిక విశేషం. నటుడు రాజ్ కుమార్ కన్నా ముందే కర్ణాటక ప్రజల చేత 1960లో ఎన్నుకోబడ్డ కన్నడ సూపర్ స్టార్ పీ.బీ.శ్రీనివాస్! ఒక నేపథ్య గాయకుడు‌ సూపర్ స్టార్ అవడం మన దేశంలో పీ.బీ. శ్రీనివాస్ తోనే మొదలయింది. కన్నడీగులకు “దేవరు” పీ.బీ. శ్రీనివాస్. 1952లో‌ మిష్టర్ సంపత్ హిందీ చిత్రంలోని “ఏక్‌ లంబీ…” పాటతో వారి గాన జీవితం మొదలయింది. వారి గాత్రం, గానం వీటిలోకి వెళ్దాం రండి…
అంతర్జాతీయ స్థాయి గాత్రంతో అంతర్జాతీయ స్థాయి గానం‌ చేసిన గాయకుడు పీ.బీ.శ్రీనివాస్.

పీ.బీ. శ్రీనివాస్ గానానికీ గాత్రానికీ ప్రాంతీయత లేదు. ఘంటసాల గాత్రానికీ, గానానికీ తెలుగుతనం ఉంటుంది. కానీ పీ.బీ.శ్రీనివాస్ గాత్రం,‌ గానం భాష, ప్రాంతాలకు అతీతం. అందుకే వారిని హిందీ గాయకులు సైతం‌ మెచ్చుకున్నారు.

తొలిసారి వీరి గాత్రాన్ని రికార్డ్ చేశాక ఈమని శంకర‌‌శాస్త్రితో జెమిని ఎస్.ఎస్. వాస‌న్ “రాళ్లుకూడా కరిగిపోయే గాత్రాన్ని‌‌‌ పరిచయం చేశారు మీరు” అని అన్నారు.

Illustrated Weekly ఇంగ్లిష్ పత్రిక కోసం ఆ పత్రిక సంపాదకుడు ఎ.ఎస్. రామన్ ఒక‌ ముఖాముఖిలో లత మంగేశ్కర్ ను “మీకు నచ్చిన దక్షిణాది గాయకులు ఎవరు?” అని అడిగితే “ఏకీ‌ అచ్చా గాకయ్ పీ.బీ.శ్రీనివాస్” అని జవాబు చెప్పారు లత.

దక్షిణాదిలోనే కాదు భారతదేశ చలన చిత్ర గానంలోనే నమోదైన తొలి Fine warm rounded even baritone with verve పీ.బీ.శ్రీనివాస్ దే. వారి గొంతులో ring ఉంటుంది.‌ Ring అంటే‌ a clear resonant tone quality. గాత్రంలో ఉండే “బిగి” ఈ ring అవుతుంది. గాత్రం సమంగానూ, సాంద్రతతోనూ, నిండుగానూ ఉండడం rounded even barirone అవుతుంది. ఘంటసాల అన్నారు “తమ్ముడూ, నీ‌ గొంతులో‌ సహజంగానే ఒక‌ ఒదుగు ఉంది, నేను దాని కోసం గల్లాపట్టు పట్టి పాడతాను‌” అని. కవిససామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ “పురుష గాత్రం‌ అంటే ఇదే” అని పీ.బీ.ఎస్.‌ గాత్రాన్ని విని అన్నారు. పీ.బీ. శ్రీనివాస్ ది ఒక‌ లక్షణమైన గాత్రం. ఒక సహజమైన గాత్రం. వారిది‌ natural timbre, కృతఖమైన metalic tone కాదు.

ఉత్తతాదిలో మాత్రమే వినిపిస్తూండే melody, mood singing, modulation లను దక్షిణాది‌ చలనచిత్ర సంగీతానికి తెచ్చింది పీ.బీ.ఎస్. వీరికి ముందు mood singing అంటే మనోధర్మ గానమూ, modulation in singing దక్షిణ భారత‌ దేశ‌‌ చలనచిత్ర గానంలో లేవు. 1956 లో వచ్చిన భలే‌ రాముడు‌ చిత్రంలో‌ వారు రేలంగికి పాడిన “బంగరు‌ బొమ్మా…” పాటతో దక్షిణ భారత నేపథ్య గానంలో mood singing మొదలయింది. అటుపైన ఎన్నో తమిళ, కన్నడ చిత్రాలలో ఎన్నో పాటలతో mood singing ను అందించారు పీ.బీ. శ్రీనివాస్. ఘంటసాల సాహిత్య యుక్తంగానూ ‘భావం’ తోనూ పాడడంతో ఆగిపోయారు. ఘంటసాల గారిది‌ “సంస్కరించబడిన‌ గానం (Cultured singing). పీ.బీ.ఎస్. ది మేలైన, తీర్చి‌దిద్దిన గానం (Fine singing).

హిందీ‌ గాయకులైన‌ మొహమ్మద్ రఫీ, మన్నాడే, తలత్‌ మహ్ మూద్, లత మంగేష్కర్, ఆశ‌ భోస్లే లకు పీ.బీ.ఎస్. అంటేనే అభిమానం.‌ ఒక దశ వరకూ ఉత్తరాది వారు దక్షిణాదిలో “గాయకుడు”‌‌ అని‌ గుర్తించింది పీ.బీ.శ్రీనివాస్ నే.

Jim Reeves, Perry Como, Nat King Cole, Pat Boone వంటి‌ అంతర్జాతీయ గాయకుల గాత్రధర్మం, గాన‌‌‌ ధోరణి మనకు‌ ఒక్క పీ.బీ. శ్రీనివాస్ లోనే కనిపిస్తాయి. ఇంగ్లిష్ గానంలో‌ మనకు వినిపించే relaxed singing style కూడా మనకు‌ పీ.బీ.ఎస్.‌ద్వారానే వచ్చింది. (పాట వెన్నెలకేల నాపై కోపం – సినిమా కానిస్టేబుల్ కూతురు) మామూలుగానూ, బాగా పాడడమూ అన్న వాటిని దాటి‌ గానంలో conceptulaization ను తీసుకొచ్చింది‌ వారే. “ఓహో గులాబి బాల…” పాట దీనికి ఉదాహరణ.

