చంద్రబాబు కంటతడి పెట్టడం బాధాకరం: పవన్ కల్యాణ్

303

హైదరాబాద్: కుటుంబ సభ్యులను కించపరచటం తగదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ వైపరీత్యాలు తీవ్ర ఆవేదనను కలిగిస్తున్నాయని పవన్ తెలిపారు. ఒక పక్క వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంటే ప్రజాప్రతినిధులు ఇవేమి పట్టనట్టు ఉన్నారని పవన్ విమర్శించారు. పైగా ఆమోదయోగ్యంకాని విమర్శలు, వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. తన భార్యను కించపరిచారని, ఆమె గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే విధంగా మాట్లాడారని గౌరవ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు కంట తడి పెట్టడం బాధాకరమని పవన్ అన్నారు. ఇలాంటి ఘటనలు సామాన్యులకు రాజకీయ వ్యవస్థపై ఏహ్యభావం కలిగించే ప్రమాదం ఉందన్నారు. ఈ మధ్యకాలంలో సభలు, సమావేశాలు, చివరికి టీవీ చర్చలలో కొన్నిసార్లు వాడుతున్న పదజాలం సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ఉంటోందని పవన్ మండిపడ్డారు.