పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు సైకిల్ యాత్ర

భీమవరం: పేద కుటుంబాల సొంతింటి కల టిట్కో ఇల్లు వెంటనే మిగిలిన 10 శాతం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేస్తూ పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు పాలకొల్లు నుండి అమరావతి అసెంబ్లీ వరకూ సైకిల్ యాత్ర చేపట్టారు.

సైకిల్ యాత్ర భీమవరం చేరగానే భీమవరం టిడిపి నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే రామానాయుడికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ టిడిపి హయాంలో 90 శాతం పూర్తి చేసిన టిట్కో ఇళ్లు నేటి వరకు లబ్ధిదారులకు ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, ఇప్పుడు కూడా మిగిలిన 10 శాతం పూర్తి చేయకుండా వాటికి రంగులు వేస్తోందని, రంగులు కాదు మిగిలిన 10 శాతం పనులను పూర్తి చేయాలి అనే నినాదాలతో సైకిల్ యాత్ర అసెంబ్లీ వరకు చేస్తున్నానని చెప్పారు.

అసెంబ్లీ లో పేదల ఇళ్లు విషయమై నిలదీస్తాం అని ఆయన చెప్పారు. ఆనాడు అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టుపై నిలదీస్తే అవహేళన గా మాట్లాడారన్నారు. 2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేసి అందిస్తామన్న నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాటలు ఏమయ్యాయని, ఇప్పుడు ఆ నోటి పారుదల మంత్రి ఏమంటారని ఎద్దేవా చేశారు.

టిడిపి హయాంలో 72 శాతం వరకు పూర్తయిన పోలవరం ప్రాజెక్టు మూడు సంవత్సరాలలో పనులు పూర్తి కాలేదని, నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించలేక ప్రాజెక్టు ఎత్తు కూడా తగ్గించిన ముఖ్యమంత్రికి పోలవరం ప్రాజెక్ట్ సందర్శించే హక్కు లేదని ఎమ్మెల్యే రామానాయుడు విమర్శించారు.

Leave a Reply