తలత్ మహమూద్ భారతదేశ చలన చిత్ర, లలిత సంగీత గాన్నాల్ని ఒక సరైన మలుపు తిప్పారు. మేలైన, తీర్చిదిద్దబడిన‌ గానం (fine singing) మనకు తలత్‌ ద్వారానే వచ్చింది. 1944 లో 78 ఆర్ పి.ఎమ్. రికార్డ్ పై విడుదలైన తలత్ పాడిన గజల్ “తస్ వీర్ తేరి దిల్‌మెరా బెహలాన సకేగీ…” ద్వారా fine singing అన్నది మనదేశంలో మొదలయింది. మహోన్నతమైన గాయకుడు మొహమ్మద్ రఫీ కూడా‌ తలత్ నుంచే ఈ సుగుణాన్ని తీసుకున్నారు.‌

భారతదేశ చలన చిత్ర , లలిత, గజల్ గానాలు తలత్ వేసిన బాటలోనే నడిచాయి.‌ అదే‌ విధంగా పీ.బీ.శ్రీనివాస్ చూపించిన దారిలోనే దక్షిణభారతదేశ చలన చిత్ర గానం సాగింది. అత్యంత గొప్ప గాయకులైన కె.జె.ఏసుదాస్, ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం ఈ ఇద్దరూ పీ.బీ. శ్రీనివాస్ నే అనుసరించారు. పీ.బీ.‌ శ్రీనివాస్ గాన విధానాన్నే ముందుకు‌ తీసుకువెళ్లారు. వారిరువురి గాన‌విధానాలకు పీ.బీ.శ్రీనివాస్ గానవిధానం ఆది.

దక్షిణ భారత దేశ చలన చిత్ర గానం‌ గుఱించి‌ చెబుతున్నఫ్పుడు‌ “పీ.బీ. శ్రీనివాస్ కు ముందు పీ.బీ. శ్రీనివాస్ కు తరువాత” అని చెప్పాల్సి ఉంటుంది. పీ.బీ. శ్రీనివాస్ దక్షిణ భారత‌చలన చిత్ర గానానికి ఒక‌ transitional Icon. అంతే కాదు వారు చలన చిత్ర‌ గానానికి ఒక visionary and awakener కూడా. గానంలో elaborate aesthetic embellishment ను పీ.బీ. శ్రీనివాస్ మనకందించారు.

పీ.బీ.శ్రీనివాస్ గానంలో ఉన్న musicality విశేషమైనది. కర్ణాటక,‌ పాశ్చాత్య, హిందూస్థానీ, జానపద రుచుల (flavours)ను సమర్థవంతంగా పలికించగలిగారు. ఇతర గాయకులు‌ ఒకటి ఇవ్వగలిగితే మరొకటి ఇవ్వలేకపోయారు. తమిళ్ లో ఎం.ఎస్. విశ్వనాద(థ)న్, కన్నడంలో విజయభాస్కర్ సంగీత దర్శకులుగా పీ.బీ. శ్రీనివాస్ ద్వారా ఎన్నో పాటలలో పాశ్చాత్య రుచులను సాధించగలిగారు.

ఆదినారాయణ రావు తమిళ్ లో చేసిన “అడుత్త వీట్టు పెణ్” సినిమాలో “కణ్ణాలే పేసి పేసి కొల్లాదే” పాట‌తో పీ.బీ. శ్రీనివాస్ అంతర్జాతీయ గానాన్ని (global singing) దక్షిణ భారతానికి తెచ్చారు.

కె.వీ. మహాదేవన్ తమిళ్ష్ లో చేసిన వీర అభిమన్యు సినిమాలో శహాన రాగంలో చేసిన‌ “పార్తేన్ సిరిత్తేన్…” పాటలో ఆ రాగ ఛాయను పీ.బీ. శ్రీనివాస్ పలికించిన తీరు మరొకరి ద్వారా రాలేదు. ఎం.ఎస్. సుబ్బలక్ష్మి , డి.కె. పట్టమ్మాళ్, బాలమురళి కృష్ణ, పినాకపాణి వంటి శాస్త్రీయ సంగీత గాయకులకు పీ.బీ.శ్రీనివాస్ అంటే ప్రత్యేకమైన అభిమానం. పీ.బీ. శ్రీనివాస్ “నవనీత‌ సుమ‌‌సుధ‌” అన్న కొత్త రాగాన్ని సృష్టించారు. దానికి సాహిత్యాన్నీ కూర్చి పాడారు.‌

(కర్ణాటక‌ సంగీతంలోని మేళ‌‌కర్త రాగాలను‌‌ గణిత సూత్రం ఆధారంగా సులభంగా గుర్తించేందుకు Diamond-Key అన్న‌ విధానాన్ని రూపొందించారు.)

సంగీత దర్శకుడు ఎం.ఎస్. విశ్వనాదన్ ఉర్దూ గజళ్ల‌ లాంటి పాటలను‌ చేసి పీ.బీ.శ్రీనివాస్ చేత మాత్రమే పాడించేవారు. “చిగురాకులలో ఊయలలో…”, “పూవువలె విరబూయవలె…”, “నిలవే ఎన్నిడమ్ నెఱుంగాదే…” వంటి పాటలను‌ ఎం.ఎస్.‌ విశ్వనాదన్, పీ.బీ.శ్రీనివాస్ గాత్రం,‌ గానం‌ ఉండడంవల్లే చేశారు. పూవువలె విరబూయవలె పాటకు తమిళ‌ రూపం పొలీస్ కారన్ మగళ్‌ చిత్రంలో “పొన్ ఎన్బేన్ సిరు పూ ఎన్బేన్…” పాట. ఈ పాటలో పీ.బీ. శ్రీనివాస్ polite resonant rounded even baritone అంతర్జాతీయ స్థాయిలో ఉంటుంది.

