చేతకాని జగన్మోహన్ రెడ్డి అమరావతిని చేజేతులారా చంపేశారు

– టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ
అమరావతినే రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్ తో రైతులు, మహిళా రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో చేపట్టిన మహా పాదయాత్ర విజయవంతమైంది. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని టీడీపీ విధానం. తుగ్లక్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా తట్టుకొని మొక్కవోని దీక్షతో 450 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన రైతులకు పేరుపేరునా పాదాభివందనం తెలియజేస్తున్నాను.
ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా అమరావతిని నిర్మించాలని చంద్రబాబు భావించారు. ఆయన సామర్థ్యం, పాలనానుభవంపై ఉన్న నమ్మకంతో రైతులు 33 వేల ఎకరాలు అందించారు. వైసీపీ ప్రభుత్వం కనుక అమరావతిని కొనసాగించి ఉంటే రాష్ట్రానికి 2 లక్షల కోట్ల ఆదాయం వచ్చి ఉండేది. చేతకాని జగన్మోహన్ రెడ్డి అమరావతిని చేజేతులారా చంపేశారు. విశాఖను దోచుకోవడానికి అమరావతిపై విష ప్రచారం చేశారు. రాజధానిపై కులముద్రవేసి సంపదకు గండికొట్టారు. అమరావతి మహిళలను వేధింపులకు గురిచేశారు. అమ్మవారికి పొంగలి పెట్టేందుకు వెళుతున్న మహిళలపై నీచంగా ప్రవర్తించారు.
రాజధాని రైతులపై 1100 అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారు. ఎస్సీలపై అట్రాసిటీ కేసులు, మహిళలపై డెకాయిట్ కేసులు పెట్టిన మీరా మహిళా సాధికారత గురించి మాట్లాడేది? కోర్టులో చివాట్లు తప్పవనే భయంతో 3 రాజధానుల బిల్లును వెనక్కు తీసుకున్నారు . రూ. 50 వేల కోట్ల కోసం

అమరావతి భూములను తాకట్టు పెట్టేందుకు జగర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని తెలిసింది. రాజధాని భూములను కూడా తాకట్టు పెట్టగల సమర్థుడే రాష్ట్ర ముఖ్యమంత్రి. అమరావతిని నిర్మిస్తూనే 13 జిల్లాలను చంద్రబాబు అభివృద్ధి చేశారు.
టీడీపీ హయాంలో అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమలో అభివృద్ధిని పరుగులు పెట్టించాం. జగన్ రెడ్డి స్వార్థ రాజకీయాలు, ధన దాహానికి రాష్ట్రం బలైపోయింది. ఛీ, ఛీ ….సిగ్గుందా వైసీపీ ప్రభుత్వానికి? రాష్ట్ర భవిష్యత్ కోసం పోరాడటమేనా రైతులు చేసిన తప్పు? రాజధానిలో ఎకరంన్నర కంటే తక్కువున్న 25 వేల మంది రైతుల పరిస్థితేంటి? అమరావతి ద్వారా సంపద సృష్టించి ప్రజలకు మంచి భవిష్యత్ ఇవ్వాలని చంద్రబాబు భావించడం తప్పెలా అవుతుంది? ఆదాని సెంటర్, విశాఖ –చెన్నై కారిడార్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, కియా పరిశ్రమ, సెంట్రల్ యూనివర్సిటీ, కర్నూలులో మెగా సీడ్ పార్క్, సోలార్ పవర్ ప్లాంట్, ఉర్దూ యూనివర్సిటీకీ, సెల్ కాన్, శ్రీసిటీ వంటి పరిశ్రమలను తీసుకొచ్చి ఘనత చంద్రబాబు గారిదే. ఇంత చేస్తే చేతకాని, ముందుచూపులేని వైసీపీ ప్రభుత్వం చేసిందేమిటి?
అమరావతిలోని భవనాలకు తాళాలు వేయడం తప్పా జగన్ చేసిందేముంది? రాజధాని లేని రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో అమరావతిని నిర్మించి ఇవ్వాలనుకోవడమేనా ఆయన చేసిన తప్పు? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. హైదరాబాద్ అభివృద్ధి చెబుతుంది చంద్రబాబు స్టామినా ఏంటో. మహా పాదయాత్ర చేస్తున్న రైతులను ఈ ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులను చేస్తే కడుపు తరుక్కుపోతోంది.
ప్రకాశం జిల్లా నాగులుప్పాడులో రైతు చేయి విరగొట్టారు. నెల్లూరు జిల్లాలో యువకుని పొట్టలో ఓ పోలీసు బలంగా కొట్టాడు. మీరు ప్రజలను రక్షించాల్సిన పోలీసులా లేక వైసీపీ కార్యకర్తలా? జగన్ రెడ్డి మెప్పు కోసం వైసీపీ నేతలు ఎంతకైనా దిగజారుతున్నారు. నెల్లూరు జిల్లాలో రైతుల టెంట్లు పీకించి, వారు వంట వండుకోకుండా చేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి ఓ ప్రజా ప్రతినిధా?
బువ్వ పెట్టే రైతులు నడిరోడ్డులో అన్నం తినేలా చేస్తారా? పులివెందులకు మీరూ, మీ నాయన గుక్కెడు నీళ్లివ్వలేక పోయారు. నీళ్లిచ్చి పులివెందులను బతికించిన మహానుభావుడు చంద్రబాబు .రైతుల పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అంతం కాదిది ఆరంభం. అమరావతే ఏపీకి ఏకైక రాజధాని . వైసీపీ దుష్టపాలనకు ప్రజలు చెరమగీతం పలకడం తథ్యం.