ఈ‌ పాటలో వారి గాత్రంలోని verve ప్రత్యేకమైనది. “నిలవే ఎన్నిడమ్ నెఱుంగాదే…” తమిళ్ష్ పాటను గజల్ గాయకుడు గులామ్ అలీ ఒక వేదికపై పాడారు. పీ.బీ. శ్రీనివాస్ గానం, గాత్రం గులామ్ అలీ చేత ఆ‌ పని‌ చేయించింది. ఈ‌ పాటను తెలుగులో (మంటలు రేపే నెలరాజా) పాడాల్సి వచ్చినప్పుడు “నేను‌ శ్రీనివాస్ లాగా పాడగలనా” అని అన్నారు.

ఘంటసాల. పాడబోయేది‌ పీ.బీ.శ్రీనివాస్ కాబట్టి కె.వీ. మాహాదేవన్ పొన్ని తిరునాళ్ అన్న తమిళ సినిమాలో బడే గులాం ఆలీ ఖాన్ పహాడీ రాగ గానాన్ని మనసులో పెట్టుకుని “ఏన్ సిరిత్తాయ్…” అన్న గజల్ లాంటి పాటను చేశారు.సంగీత‌ దర్శకుడు ఇళయరాజా కడవుళ్‌ అమైత్త మేడై అన్న‌ తమిళ సినిమాలో‌ “తెన్ఱలే‌ నీ పేసు…” అన్న ఒక‌‌ గొప్ప‌ పాటను మెహ్ దీ హసన్ గానస్థాయిలో ఉండే ఉర్దూ‌ గజల్ లా చేసి‌ పీ.బీ. శ్రీనివాస్ చేత‌ పాడించారు.‌

కొన్ని సందర్భాల్లో పి.బి. శ్రీనివాస్ గాత్రంలో nasal timbre కూడా ధ్వనిస్తూంటుంది. ఇది ఉర్దూ‌ శబ్దాల ఉచ్చారణకు ఎంతో‌ అనువుగా ఉంటుంది.గజల్ గానానికి బాగా పొసుగుతుంది. ఈ nasal timbre ప్రముఖమైన గజల్ గాయకుడు గులామ్ అలీలో కూడా ఉంది.

పీ.బీ. శ్రీనివాస్ తొలి తెలుగు గజల్ గాయకుడు. 1967 లో దాశరథి‌ రాసిన “నీ కొంటె‌‌ చూపులోన కురిసింది పూలవాన” అన్న గజల్‌ను ఈమని శంకర శాస్త్రి స్వరకల్పనలో పీ.బీ. శ్రీనివాస్ పాడారు. ఆ గజల్ గానం తెలుగులో ఇప్పడున్న లొల్లాయి గానంలా కాకుండా ఉర్దూ గజల్‌‌ గాన ధోరణిలోనే ఉంటుంది. తెలుగులో తొలిసారి ఉర్దూ స్థాయి గజల్ గానం చేసినది పీ.బీ. శ్రీనివాస్.

పీ.బీ.శ్రీనివాస్ తాను రాసి,‌ సంగీతం‌ సమకూర్చి, పాడి‌ 1981లో “ఉర్దూ గజల్స్” అన్న ఆల్బమ్ నూ 1984 లో “మెహ్ ఫిల్-ఎ-ఆఫ్ తాబ్-ఓ-మాహతాబ్” అన్న ఆల్బమ్ ను విడుదల చేశారు‌.‌ ఉర్దూ గజల్ గానం చేసిన తొలి తెలుగు గాయకుడు పీ.బీ. శ్రీనివాస్‌. (దక్షిణాదిలో గజల్ కచేరీలు చేసిన విఠ్ఠల్ రావు మరాఠీ వారు)పీ.బీ. శ్రీనివాస్ ఒక ఉర్దూ గజల్‌ వాగ్గేయకారుడు కూడా!

కన్నడంలోనూ తొలిగజల్ కవి-గాయకుడై “ప్రేమె గీతె గళు” అన్న రికార్డ్ ను విడుదల చేశారు వారు. కవ్వాలి లాగా “హీర్” అనే సూఫీ గాన‌విధానం ఉంది. ఇది పంజాబ్ మట్టిపై పుట్టింది. గులామ్ అలీ, మెహ్ దీ హసన్ ఆపై మఱికొందరు ఇతర గాయకులు హీర్ ను పాడారు. పీ.బీ. శ్రీనివాస్ ఉర్దూ హీర్ పాడారు. తెలుగులోనూ తొలిసారి హీర్ ను పాడారు‌. పీ.బీ. శ్రీనివాస్ పాడిన‌ “నమో‌ దేవదేవాయ సనాతనాయ…” అన్న తొలి తెలుగు హీర్ 1980లో ఆకాశవాణి కడప కేంద్రం నుంచి ప్రసారం అయింది.

ఎం.ఎస్. విశ్వనాదన్ 1961లో‌ చేసిన “పావమన్నిప్పు” సినిమాలో పీ.బీ.‌శ్రీనివాస్ కు చేసిన “కాలంగళిల్‌ అవళ్ వసందం…” పాటా, “యార్ యార్ అవళ్ యారో…” పాటా ఒక్క సారిగా దక్షిణాది పాటను‌ జాతీయ స్థాయి‌ పాటగా చేశాయి.‌ యార్ యార్ అవళ్ యారో పాట లత మంగేశ్కర్ వాళ్ల కుటుంబ గీతం.‌ 2004 లో ఆశా భోస్లే విశాఖ పట్నంలో మాట్లాడుతూ తమ కుటుంబానికి నచ్చిన దక్షిణాది‌ గాయకులలో పీ.బీ. శ్రీనివాస్ పేరునే మొదటి పేరుగా చెప్పారు.

గాయకుడు మన్నాడే పాడాక‌ మరొకరు‌ పాడితే అంతకన్నా‌ బాగా‌‌ రాదు. మన్నాడే అంత బాగా‌ పాడతారు. హిందీ సినిమా‌ “పరిణీతా” లో అరుణ్ కుమార్‌ సంగీతంలో “చలీ‌ రాధే రానీ అఖియోమే పానీ…” పాటను మన్నాడే పాడారు.‌‌ ఆ‌ పాట తమిళ్‌లో‌ మణమాలై (1958)సినిమాలో “నెఞ్ జమ్ (నెంజం‌) అలై మోదుదే కణ్ణుమ్ కుళమాగవే…” అంటూ పీ.బీ.ఎస్. పాడారు. మన్నాడే కన్నా పీ.బీ.ఎస్. చాల బాగా పాడారు. పీ.బీ.ఎస్.‌ పాడిన‌ కొన్ని కన్నడం‌ పాటలను‌ హిందీలోకి డబ్ చేస్తూ‌ హిందీ పాటలను మన్నాడే చేత‌ పాడించారు. ఆ సందర్భాలలో మన్నాడే అనేవారట “నన్నెందుకు పిలిచారు?‌‌ శ్రీనివాస్ బాగా పాడతారు కదా” అని.

పీ.బీ.‌శ్రీనివాస్ స్వయంగా రాసి పాశ్చాత్య ధోరణిలో సంగీతం చేసి రెండు ఇంగ్లిష్‌ పాటలు పాడి రికార్డ్ గా (1969)లో‌ విడుదల చేశారు. 1. Man to moon 2. Moon to God. అన్న పాటలు అవి. ఈ ఇంగ్లిష్ పాటలకు గానూ చంద్రుడిపై కాలు మోపిన నీల్ ఆంస్ట్రంగ్ నుంచీ, అమెరికా అధ్యక్షుడు‌ నిక్సన్ (Nixon) నుంచీ ప్రశంసలు అందుకున్నారు పీ.బీ. శ్రీనివాస్. ఇంగ్లిష్‌ పాటలు‌ పాడిన‌ తొలి తెలుగు గాయకుడు పి.బి.శ్రీనివాస్.

పీ.బీ.శ్రీనివాస్ భక్తి‌గానం విశిష్టమైనది. ఎలా అయితే ఘంటసాల పద్యాలు‌ పాడడానికి వరవడి పెట్టారో అలా పీ.బీ. శ్రీనివాస్ శ్లోకాల గానానికి వరవడి పెట్టారు. వీరి‌ భక్తి గానానికి తలమానికం ముకుంద‌మాల గానం. అసలు భక్తి గానానికే పీ.బీ. శ్రీనివాస్ చేసిన ముకుంద మాల గానం తలమానికం. “ముకుంద మాలను రాసిన‌ కులశేఖరాళ్వార్ తానే పాడుకుంటే ఎలా పాడుకునే‌ వారో అలా పి.బి. శ్రీనివాస్ పాడారు” అని ప్రముఖ సంగీత‌ విమర్శకులు వి.ఎ‌.కె. రంగారావు తన ‘ఆలాపన’లో‌ రాశారు.

పీ.బీ. శ్రీనివాస్ అత్యంత ఉదాత్తమైన భక్తి గానం చేశారు. వారికి సరిరాగల భక్తి గానం దేశంలో మఱో ఇద్దరు, ముగ్గురు మాత్రమే చేసి ఉంటారు. శారదా భుజంగ స్తోత్రం, శ్రీ‌దేవ్యపరాథ క్షమాపణ స్తోత్రం, హనుమాన్ చాలిసా,‌ శ్రీ రంగనాథ స్తోత్రం, హయగ్రీవ స్తోత్రం‌, శ్రీ వేంకటశ స్తోత్రం, శ్రీ రాఘవేంద్ర సుప్రభాతం, శ్రీ లక్ష్మీనృసింహకరావలంబం వంటి వాటిని ఎంతో గొప్పగా సంగీతం‌ సమకూర్చి పాడారు పీ.బీ.శ్రీనివాస్. హిందీ భజన్ లను పాడారు. కన్నడ‌ సినిమాలలో పీ.బీ. శ్రీనివాస్ పాడిన కొన్ని భక్తి పాటలు న భూతో న భవిష్యతి.

పీ.బీ.ఎస్.‌ తన కొన్ని తమిళ్ష్, కన్నడం, మలయాళ‌ం పాటల గానంతో కొందఱి ప్రాణాలను‌ నిలబెట్టారు. ప్రముఖ తమిళ్ష్ కవి వాలి “నేను కవిగా నిలబడి ఉంది పీ.బీ.ఎస్. గానం‌వల్ల‌” అని చెప్పేవారు.

పీ.బీ.శ్రీనివాస్ గానం‌లో అత్యంత ముఖ్యమైన అంశం “సమతౌల్యం” (balance). ఈ‌ అంశం‌ మొహమ్మద్‌‌ రఫీ, లత‌ మంగేశ్కర్, మెహ్ దీ‌ హసన్ ల గానాలలో గొప్పగా చోటు చేసుకుని ఉంటుంది. పీ.బీ.ఎస్.‌గానంలో ఈ అంశం తొణికిసలాడుతూంటుంది. పీ.బీ.ఎస్. గానంలో ఒక ప్రత్యేకమైన నిండుతనం ఉంటుంది. ఈ సమతౌల్యం,‌ నిండుతనంవల్ల పీ.బీ.ఎస్.‌ పాడాక ఆ పాటలను మఱో‌ సందర్భంలో‌ మఱో గాయకుడు పాడినప్పుడు‌‌ అవి పలచబడిపోవడం‌ చాలా‌‌ స్పష్ఘంగా‌‌ తెలుస్తుంది. పీ.బీ. శ్రీనివాస్ గాన విధానమూ, మెహ్ దీ హసన్ గాన విధానమూ‌‌ ఒకే అంతస్తులో ఉంటాయి.

మనకు ‘తాళ‌ సమం’ గుఱించి తెలుసు. ‘స్వర సమం’ కూడా ఉంటుంది. సప్త‌స్వరాలలో ఇతర ఆరు‌ స్వరాల ఆలాపనలోనూ షడ్జమం ఉండడం స్వరసమం అవుతుంది. ‘ఒక‌ గాత్రం‌ స్వరాలను పలుకుతున్నప్పుడు ఆ‌ స్వరాలలో గాత్రం నిండుగా ఒదగాలి’ అలా ఒదిగితే స్వర సమం సాధ్యపడుతుంది. ఈ అంశం మనకు రఫీ, లత, మెహ్ దీ హసన్, జస్ రాజ్, భీంసేన్ జోషీ, పర్వీన్ సుల్తానా, ఇంగ్లిష్ గాయకులు Pat Boone, Nat king Cole, Jimreeves వంటి వాళ్లలో కనిపిస్తుంది. ఈ స్వర సమం పీ.బీ. శ్రీనివాస్ గానంలో ఉన్నది‌.

దక్షిణాది చలన‌చిత్ర గానంలో‌ యోవ్ డ్ లింగ్ (yodelling)ను తొలిసారి పీ.బీ.‌ శ్రీనివాస్ చేశారు. 1959 లో‌ వచ్చిన తమిళ్ష చిత్రం‌‌ “కూడి ఇరుందాల్ కోడి ఇన్బం” చిత్రంలో “పదుమై దానో…” అనే పాటలో తొలిసారి దీన్ని చేశారు వారు. ఇంగ్లిష్‌లో‌ గాయకులు Bing Crosby ద్వారా ఈ యోవ్ డ్ లింగ్ బాగా పాచుర్యంలోకి వచ్చింది. గాయకులు‌ కిషోర్‌ కుమార్ ద్వారా హిందీ‌‌‌ సినిమా‌ సంగీతంలో ఇది చలామణిలోకి వచ్చింది.

పీ.బీ. శ్రీనివాస్‌ది smooth romantic గాత్రం. వారి warm, relaxed, intimate singing style ప్రేమ‌-గానానికి కచ్చితంగా పొసుగుతుంది. ఉదాహరణ తేనె మనసులు చిత్రంలో “ఏం ఎందుకని…” పాట. “పీ.బీ. శ్రీనివాస్ పాడిన ప్రేమ‌ గీతాల వల్ల మేము ప్రేమించడం నేర్చుకున్నాం” అని ఎందరో పాతతరం తమిళ్షులు, కన్నడీగులు అంటూంటారు.

ఇంగ్లిష్ గాయకుడు Bing Crosby ఒక గొప్ప‌ Crooner. ఆ తరువాత Perry Como గొప్ప Crooner. దక్షిణ భారతదేశపు కాదు… కాదు భారత దేశపు గొప్ప Crooner పీ.బీ. శ్రీనివాస్. అంతర్జాతీయ‌ స్థాయి గాత్రాన్ని, గానాన్ని దక్షిణాది గానంలో కాదు మొత్తం భారత‌దేశ సినిమా‌ గానంలోకి తీసుకొచ్చిన వారు పీ.బీ.శ్రీనివాస్. పీబీ.శ్రీనివాస్ ఒక అష్టభాషా కవి! తనకు తెలిసిన తెలుగు, హిందీ, సంస్కృతం, ఇంగ్లిష్, తమిళ్ష్, కన్నడం, మలయాళం, ఉర్దూ భాషల్లో కవిత్వం రాశారు.

‘ప్రణవం’ పేరుతో 1997లో తన అష్టభాషా‌ కవితా‌ సంకలనాన్ని వెలువరించారు పీ.బీ. శ్రీనివాస్. “నాచన సోముడు అష్ట భాషా కవి అని మనం చదివాం. కానీ ఆ అష్టభాషలు తెలుగు మాండలిక భేదాలే. వేఱువేఱు భాషలు కావు” సీ. నారాయణ రెడ్డి ఈ‌ మాటలు అన్నారు. “మనకు తెలిసిన‌ ఏకైక అష్టభాషా కవి పి.బి.శ్రీనివాస్” ఇవీ సినారె మాటలే.

పీ.బీ.శ్రీనివాస్ వ్రాసిన ప్రణవం; సంస్కృతం, తెలుగు,‌ తమిళ్ష్,‌ కన్నడం, మలయాళం, హిందీ, ఉర్దూ,‌ ఇంగ్లిష్ ఈ ఎనిమిది‌‌ విభిన్న భాషల‌ కవితల సంకలనం. భాషకు ఎనిమిది చొప్పున ఎమినిది భాషలకూ ఎనిమిది‌ వేఱు వేఱు ఇతివృత్తాల కవితలు ఈ ప్రణవంలో పొదగబడినాయి. ఒక్క ఇంగ్లిష్ భాషకు తప్ప తక్కిన ఏడు భాషల కవితలకు ఇంగ్లిష్ లిపి అంతరీకరణమూ,‌ ఇంగ్లిష్ అనువాదమూ ఇవ్వబడ్డాయి.

ఈ సంకలనంలోని కవితలూ, వాటి ఇంగ్లిష్ లిపి అంతరీకరణలూ, అనువాదాలూ కవి పీ.బీ.శ్రీనివాస్ చేతి‌ వ్రాతలోనే ఉంటాయి. ప్రపంచ సాహిత్యంలో ఇలాంటి ప్రయత్నమూ, ఇంతటి ప్రయోగమూ మఱెక్కడా జరగలేదు. ముఖపత్రంలోనే ఎనిమిది భాషలూ కనిపిస్తాయి.

అష్టభాషా‌ కవితా సంకలనం ప్రణవం తెలుగు సృష్టించిన అద్భుతం. ఒక‌ తెలుగు మేధ మాత్రమే అందించగలిగిన అద్భుతం.

ఈ‌ ప్రణవంలో సంస్కృతం, ఉర్దూలతో సహా ఇతర భాషల గజళ్లూ, అంతర్లాపి కవితలూ, అష్టపదులూ, సామాజిక వచన కవితలూ,‌ గేయాలూ, భక్తి గీతాలూ, జానపద గేయాలూ, భజన్ లూ, చోటు చేసుకున్నాయి.

సంస్కృతంలో‌ … “స్తుతిగాన పియూష పానానురక్తమ్” అనీ, తెలుగులో ” భావాలకు పుట్టినిల్లు తెలుగు భాష , పలువన్నెల వానవిల్లు తెలుగు భాష” అనీ, తెల్లనైన నీడలాగా” అనీ “తనువు వేడిని తనువు కొలిచింది” అనీ, తమిళ్ష్ లో “ఒకామే మనకు మాత ఆమే భారతమాత” అనీ, “అహంకారం మూర్ఖత్వానికి సంతానం” అనీ, కన్నడంలో “ప్రకృతి‌ ఒడిలో మనమందఱమూ కలిసిపోదాం” అనీ, “మధురమర్మం” అనీ మలయాళంలో ” నా హృదయం ఒక ఆలయం అది కళల ఆశ్రమంగా కట్టబడింది”‌ అనీ, హిందీలో “భాషా‌ పుల్ హై దీవార్ నహీ(భాష వంతెన, గోడ కాదు ) భాషా గుల్ హై తల్వార్ నహీ( భాష పుష్పం, ఖడ్గం కాదు)” ‌అనీ, ఉర్దూలో “హుస్న్ కీ జబీన్ పర్ మాహ్ తాబ్ హై గజల్ / షాయిరీ కీ షాన్ కా ఆఫ్ తాబ్ హై గౙల్ ( సౌందర్యం ఫాలభాగం పైన జాబిల్లి గజల్/ కవిత్వం ఔన్నత్యం పైన సూర్యుడు గజల్) అనీ, ఇంగ్లిష్ లో “English never gets old. as it is energetic and eternally young in age” అనీ “Oh Death, it is high-time for you to die!” అనీ, Optimism is a prism of colour ful rays / Noble and bold minds receive God’s grace” అనీ “Love is whiter than the pure snow” అనీ ఈ‌ ప్రణవం కవి పీ.బీ. శ్రీనివాస్ తమ‌ కావ్య వాక్యాలనూ, వాక్య కావ్యాలనూ మనకు అందించారు.

“అరుదైన అనర్ఘ‌ రత్నం‌ ఈ అష్టభాషా‌ కవితా‌ సంకలనం ప్రణవం” అని అనడం సరికాదు. ఈ ప్రణవం లోని ఎనిమిది భాషలనూ వెదికి అంతకన్నా అద్భుతమైన అభివ్యక్తితో ఈ ప్రణవంను అభివర్ణించాలి.

తెలుగు గజళ్లలో ఉర్దూ తరహా గజలియత్ ను తీసుకొచ్చిన వారు పీ.బీ. శ్రీనివాస్. ఆ వైనాన్ని చదవండి …
**

పీ.బీ.శ్రీనివాస్ ప్రపంచంలోనే తొలి ఆపై ఏకైక‌ అష్టభాషా‌ గజల్‌‌ కవి. ఉర్దూ,‌ తెలుగు,‌తమిళ్ష్,‌ కన్నడం, మలయాళం,‌ ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం భాషల్లో వారు గజళ్లు వ్రాశారు. గజలియత్ అంటే గజల్ తనం‌. గజల్ ఒక‌ శిల్పాత్మకమైన ప్రక్రియ. గజల్ కు ఒక‌ ప్రత్యేకమైన రచనా‌ సంవిధానం‌ ఉంది. అదే గజలియత్ అవుతుంది. పీ.బీ.శ్రీనివాస్ గజళ్లలో‌ని గజలియత్ ను ఆస్వాదిద్దాం రండి –
తెలుగులో గజళ్ల‌ ద్వారా గౙలియత్ ను తీసుకొచ్చిన తొలి కవి పీ.బీ.‌శ్రీనివాస్. 1974లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వీయ గజల్ ను స్వర‌పఱిచి పాడి ప్రసారం చేశారు వారు. ఆ గజల్ లోని తొలి షేర్
” మన ప్రేమకే సాటిలేదీ జగాన;
మన పాట సాగేను నవ్య స్వరాన.”
గజలియత్ తో వచ్చిన‌ తొలి తెలుగు గజల్ ఇదే. దాశరథి, సీ.నారాయణ రెడ్డి తెలుగులో గజళ్లను రాసినా గజళ్లతో‌‌ తెలుగుకు గజలియత్ ను పరిచయం చేసినది‌ పి.బి.శ్రీనివాసే. తొలి తెలుగు గజల్ గాయకుడు, వాగ్గేయకారుడు పీ.బీ. శ్రీనివాస్.
1980 లో ఆకాశవాణి కడప కేంద్రంలో ప్రసారమైన గజల్ లోని తొలి‌ షేర్:
“కల్పనలు సన్నాయి‌ ఊదే‌ వేళ‌ చింతలు దేనికి?
కవితలనె అర్పించు కానుక లోక‌‌కళ్యాణానికి”. ఆ‌ గజల్ లోని మఱో రెండు షేర్ లను గమనిద్దాం… “సృష్టి అందాలే కదా దీపాలు కలతల బాటలో / క్షేమమే ఆ వెలుగులో సాగే ప్రతి నయనానికి”. “పాట పాటకి దేవుడే కద ప్రాణమనదగు పల్లవి/ పల్లవే లేకున్న గమనం సాధ్యమా చరణానికి”.
పీ.బీ.‌‌శ్రీనివాస్ ఇతర తెలుగు గౙళ్లలోని గౙలియత్ ను చూసే ముందు ఒకసారి వారి ఉర్దూ గౙళ్ల గౙలియత్ ను చూసొద్దాం…
“చార్ దిన్ కీ జిందగానీ క్యూం‌ కిసీసే దుష్ మనీ/ దుష్ మనీ చాహేతొ కర్లే దుష్ మనీసే దుష్ మనీ” (నాలుగు రోజులదీ జీవితం ఎందుకు ఇతరులతో శత్రుత్వం / శత్రుత్వమే కావాలనుకుంటే చెయ్యి శత్రుత్వం తోనే శత్రుత్వం). ఈ రచన గజల్ కు ఉండాల్సిన దావా దలీల్ టెక్నిక్ కు నిలువెత్తు ఉదాహరణ. ఇది సిసలైన గజలియత్. మఱో ఉర్దూ గజల్ లో “జిస్ కి బూసె‌ మన్ లుటే వోహ్ గులాబ్ హై‌ గజల్/ నూర్‌ జిస్ క హై బదన్ వోహ్ షబాబ్ హై‌ గజల్”
(గజల్ ఒక గులాబీ అది మెదడుకు‌ మత్తెక్కిస్తూ ఉంటుంది/ గజల్‌ అన్నది యవ్వనం దాని తనువు వెలుగై‌ ఉంటుంది) అన్నారు.
వారి ఇతర భాషల‌ గజలియత్ ను కూడా‌‌‌‌‌ ఒకసారి చూద్దాం. తమ సంస్కృతం గజల్ లో‌ ఒక‌ షేర్ వ్రాశారు ఇలా: “దరహాస‌ జాత‌ సిత కిరణ వందేహం/ స్వర గీత‌ మాలికా‌భరణ వందేహం” (దరహాసం నుంచి పుట్టిన‌ స్వచ్ఛమైన కిరణాలు కలవాడా నా ప్రణామం/ స్వర రాగ మాలికా భరణాలు కలవాడా నా ప్రణామం).
తమ తమిళ్ష్ గజల్ లో‌ ఒక‌‌ షేర్ ఇలా‌ వ్రాశారు: “ఒళియిన్ ఉరువిల్ తిగళ్ న్దిడాద నిఱమే ఇల్లై / ఉడల్ తన్నిల్ ఉయిరై విడ‌ నిజమే‌ ఇల్లై” (వెలుగు రూపంలో ప్రకాశించని‌ వర్ణమే లేదు/ శరీరం లోపల ప్రాణం కన్నా సత్యమే లేదు). కన్నడం గజల్ లో ఒక‌ షేర్ ఇలా వ్రాశారు: “స్నేహ సౌందర్య‌రాశి నీ నెంబె / నిన్న ప్రేమానురాగి నా నెంబె”
(స్నేహ‌ సౌందర్య రాశివి, నువ్వు ధ్రువీకరిస్తున్నావు / నీ ప్రేమ ప్రేమికుణ్ణి, నేను ధ్రువీకరిస్తున్నాను)‌. మలయాళం‌‌ గజల్ లో ఇలా ఒక షేర్ వ్రాశారు: “పెణ్ మానే ఎణ్డే చుణ్డుగళిల్ నీ రసమయ‌‌ చుమ్బనమ్ నల్గేణమ్/ ప్రియసఖీ ఎనిక్కు ప్రగాఢమాయొరు ప్రేమాలింగనమ్ నల్గేణమ్” (ఓ ఆడ‌ జింకా , నువ్వు నా పెదవులపై రసమయ‌ చుంబనాన్ని ఇవ్వాలి/
ప్రియసఖీ, నాకు ప్రగాఢమైన ప్రేమాలింగనాన్ని ఇవ్వాలి. గజల్ అన్న‌ పదానికి జింక అనే అర్థం కూడా ఉంది).
ఒక హిందీ గజల్‌‌ షేర్ లో ఇలా వ్రాశారు:
“భాషా పుల్ హై దీవార్ నహీన్ / భాషా గుల్ హై తల్వార్ నహీన్” (భాష ఒక వంతెన, గోడ కాదు/ భాష ఒక పువ్వు , చురకత్తి కాదు). ఒక ఇంగ్లిష్‌ గజల్‌ లో ఇలా షేర్ లు వ్రాశారు: ” ఐ‌ హావ్ డన్ ఎవ్రి తింగ్ ఫర్ యువర్‌ సేక్ / ఐ‌ విల్ డు‌‌ ఎని తింగ్‌ ఫిర్ యువర్ సేక్… ” త్రూ అవుట్ ద నైట్ జస్ట్ కౌంటింగ్‌ ద స్టార్స్ / ఐ‌ హావ్‌ బీన్ వెయిటింగ్ ఫర్ యువర్‌ సేక్” (నేను అన్నీ చేశాను నీ కోసం / నేను‌ ఏమైనా చేస్తాను నీ కోసం”… రాత్రంతా నక్షత్రాల్ని‌ లెక్కించాను / నేను వేచి ఉన్నాను నీ కోసం)
“గజలు తెఱచేను తలపుల తలుపు/ గజలంటేనే వలపుల పిలుపు”,
“అందాలు చిందు రచన గజల్/
ఛందాల వింత సృజన గజల్”
(2015లో విడుదలైన గేయ కవితలు సంకలనం నుంచి) అని అన్న పీ.బీ.శ్రీనివాస్
తెలుగు గజళ్ల‌లోని గజలియత్‌ను సందర్శిద్దాం…
(1996లో విడుదలైన గాయకుడి గేయాలు‌ సంకలనం‌ నుంచి‌ కొన్ని‌ గజళ్ల షేర్ లు)
“చెలగు కోరిక తీరకుంటే వేదనే/ జీవితం కన్నీట కరిగే కాగితం”
“వలలు పన్నే వర్ణజాల భ్రాంతిలో / కలలు చూపే కల్ల పేరే జీవితం”
“మాటలలో తియ్యదనం, చేతలలో చేదుతనం/ మనసులలో ముఱికి పెంచి తనువు నుతుకుతున్నాడు”
(2015 లో విడుదలైన గేయకవితలు సంకలనం నుంచి కొన్ని‌‌ షేర్ లు)
“విధి యిద్దరినీ విడదీసి నప్పుడు అందఱిలో ఒంటరినై / వెఱ్ఱి కుదిరింది తలకి రోకలిని చుట్టమని అడుగుతున్నాను” ‌తలకి రోకలి చుట్టడం అన్నది తెలుగు నుడికారం. గౙలియత్ ను ఇలా తెలుగు నుడికారంతో మేళవించడం అపూర్వం‌. అద్వితీయం.
“…. ప్రియతమవగు నువ్వు నవ్వి ఊరుకుంటున్నా / నయము కాబోని గాయాలనె గేయాలుగా నడుపుతున్నాను”
” నీ తలపుతోనే బ్రతుకుతునాను / నిను వలపుతోనే‌ వెతుకుతున్నాను”
“నీ తలపే బ్రతుకు బరువు నాచే మోయిస్తోంది / నీ వలపే కవితల్ని నాచే రాయిస్తోంది”
” నీ విముఖతే సుముఖతయై సూక్తులు సాయిస్తోంది” ( సాయించడం అంటే ఉపదేశించడం, అనుగ్రహించడం,‌ ఇవ్వడం)
“వంతల చితికెక్కించీ నన్ను ఎందుకు బ్రతకనిచ్చేవు” (ఇక్కడ వంత అంటే మనోవ్యథ అని అర్థం)
“ప్రణయంలో ప్రళయమైనా క్షణభంగురమే / ప్రళయంలో కూడ ప్రేమ ప్రేమేనని తెలుసుకో”
“దేవుడు రాసిన కథలలో నాది విరోధాభాసం / తృప్తిలేని మదిలోన నిరాశ పెదవులపై దరహాసం”
“విడదీయగలదు విధి ప్రేయసీ ప్రియులనీ
విడదీసి కలపడం విధికైన తెలియదు”
“చావు తనూ చనిపోవాలి / ఇలలో వలపు సదా బ్రతకాలి”
“చీకటికి తావసలే లేదు‌ నా‌‌ దృష్టిలో‌ / నా కన్నుల‌ వెలుగునది‌ నీ మెఱుపు మాత్రమే”
గొప్ప ఉర్దూ‌‌ గౙల్ ను తలపించే సిసలైన గజలియత్ తో పీ.బీ. శ్రీనివాస్ వ్రాసిన ఓ తెలుగు గజల్ ఇది:

ఇలాగే నిన్నే తలచీ తలచీ పిలిచి పిలిచి నే చావాలా?
ఇలలోలాగే కలలోకూడా కలుసుకుని విడిపోవాలా?

భలేదానివేనే నా చెలియా! నా నుండి నన్నే విడదీశావు
కలపాలి తిరిగి నన్ను నిన్నూ అని నేనే నిన్నడగాలా?

వలచినదానివి నా మదిని దొలిచి వదలుటకెటు మనసొచ్చింది?
దొలచబడిన నా మదిలో గాయాలని కన్నీటితోనె కడగాలా?

ఒకటా రెండా లెక్కలేనన్ని నాకు నీవిచ్చు గాయాలు
వికటించే గాయాలనే నే గేయాలుగ పాడుతూండాలా?

విశ్వసాక్షినై అన్నీ చూసే నేను నినె చూసి వలచాను
ప్రియభాషిగ నేనెదిగీ, విఱిగి విరహ కవితలే రాయాలా?

ఆలించవె నా ఆత్మ మొఱలనో చెలి మదికరిగి
లాలించాలేకాని శోకమిడి విలపించేలా చేయాలా?

నా మదిని పిండి వేదన తీసి నా చేత నిప్పు తినిపించేవు
నా నిండు గుండె దోచుకుని యిలా ముక్కలుగ చేసివేయాలా?
*
ఈ గౙల్ లో విశ్వసాక్షి , ప్రియభాషి అన్నవి పీ. బీ. శ్రీనివాస్ తఖల్లుస్ లు (కలం‌‌ పేర్లు).

ఉర్దూ కవులలా రెండు తఖల్లుస్ లనూ,‌ హుస్న్-ఎ-మత్ లాలనూ, ఒక గజల్ లో అన్ని షేర్ లనూ మత్ లాలుగానూ‍, ఒక గజల్ లో రెండుసార్లు తఖల్లుస్ నూ, తెలుగులో తొలిసారి వ్రాసింది పీ.బీ. శ్రీనివాస్‌.
పీ.బీ.శ్రీనివాస్ గజల్ మీద యతి, ప్రాసలతో పాటు గజల్ లక్షణాలైన కాఫియా, రదీఫ్ లతో ఇలా ఒక వృత్తం రాశారు:

మల్లెల సరమై, తావుల వనమై మత్తును గొల్పెడి సౌరు గజల్
వెల్లువ వడియై, జీవన సుధయై వెన్నెల వెల్గెడి తీరు గజల్
అల్లగఁ గవితల్ కల్పన లలలై అప్సర మీటు సితారు గజల్
చల్లని తలపై, వెచ్ఛని వలపై సాగెడి తీగల తేరు గజల్.

తన గజళ్ల‌ ద్వారా పీ.బీ. శ్రీనివాస్ సహజమైన, సరైన, సొంపైన,‌ ఇంపైన గజలియత్ ను తెలుగులోకి తీసుకొచ్చారు.
సీ. నారాయణరెడ్డి ఆదిగా గజల్ కాని, గజలియత్ లేని నాసిరకమైన రచనలు తెలుగులో ఇవాళ గజళ్లు అని చలామణిలో ఉన్నాయి. ఈ గజళ్లు అన్న రచనల్లో తెలుగు కూడా భ్రష్టుపట్టింది.‌ బాధాకరం ఇది. ఒక‌ వికృత రచనగా తెలుగుకు తలవంపుగా ఇవాళ తెలుగులో‌ గజల్ అనేది కనిపిస్తోంది. ఈ‌ పరిస్థితిలో‌ పీ.బీ. శ్రీనివాస్ గజళ్ల ద్వారా తెలుగులోకి వచ్చిన‌ గజలియత్ ను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
చలన చిత్ర నేపథ్య గాయకుడు, అష్టభాషా కవి,‌ నూతన‌ ఛందస్సృష్టి‌కర్త, సంగీతవేత్త, గజల్ వేత్త, పాత్రికేయుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన
పీ.బీ.శ్రీనివాస్ పై ఆంగ్లంలో, తమిళ్ష్ లో, కన్నడంలో పుస్తకాలు వచ్చాయి.
పీ.బీ. శ్రీనివాస్ పేరుతో బంగళూరులో‌ ఒక పార్క్ ఉంది. కర్ణాటక, తమిళనాడుల్లో పలుపురస్కారాలు వారిని వరించాయి.
హంపి విశ్వవిద్యాలయం అత్యంత ప్రతిష్ఠాకరమైన “నాడోజ” పురస్కారంతో పి.బి. శ్రీనివాస్ ను గౌరవించింది.

వారి స్మరణలో

– రోచిష్మాన్
9444012279

LEAVE A RESPONSE